హస్తకళా నిపుణుల ఇక్కట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ముడిసరుకు.. పని.. రేషన్‌.. ఏదీ లేదు
– లాక్‌డౌన్‌తో కార్మికుల కుటుంబాలు పరేషాన్‌
– ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు

న్యూఢిల్లీ : ఓ ముడి పదార్థాన్ని తమ నైపుణ్యంతో ఒక రూపాన్ని తీసుకొచ్చి అందమైన, ఆకర్షణీయమైన వస్తువుగా తీర్చి దిద్దడంలో హస్తకళానిపుణులు సిద్ధ హస్తులు. ఇలా తీర్చి దిద్దడంలో మనకు కనిపించని ఎంతో శ్రమ అందులో దాగి ఉంటుంది. అది, ఒక ఆట బొమ్మ కావచ్చు, చేనేత వస్త్రం కావచ్చు, వస్త్రం మీద పెయింటింగ్‌ కావచ్చు, మట్టి పాత్రలు కావచ్చు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ఆ హస్తకళా నిపుణలు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతి నేపథ్యంలో మోడీ సర్కారు అకస్మాత్తుగా తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ నిర్ణయం వారిని, వారి కుటుంబాల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. పైసా ఆదాయం లేక, రేషన్‌ సరుకులు అందక.. హస్తకళా నిపుణులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏదన్నా కొనాలన్నా పైసా పైసా చూసి కొనాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. ఒక్క పూట తిండితోనే వారంతా కాలం వెళ్లదీస్తున్నారు.

దీంతో ఇప్పుడు వారంతా ప్రభుత్వం తమను ఆదుకుంటుందనీ ఆశతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌తో మా లాంటి కళాకారుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందనీ మధ్యప్రదేశ్‌లోని ఛండేరీకి చెందిన దిల్షద్‌ వాపోయడు. చేనేత కళాకారుడు అయిన దిల్షద్‌.. జాతీయ అవార్డు గ్రహీత. ”లాక్‌డౌన్‌తో పని ఉండదనీ, అన్ని దుకాణాలు మూసేస్తారని మాకు తెలియదు. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో రేషన్‌ ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మాకు కేవలం బియ్యం మాత్రమే అందించింది. ఒక్క బియ్యంతోనే మేము రోజువారీ జీవితాన్ని ఎలా గడపాలి?” అని దిల్షద్‌ ప్రశ్నించాడు. కేంద్ర ప్రభుత్వ సమాచారం 2018-19 ప్రకారం.. ప్రస్తుతం టెక్స్‌టైల్‌ హ్యాండిక్రాఫ్ట్స్‌ సెక్టార్‌పై దాదాపు 68 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగం నుంచి ఎగుమతుల ద్వారా దాదాపు రూ.36,798.20 కోట్ల ఆదాయం వస్తుంది.

చేనేతకార్మికులు, బ్లాక్‌ ప్రింటర్స్‌, కుమ్మరి, వడ్రంగి ఇలా ప్రతి ఒక్క కళాకారుడూ లాక్‌డౌన్‌ తెచ్చిన తంటాలను ఎదుర్కొంటున్నాడు. ” లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఓ ఎన్జీవో మమ్మల్ని కొంత ఆర్థికంగా ఆదుకున్నది. ఇప్పుడు ఆ డబ్బులూ అయిపోయాయి. మా కష్టాలపై సంబంధిత యంత్రాంగానికి ఫిర్యాదులూ చేశాం. కానీ, అటు నుంచి మాకు ఎలాంటి సమాధానమూ రాలేదు” అని దిల్షద్‌ చెప్పారు. హస్తకళా నిపుణుల కోసం పని చేసే దస్తకారీ హాత్‌ సమితికి చెందిన జయ జైట్లీ హస్తకళా రంగం భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ”లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా క్రాఫ్ట్‌ బజార్లకు ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోవచ్చు. సోషల్‌ డిస్టెన్స్‌ వంటి నిబంధనలు ఇందుకు కారణం కానున్నాయి. ఒక వేళ వారికి పని దొరికినా.. తయారైన వస్తువు మార్కెట్లోకి రావటం కష్టంగా మారుతుంది. ఒక వేళ వచ్చినా అది అనుకున్న ధర ఉండకపోవచ్చు. ఇది కళాకారులకు పెద్ద దెబ్బ” అని జయ జైట్లీ చెప్పారు. టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖ నుంచి హస్తకళా నిపుణులకు ఏదైనా సాయం అందినట్టూ సమాచారం లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారి సంక్షేమం కోసం నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates