మేం దేశానికి మచ్చ నా..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-యూపీలో భారీగా వలస కార్మికుల ఆందోళన

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ జిల్లాలో బీహార్‌కు చెందిన దాదాపు 12 వేల మందికి పైగా వలస కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న తమను పోలీసుల పలు విధాలుగా హింసిస్తున్నారనీ, తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఔరయా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 26 మంది వలస కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల రోడ్డు లేదా వాహనాల ప్రయాణాలపై యోగి సర్కార్‌ నిషేధం విధించిన తరువాత ఆదివారం తాజా ఆందోళన జరగడం గమనార్హం. ‘శిబిరాల్లో ఉన్న మమ్నల్ని పోలీసులు హింసిస్తూ మీ ఇళ్లకు వెళ్లిపోవాలని హూంకరిస్తున్నారు’ అని తిలక్‌ని గ్రామ సమీపంలోని అంబాలా రోడ్డుపై ఆందోళనకు దిగిన కార్మికులు పేర్కొన్నారు. ఉదయం సమయంలో తమ శిబిరానికి చేరుకున్న 10 మంది పోలీసులు తమను లాఠీలతో చితకబాదుతూ ‘మీరు ఈ దేశ ముఖంపై మచ్చలాంటి వారు, వెళ్లి చావండి’ అంటూ దూషించారని పలువురు వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలనీ, తమ కాలినడక ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నామని 25 ఏండ్ల లాల్‌ బహదూర్‌ తెలిపారు.

పంజాబ్‌లోని పాటియాలా నుంచి బీహార్‌కు పయనమైన తనను యూపీ అధికారులు ఈనెల 2న షహరాన్‌పూర్‌ వద్ద అడ్డుకున్నారని చెప్పారు. మరో కార్మికుడు సుదర్శన్‌ కౌషాలా మాట్లాడుతూ ‘ పోలీసుల అధీనంలో ఉన్న ఈ శిబిరాల్లో మేం చనిపోతే బయటి వ్యక్తులకు తెలిసే అవకాశం లేదు. రోడ్డపైనే మా చావులను ఈ ప్రపంచం చూడాలి’ అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన గురించి సమాచారం అందుకున్న షహరాన్‌పూర్‌ డివిజనల్‌ కమిషనర్‌ సంజరుకుమార్‌ వెంటనే ఇతర అధికారులతో అధిక పోలీసు సిబ్బందికి వెంటేసుకొని అక్కడకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రత్యేక రైళ్ల ద్వారా తమను ఒకటి రెండు రోజుల్లో బీహార్‌ పంపుతామని పోలీసులు గత రెండు వారాలుగా చెబుతున్నారని, ఇప్పటికి నాలుగు రైళ్లు మాత్రమే ఏర్పాటు చేశారని కార్మికులు పేర్కొన్నారు.

ఈ 12 వేల మంది కార్మికుల్లో తొమ్మిది వేల మంది రాధాస్వామి సత్సంగ్‌ భాగ్‌లో ఆశ్రయం పొందుతుండగా, మరో మూడు వేల మంది దగ్గర్లోని కమ్యూనిటీ హాల్‌లో ఉంటున్నారు. ఇప్పటి వరకూ తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లు లేదా బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు తీరా ఇప్పుడు వచ్చి రెండు వారాల వరకూ అటువంటిది ఏమీ లేదని చెబుతున్నారని కార్మికులు తెలిపారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ కుమార్‌ సరిహద్దులోని చంధౌలి, దియోరియా ప్రాంతాల వద్ద కార్మికులను దించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

శనివారం రోడ్డు ప్రమాద ఘటన తర్వాత ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల నుంచి యూపీలోకి ప్రవేశించే వలస కార్మికులను ఆయా సరిహద్దు జిల్లాల వద్ద అడ్డుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రవేశించిన వారిని కూడా ప్రయాణాలు కొనసాగనివ్వకుండా ఆపేశారు.

వీరిలో చాలా మందికి తగిన ఆశ్రమం, ఆహారం కూడా ఏర్పాటు చేయలేదని పోలీసు వర్గాల సమాచారం. మథుర, ఝాన్సీ, ఘజియాబాద్‌ వంటి జిల్లాల్లో ప్రయాణాలను కొనసాగించేందుకు ప్రయత్నించిన కార్మికులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

శనివారం సాయంత్రం నుంచి నాలుగు వేల మంది కార్మికులను అడ్డుకున్నామని ఝాన్సీ కలెక్టర్‌ తెలిపారు. వారిని తరలించేందుకు తగిన వాహన సదుపాయాలు లేవని ఆయన చెప్పారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates