కార్మిక హక్కుల అణచివేత – ఆర్థిక వ్యవస్థ కూల్చివేత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మైనారిటీ మతస్థులు, దళితులపై దాడులు చేసిన విధంగానే ప్రజాతంత్ర హక్కులను నియంత్రించి, కార్మిక హక్కుల అణచివేత ద్వారా బీజేపీ ఈ ‘అవగాహన’ను తన చివరి లక్ష్యం దాకా తీసుకుని పోతుంది. గత కొంత కాలంగా చేస్తున్న దాడుల కొనసాగింపులో భాగంగానే కార్మిక వర్గంపై యుద్ధం చేస్తున్న బీజేపీ ఆర్థిక పరిణామాలు వినాశనకరంగా ఉంటాయి.

చేతిలో డబ్బు, తినడానికి తిండి, ఉండడానికి నీడలేక అలసిపోయి భారంగా నడుస్తూ తమ స్వగ్రామాలకు వెళ్తున్న మిలియన్ల సంఖ్యలో ఉన్న వలస కార్మికులను మార్గమధ్యంలో హీనమైన, నాణ్యతలేని క్వారంటైన్‌ శిబిరాల్లో నిర్భందించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ మాటున కార్మికుల హక్కుల పైన ఒక్కసారిగా యుద్ధాన్ని ప్రకటించింది. అనుకున్నట్లే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ద్వారా తన రాజకీయచర్యలు ఈ వర్గ సంఘర్షణకు నాయకత్వం వహించాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా అన్ని కార్మిక చట్టాల (కేవలం నాలుగు తప్ప) అమలును మూడేండ్లపాటు రద్దు చేసింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త యూనిట్లలో వెయ్యి రోజుల పాటు కార్మిక చట్టాలను అమలులో లేకుండా మార్చేసింది. అదే మార్గంలో గుజరాత్‌ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంది. కర్నాటక ప్రభుత్వం న్యాయస్థానంలో వ్యాజ్యం వేసే దిశగా పథకం వేస్తోంది. పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అంతదాకా వెళ్ళక పోయినా 8 గంటల పని దినాన్ని 12గంటల పనిదినంగా మార్చి వేశాయి.

కార్మిక చట్టాల అమలు నిలిపివేత అంటే, యాజమాన్యానికి తమ ఇష్టం వచ్చిన సమయంలో కార్మికులను తొలగించే స్వేచ్ఛ ఉంటుంది. కనీస వేతనాలు పెంచాల్సిన చట్టబద్ధమైన నియమం నుంచి యాజమా న్యానికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా యాజమాన్యం కార్మికులకు ”గాలి, వెలుతురు, మరుగు దొడ్లు, ప్రథమ చికిత్స బాక్సులు, సంరక్షణ పరికరాలు, క్యాంటీన్‌, చిన్నపిల్లల వసతి ఏర్పాట్లు, విశ్రాంతి సమయా”లు సమకూర్చడానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే దీనర్థం, పని పరిస్థితులు భయానకంగా ఉండే చిన్న సంస్థల్లోనే కాదు, పెద్ద పెద్ద సంస్థల్లో కూడా, మార్క్స్‌, ఎంగెల్స్‌లు తెలియజేసిన (19వ శతాబ్దంలో బ్రిటన్‌లో ఉన్న పరిస్థితులు) పరిస్థితులను పోలి ఉంటాయి. ఇది (కార్మికచట్టాల రద్దు) రెండు శతాబ్దాల పాటు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను వెనక్కి నెట్టివేయడమే అవుతుంది.

విదేశీ కంపెనీలు ఇతర ప్రాంతాల్లో తమ పరిశ్రమలు స్థాపించడానికి స్థలాన్ని వెతికేటపుడు, కార్మిక హక్కులపై యుద్ధం దేశంలో పెట్టుబడిని పెంచి, ఉద్యోగాలను పెద్ద ఎత్తున సృష్టిస్తుందన్న వాదన (ముఖ్యంగా చైనా, అమెరికా మధ్యలో ఎటువైపూ పోలేని సందర్భంలో) ముందుకొచ్చింది. కానీ ఈ వాదన కొన్ని కారణాల వల్ల పూర్తిగా లోపభూయిష్టమైనది.

మొదటిది, అనుకూలమైన పని పరిస్థితులను కోరుకోవడం కార్మికుల హక్కు. వాటిని మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో నామమాత్రంగానైనా పొందుపరిచి ఉండక పోవచ్చు, కానీ వాస్తవానికి అవి జాబితాలో చేర్చబడిన వాటి కంటే తక్కువ అనుసరణీయమైనవేమీ కాదు. వాటిని ఎటువంటి సంకోచం లేకుండా, వెంటనే చైనాను పక్కకు పెట్టాలనుకుంటున్న విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్చేయ కూడదు. పని పరిసరాలు ఏ విధంగా ఉండాలి అని మనం కోరుకునే దార్శనికతపైన, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేసే అవకాశవాద ఆలోచనలను మించిన దార్శనికతపైన ఆధారపడి కార్మికచట్టాల నిర్ణయించ బడతాయి. వాటిని మన ఇష్టమొచ్చిన తీరుగా మార్చలేం. వాస్తవంగా కార్మికవర్గంలో ఒక భాగం కన్నా మొత్తం కార్మిక వర్గానికి వర్తించే లక్ష్యంగా ఆ మార్పు జరగాలి.

రెండవది, కార్మికచట్టాలు పెద్ద మొత్తంలో వచ్చే పెట్టుబడుల మార్గంలో అడ్డుగా ఉన్నాయనేది పూర్తిగా తప్పుడు వాదన. ఈ వాదనను బలపర్చే ఒక్క అనుభవపూర్వకమైన రుజువు కూడా లేదు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం నయా ఉదారవాదం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది ”పండితులు” భారతదేశ పారిశ్రామిక పెరుగుదల కార్మికచట్టాల వల్ల పరిమితం చేయబడిందని అనుభవపూర్వకంగా ”చూపించడం” మొదలు పెట్టారు. కానీ వారి ”నిరూపణలు” తప్పు అని రుజువయ్యాయి. అప్పటి నుంచి మళ్ళీ ఆ విధమైన ”నిరూపణలు” ముందుకు రాలేదు.
కాసేపు విదేశీ పెట్టుబడులను ప్రక్కన పెడితే, సైద్ధాంతిక వాదన కూడా అంతే సమానమైన తప్పు. కార్మిక చట్టాల చేత వర్ణించబడే కార్పొరేట్‌రంగం పరిమిత పోటీ, ఏకస్వామ్యం ద్వారా గుర్తించబడుతుంది. ఇక్కడ సంస్థ మార్కెట్‌ షేర్లు దీర్ఘకాలంలో మాత్రమే మారుతాయి. దాని వలన ఏ సంస్థ డిమాండ్‌ అంచనా వృద్ధి అయినా అదే విధంగా ఉంటుంది.

ఏ సంస్థ పెట్టుబడైనా, మార్కెట్‌ అంచనా వృద్ధిని బట్టి నిర్ణయిస్తారు. లాభంలో ఏ విధమైన మార్పైనా పెట్టుబడిపై ప్రభావం చూపదు. కార్మికచట్టాల రద్దు వల్ల కార్మికుల బేరమాడే శక్తి బలహీన పడుతుంది కాబట్టి, వేతన కోత లాభాన్ని పెంచుతుంది. కానీ ఏ సంస్థ శాఖలో గానీ, మొత్తం కార్పొరేట్‌ రంగంలో గానీ చట్టాల రద్దు పెట్టుబడి స్థాయిని పెంచదు.

వేతనాల నుంచి లాభాలకు జరిగే సాపేక్ష మార్పు, కార్మికచట్టాల రద్దు వల్ల ఏర్పడిన దుష్ఫలితాల కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను తగ్గిస్తుంది. ఎందుకంటే లాభాల కోసం వినియోగించిన మొత్తం వేతనాల కోసం వినియోగించిన మొత్తం కన్నా తక్కువ. కాబట్టి, మొత్తం ఆర్థిక వ్యవస్థలోని ఉపాధి అవకాశాలు, ఉత్పత్తులలో తగ్గుదల సంభవిస్తుంది. ఇది కార్మికచట్టాలను రద్దు చేస్తున్న ఆ రాష్ట్రంపైన ప్రభావం చూపదు అనే వాదన ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా వేతనాల నుంచి లాభాలకు జరిగిన మార్పు వల్ల సంభవించిన డిమాండ్‌ తగ్గుదల కార్మికచట్టాలను రద్దు చేసిన రాష్ట్రంలోని ఉత్పత్తులకు మాత్రమే డిమాండ్‌ తగ్గుదల ఉండదు. కానీ ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు పెరుగుతాయన్న అంచనాకు హేతుబద్ధత లేదు.

చైనాను తిరస్కరిస్తూ, ప్రపంచ మార్కెట్‌ కోసం ఉత్పత్తి చేసే విదేశీ పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ఈ పరిస్థితిని ఉపయోగపెట్టుకోవచ్చా? అనేదే ప్రశ్న. ఇక్కడ గుర్తుంచు కోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే వేతన వ్యయం అనేది, విదేశీ పెట్టుబడి తన పరిశ్రమను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అనే అంశాలలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. పని పరిసరాలు, కార్మికుల విద్యా విషయాల స్థాయిపైన ఆధారపడే కార్మికశక్తి యొక్క ఘనత (క్వాలిటీ) కూడా ఒక ముఖ్యమైన అంశమే. మరుగుదొడ్లు, క్యాంటీన్‌లు లేకుండా, తక్కువ వేతనాలకు ఎక్కువ కాలం పనిచేయడం, ఒక్క మాటలో చెప్పాలంటే ఆగ్రహం, అసంతప్తి, సంతోషంగాలేని కార్మికశక్తి చైనాను తిరస్కరించే విదేశీ పెట్టుబడులను ఆకర్షించ లేదు.

ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఎక్కువ పెట్టుబడి అవసరం అంతగా చోటు చేసుకోదనేది వాస్తవం. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనించదగిన విధంగా మందగిస్తూ వచ్చింది. కార్మిక చట్టాల రద్దుకు ముందు కూడా భారతీయ శ్రమ, చైనా శ్రమ కంటే చౌకగా ఉన్నప్పుడు, విదేశీ పెట్టుబడి, అప్పుడు చైనా, ఇతర ఆసియా గమ్యస్థానాల కంటే భారతదేశం పట్ల ఎందుకు ప్రాధాన్యతను ప్రదర్శించలేదు? మళ్ళీ మోడీ ప్రభుత్వం ”మేక్‌ ఇన్‌ ఇండియా” ప్రచారంతో అత్యుత్సాహాంతో వెళ్తున్నప్పటికీ, (మహమ్మారి మనను దెబ్బతీయడానికి ముందు కూడా) మా వస్తూత్పత్తి వద్ధి రేటు ‘0’ లేదా కొంత కాలం అసలు లేదు అనే మాట ఎందుకు?

విదేశీ పెట్టుబడి నిజమైనట్టే, ఇతర రాష్ట్రాల నుంచి భారతీయ పెట్టుబడులను ఆకర్షించడం కూడా నిజమే. ఏదైనా ఎక్కువ పెట్టుబడి అవసరం సంభవించదు. కార్మిక హక్కుల రద్దు మాత్రమే ఎక్కువ పెట్టుబడిని ఇతర దేశాల నుంచి ఆకర్షించదు. ఒకవేళ అదే జరిగితే, కార్మికులకు తక్కువ వేతనాల చెల్లింపులు, దయనీయమైన సౌకర్యాల కల్పన, కొన్ని కార్మిక హక్కులు మాత్రమే కల్పించడం ద్వారా సాధ్యమైనంత చౌకగా వస్తూత్పత్తి తయారీలో రాష్టాల మధ్య ప్రమాదకరమైన పోటీ క్రమం ప్రారంభమవుతుంది.

మనం చర్చించిన కారణాలవల్ల పెట్టుబడి స్థాయిని పెంచని క్రమంలో, వేతనాల నుంచి లాభాలకు జరిగిన మార్పు, మొత్తం సగటు డిమాండ్‌ తగ్గే ప్రభావాన్ని కలిగి ఉంటుంది, తరువాత ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు తగ్గి పోతాయి. ఇది (మార్పు) పెట్టుబడి స్థాయికి తగిన విధమైన మొత్తం లాభాల స్థాయిని పెంచదు. కానీ మొత్తం లాభాల స్థాయిలోనే, ఇది చిన్న పెట్టుబడిదారులు, చిన్న ఉత్పత్తి దారుల నుంచి కార్పొరేట్‌ రంగానికి లాభాలను పునఃపంపిణీ చేస్తుంది. కార్మికచట్టాల రద్దు తరువాత వేతనాలు తగ్గిన ఫలితంగా, చిన్న పెట్టుబడి దారుల ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గి, లాభాలు పెరగకుండా ఉండేవి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ చట్టాల రద్దు కార్మికులపైన మాత్రమే కాక, చిన్న పెట్టుబడి దారులు, చిన్న ఉత్పత్తి దారులపై దాడిగా కూడా చెప్పవచ్చు. ఇది కార్మికులు మాత్రమేకాక చిన్న పెట్టుబడి దారులు, చిన్నఉత్పత్తి దారులతో పాటు మొత్తం సమాజ ప్రయోజనాలను నష్టపరుస్తూ, కార్పొరేట్‌రంగం ప్రయోజనాలను ముందుకు తీసుకొని పోతుంది.

ఇది బీజేపీ నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహజ లక్షణాలను తెలుపుతోంది. వారి ప్రజాతంత్ర హక్కులను కుదించాలన్న ప్రేమ, కార్పొరేట్‌ బాస్‌ ద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక ప్రపంచంతో ఒక ప్రమాదకరమైన ‘అవగాహన’తో కలిసింది. ఈ అవగాహన చాలా మామూలైనది. కార్పొరేట్లకు ఎంత బాగా జాగ్రత్తలు తీసుకొని సాధ్యమైనన్ని సౌకర్యాలు కల్పిస్తే, పెట్టుబడికి, ఉత్పత్తికి, ఉపాధి అవకాశాలకు అంత మంచిదనేది, వందేండ్ల క్రితమే పూర్తిగా వదిలేయబడిన అవగాహన.

మైనారిటీ మతస్థులు, దళితులపై దాడులు చేసిన విధంగానే ప్రజాతంత్ర హక్కులను నియంత్రించి, కార్మిక హక్కుల అణచివేత ద్వారా బీజేపీ ఈ ‘అవగాహన’ను తన చివరి లక్ష్యం దాకా తీసుకుని పోతుంది. గత కొంత కాలంగా చేస్తున్న దాడుల కొనసాగింపులో భాగంగానే కార్మిక వర్గంపై యుద్ధం చేస్తున్న బీజేపీ ఆర్థిక పరిణామాలు వినాశనకరంగా ఉంటాయి.

ప్రభాత్‌ పట్నాయక్‌
”పీపుల్స్‌ డెమోక్రసీ” నుంచి
అనువాదం బోడపట్ల రవీందర్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates