హత్య చేయించింది అల్లుడే?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలు కలిపారు 
  • బతికుండగానే.. బావిలో పారేశారు
  • వీడిన గొర్రెకుంట బావి మృతుల మిస్టరీ!
  • నేరం అంగీకరించిన ఇద్దరు బిహారీలు
  • మక్సూద్‌ అల్లుడి ఆదేశాలతోనే హత్య!

వరంగల్‌ రూరల్‌ : సంచలనం సృష్టించిన వరంగల్‌ రూరల్‌ జిల్లా గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల కేసు మిస్టరీ వీడింది. మక్సూద్‌ కుటుంబంతోపాటు.. మరో ముగ్గురిని మట్టుబెట్టింది ఇద్దరు బిహారీ యువకులని పోలీసులు నిగ్గు తేల్చారు. మక్సూద్‌ అల్లుడి ఆదేశాల మేరకే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు గుర్తించారు. పుట్టినరోజు పార్టీలో.. కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలు కలిపి, వారంతా నిద్రలోకి జారుకున్నాక.. వారిని గోనెసంచుల్లో కుక్కి, బతికుండగానే బావిలో పారేసినట్లు నిర్ధారించారు.

గొర్రెకుంటబావిలో మృతదేహాల కలకలం నేపథ్యంలో పోలీసులు మక్సూద్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండే 20 మంది బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. మృతులందరి సెల్‌ఫోన్లు గొర్రెకుంట బావి వద్దే గురువారం ఉదయం 5.30కు స్విచాఫ్‌ అవ్వగా.. మక్సూద్‌ వాడే ఫోన్‌ మాత్రం అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని కట్ర్యాల-నందనం గ్రామాల మధ్యలో ఉదయం 8 గంటలకు స్విచాఫ్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిది హత్యేననే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతోపాటు 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మూడు రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించారు.

వివాహేతర సంబంధమే?
పోలీసుల అదుపులో ఉన్న 20 మంది బిహారీ యువకులను విచారించగా.. సంజయ్‌కుమార్‌, మరో యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. మక్సూద్‌, అతడి కూతురి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా నిందితుల్లో ఒకడు వారితో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్లు, వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు తేల్చారు. మక్సూద్‌ కుటుంబంలో ఓ మహిళతో సంజయ్‌కుమార్‌కు వివాహేతర సంబంధం ఉండేదని గుర్తించారు.

మక్సూద్‌ భార్య, అతడి కూతురికి సంజయ్‌ కొంత అప్పిచ్చాడు. వారు ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. దీనికితోడు.. మక్సూద్‌ కుటుంబం ఉంటున్న గోదాం పైగదిలో నివసించే శ్యాం, శ్రీరాంలతో మక్సూద్‌ భార్య, కూతురు సన్నిహితంగా ఉండటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. మక్సూద్‌ బంధువైన ఓ మహిళను విచారించిన పోలీసులు కూడా.. ఈ హత్యలకు వివాహేతర సంబంధాలే కారణమని గుర్తించారు. మక్సూద్‌ పెద్దకుమారుడు షాబాజ్‌ పుట్టినరోజు వేడుకను హత్యకు ఉపయోగించుకోవాలని సంజయ్‌ నిర్ణయించుకున్నాడు.

అంతకు ముందే.. మత్తుమందు కోసం యూట్యూబ్‌లో సెర్చ్‌ చేశాడు. నిద్రమాత్రలు కొనుగోలు చేసి.. బుధవారం రాత్రి జరిగిన పుట్టినరోజు వేడుకలో మరో మిత్రుడి సాయంతో వాటిని కూల్‌డ్రింక్‌లో కలిపాడు. అందరూ మత్తులో జారుకున్నాక.. వారిని గోనెసంచుల్లో పెట్టి, బతికుండగానే బావిలో పారేశాడు. పార్టీ మధ్యలో వచ్చిన షకీల్‌ కూడా కూల్‌డ్రింక్‌ తాగడంతో అతడిని కూడా బావిలో పడేసి చంపేశాడు.

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌?  అల్లుడి పాత్ర..
సంజయ్‌కుమార్‌, అతడి మిత్రుడే నిందితులని నిర్ధారించిన పోలీసులు.. శనివారమే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో.. మక్సూద్‌ సంఘటనను పూసగుచ్చినట్లు చెప్పాడని తెలిసింది. అయితే.. మక్సూద్‌ అల్లుడు ఖతూర్‌ ఆదేశాలతోనే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో మరో కరీమాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం నిందితులిద్దరినీ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates