అమ్మో ఎండలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మే 30 వరకూ అధిక ఉష్ణోగ్రతలు..
– తెలంగాణ, ఏపీలలో మరో రెండు రోజులు ఇంతే..
– ఢిల్లీ, రాజస్థాన్‌, యూపీ, హర్యానాలలో రెడ్‌ అలర్ట్‌ జారీ
– అధిక వేడితో అనారోగ్యం బారినపడే అవకాశాలు..
– ఉత్తరాదిన వచ్చే తుఫాన్‌తో చల్లబడతాం : భారత వాతావరణ శాఖ

లాక్‌డౌన్‌ నిబంధనలు కొంతమేరకు సడలించారు..బయటకు వెళ్లి కొన్ని పనులు చేసుకుందామని భావించిన సామాన్యుడ్ని ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండు రోజులుగా సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్‌ దాటుతోంది. ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రరూపం దాలుస్తున్నది. మే 29 తర్వాత ఉత్తరాదిన తుఫాన్‌ వచ్చే అవకాశముందని, దాంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేడి గాలుల తీవ్రత మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని తెలిపింది.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతున్నది. అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు… వేడి గాలులు.. ప్రజల్ని తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఎక్కడా కూడా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావటం లేదు. ఉదయం 7 గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా సాయంత్రం ఆరు గంటలకు దుకాణాలు, ఇతర మార్కెట్‌ సముదాయాలు మూతపడటం ఇబ్బందిగా మారింది. మరికొద్ది రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సీయస్‌ దాటుతుందని ఐఎండీ అంచనావేసింది. రాబోయే రెండు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, చండీగఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఐఎండీ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని, అధిక ఉష్ణోగ్రతలు అన్ని వయసులవారినీ అనారోగ్యం బారిన పడేస్తాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర భారతంలో నెలాఖరులో తుఫాన్‌ వచ్చే అవకాశముందని, దాంతో అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలుగుతుందని ఐఎండీ తెలిపింది.

దేశంలో వాతావరణ పరిస్థితులను తెలియజేసేందుకు ఐఎండీ నాలుగు రంగుల్లో సూచికలు విడుదలచేస్తుంది. ఈ సూచికలో ఆకుపచ్చ రంగు సాధారణ ఉష్ణోగ్రతల్ని తెలియజేయగా, ఎరుపురంగు సూచిక అసాధారణ వాతావరణ పరిస్థితుల్ని తెలియజేస్తుంది. ఐఎండీ అధికారులు ఒకవేళ రెడ్‌ అలర్ట్‌ జారీచేస్తే, ఆ ప్రాంతంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. అధిక ఉష్ణోగ్రతలతో రోగాల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మే 30 వరకూ జాగ్రత్త
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, గంటకు 50-60 కి.మీ వేగంతో వడ గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు సోమవారం ప్రకటించారు. దీనిపై ఐఎండీ ఉన్నతాధికారి కుల్దీప్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ, మే 29 తర్వాత ఉత్తర భారతదేశంలో తుఫాన్లు వచ్చే అవకాశముంది. తద్వారా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఛండీగఢ్‌ రాజస్థాన్‌ రాష్ట్రాలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ వేసవికాలం తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశామని ఆయన అన్నారు.

విదర్భ ప్రాంతంలో ఉష్ణో గ్రతలు రికార్డుస్థాయిలో 46 డిగ్రీల సెల్సీయస్‌ నమోదైంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 46 డిగ్రీల సెల్సీయస్‌ దాటింది.
బీహార్‌, జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌, తూర్పు యూపీ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మరో 3 డిగ్రీల సెల్సీయస్‌ పెరగనున్నది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates