‌గ్రీన్‌ సిగ్నల్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కట్టడి జోన్లలోనే ఆంక్షలు..
  • మిగతావన్నీ గ్రీన్‌ జోన్లేకట్టడి జోన్లలోనే ఆంక్షలు..
  • మిగతావన్నీ గ్రీన్‌ జోన్లే
  • దుకాణాలు తెరుచుకోవచ్చు
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులూ
  • ఆటోలు, క్యాబ్‌లకూ అనుమతి
  • జీహెచ్‌ఎంసీలోనే సరి బేసి
  • నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌
  • రాత్రిపూట కర్ఫ్యూ యథాతథం
  • రోడ్లపై హంగామా సృష్టించొద్దు
  • తిరగబెడితే లాక్‌డౌనే: కేసీఆర్‌

ఏపీతో ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. మాకేం వివాదాలు లేవు. ఇప్పటి వరకూ అన్యోన్యంగా కలిసి ఉన్నాం. కలిసే ఉంటాం. మేం కలిసుంటే కొంతమంది కళ్లు మండుతున్నాయా!?

రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రభుత్వాలు. మీకు సబార్డినేట్లం కాదు. మాకూ చాలా బాధ్యతలు ఉన్నాయి. శిశుపాలుని వంద తప్పులను మన్నించిన్రు కదా! పాపాలు పండాలి కదా! పండే సమయం వస్తుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కట్టడి ప్రాంతాల్లో(కంటెయిన్‌మెంట్‌ జోన్లు) తప్ప మిగతా చోట్ల అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కట్టడి జోన్లు తప్ప మిగతా అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ప్రకటించారు. జిల్లాల మధ్య, జిల్లా లోపల బస్సులు తిరుగుతాయని చెప్పారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు కూడా బస్సులు నడుస్తాయని తెలిపారు. అయితే, అంతర్రాష్ట్ర బస్సులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ బస్సులు వేరే రాష్ట్రానికి వెళ్లబోవని, ఇతర రాష్ట్రాల బస్సులను రానివ్వబోమని చెప్పారు. హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఉన్నందున సిటీ బస్సులు నడపడం లేదని ప్రకటించారు. రాత్రి ఏడు గంటల కల్లా బస్సు ప్రయాణం ముగిసిపోవాలని, ప్రత్యేక పరిస్థితుల్లో మరో గంట అనుమతిస్తామని తెలిపారు. కొవిడ్‌ నిబందనలు పాటిస్తూ, రోజూ బస్సులను శానిటైజ్‌ చేస్తారని, సిబ్బంది, ప్రయాణికులకు మాస్కును తప్పనిసరి చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని చెప్పారు. కేంద్రం లాక్‌డౌన్‌ -4 మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో  ఏం చేయాలనే అంశంపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌, ఉన్నతాధికారులు రూపొందించిన వ్యూహాన్ని వివరించగా, దాని ప్రకారమే కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు!
హైదరాబాద్‌లోని కట్టడి ప్రాంతాలు తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి ప్రకటించారు. మునిసిపాలిటీల్లో ప్రస్తుతం సగం దుకాణాలు తెరుస్తున్నారని, ఇక అన్ని తెరుచుకోవచ్చని, వ్యాపారాలు సజావుగా నిర్వహించుకోవచ్చని చెప్పారు.

కార్యాలయాలు, పరిశ్రమలకు ఓకే
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ తెరవడానికి అనుమతి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మొత్తం సిబ్బంది విధులకు హాజరు కావచ్చని చెప్పారు. పరిశ్రమలు, ఉత్పాదక సంస్థలు తెరిచి, పనులు చేసుకోవచ్చన్నారు.కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో సరి బేసి!
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయం తీసుకొని నిబంధనలు ప్రకటిస్తారని సీఎం వెల్లడించారు. సరి బేసి విధానంలో సగం దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పారు. కట్టడి ప్రాంతాల్లో ఎలాంటి దుకాణాలు తెరవడానికి వీల్లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ బంద్‌ ఉంటుందని తెలిపారు.

ఆటోలు, టాక్సీలకు అనుమతి!
హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఉంటుందని సీఎం ప్రకటించారు. కారులో, క్యాబ్‌లో డ్రైవర్‌ కలిపి ముగ్గురు, ఆటోలో డ్రైవర్‌ కలిపి ఇద్దరు ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే పోలీసులు చలానాలు విధిస్తారని హెచ్చరించారు.

సెలూన్లకు ఓకే!
కట్టడి ప్రాంతాల్లో తప్ప హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ-కామర్స్‌కు ఆంక్షలు లేకుండా వంద శాతం అనుమతి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

మత కార్యక్రమాలకు అనుమతి లేదు!
అన్ని మతాల ప్రార్థన మందిరాలు బంద్‌ ఉంటాయని సీఎం చెప్పారు. మతమరమైన ఉత్సవాలకు అనుమతి లేదన్నారు. కల్యాణ మండపాలు, మాల్స్‌, సినిమా హాళ్లపై నిషేధం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, స్పోర్ట్స్‌, సిమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియాలు, జిమ్‌లు, పార్క్‌లు, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లన్నీ బంద్‌ ఉంటాయన్నారు.

అన్నీ గ్రీన్‌ జోన్లే!
రాష్ట్రంలో కట్టడి ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా పరిగణిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కట్టడి ప్రాంతాల్లో 1,452 కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు.  కట్టడి ప్రాంతాలన్నీ రెడ్‌జోన్‌గానే పరిగణిస్తామన్నారు. చుట్టూ బారికేడింగ్‌, పోలీస్‌ పహారా ఉంటుందని, లోపలికి ఎవరినీ అనుమతించబోరని, నిత్యావసర సరుకులు, ఔషధాలు ప్రభుత్వమే డోర్‌ డెలివరీ చేస్తుందని చెప్పారు.

తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌
ప్రభుత్వం నిబంధనలు సడలించిందని అవసరం ఉన్న వారు లేనివారు రోడ్ల మీదకు రావొద్దని కేసీఆర్‌ హెచ్చరించారు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడం ఉత్తమమని చెప్పారు. కరోనా మళ్లీ తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. కొంచెం నియంత్రణ, సంయమనం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

వృద్ధులు, పిల్లలను బయటికి రానివ్వొద్దు!
‘‘65 ఏళ్లు దాటిన వృద్ధులను, పిల్లలలను బయట తిప్పొద్దు. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం చేయాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా చూసుకోవాలి. ఇది అందరికీ శ్రేయస్కరం’’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

కరోనాతో కలిసి జీవించాల్సిందే!
కరోనాకు మందు ఎన్ని మాసాల్లో అందుబాటులోకి వస్తుందనే అంశంపై అనిశ్చితి నెలకొందని  కేసీఆర్‌ అన్నారు. ఈ పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించడం అందరూ నేర్చుకోవాలన్నారు. ‘‘మనకు గత్యంతరం లేదు. అటు కరోనా ఉంటది.. ఇటు   బతుకు దెరువు ఉంటుంది.. కలిసి నడవాల్సిందే. అన్ని జాగ్త్రతలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ బతుకు కొనసాగాలి తప్ప, బతుకును బంద్‌ పెట్టుకుని అనేక మాసాలు కూర్చోలేం. అలా చేస్తే చాలా కష్టమవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

మాస్క్‌ తప్పనిసరి
ప్రతీ ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. లేకుంటే, రూ.1000 జరిమానా తప్పదని సీఎం హెచ్చరించారు. భౌతికదూరం కూడా తప్పనిసరి కావాలన్నారు. వ్యక్తిగత శానిటైజేషన్‌ ముఖ్యమని, అందుకోసం ప్రతీ దుకాణంలో శానిటైజేషన్‌ బాటిల్‌ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. దుకాణదారులు కూడా తమ దుకాణాన్ని తప్పనిసరిగా శానిటైజ్‌ చేసుకోవాలన్నారు. అవసరమైన రసాయనాలతో పిచికారీ చేయించుకోవాలని చెప్పారు.

త్వరలోనే బయటపడొచ్చు!
నిబంధనలతో ఇబ్బందులు ఎదురైనా ప్రజలు  సహకరించారని, సంయమనంతో వ్యవహరించారని కేసీఆర్‌ కొనియాడారు. ‘అందరికీ చేతులెత్తి  దండం పెడుతున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అన్నారు. ‘‘మంచి పద్ధతిలో ఉన్నాం. మంచిగా మందుకు పోతున్నాం. తక్కువ కాలంలోనే బయటపడతాం’’ అని చెప్పారు. మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు సడలించినా కేసులు రావడం లేదని, హైదరాబాద్‌లో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా వస్తున్నాయని సీఎం చెప్పారు. కట్టడి ప్రాంతాల్లో చీమ కూడా దూరలేనంత కఠినంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని పరిస్థితులకు   ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆసుపత్రుల్లో 17 వేల పడకలు సిద్ధం చేసిందని వివరించారు. ప్రజలే తమను తాము కాపాడుకోవాలన్నారు.

జర్నలిస్టులను ఆదుకోండి
కరోనా కష్టకాలంలో తమను ఆదుకోవాలని జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశం అనంతరం వారు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. గుర్తింపు కలిగిన ప్రతీ జర్నలిస్టుకు రెండు నెలల పాటు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. రూ.20 లక్షల జీవిత బీమా, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా, వైద్య పరీక్షలకు కూడా వర్తించే విధంగా హెల్త్‌ కార్డులు ప్రకటించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి… మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో మాట్లాడి జర్నలిస్టులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో మారుతీ సాగర్‌, సయ్యద్‌ ఇస్మాయిల్‌, ఎ.రమణకుమార్‌, యూసుఫ్‌ బాబు, సాదిక్‌ తదితరులున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates