ప్యాకేజీ ఓ పచ్చి అబద్ధం..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కాబట్టి ప్రధాని ఈ భారీ ప్యాకేజీని, దీనికి ఆర్థిక మంత్రి ఐదు విడతల సుదీర్ఘ వివరణలనూ చూస్తే, అవి గత బడ్జెట్‌ ప్రతిపాదనల పాత సారానే ఈ ప్యాకేజీ అనే కొత్త సీసాలోకి వొంపినట్టుగా స్పష్టంగా తెలిసిపోతోంది. కాబట్టి ఇదంతా పాత కేటాయింపుల సర్దుబాట్లు, సవరణలే తప్ప కొత్తగా ప్రకటించిందేమీలేదన్నది అక్షర సత్యం. ఈ 20లక్షల కోట్ల ”ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌” ఓ పచ్చి అబద్ధం.

”ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌”.. ఇది ప్రస్తుత మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని ప్రయోగించిన ”మహా మంత్రదడం”. మే 12న మోడీ ప్రకటించిన ఈ 20లక్షల కోట్ల భారీ ప్యాకేజీకి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుస వివరణల పర్వం ముగిసిపోయాక.. చిట్ట చివరికి దీని సారమంతా ”కష్టజీవులకు గంజిమెతుకులు, కార్పొరేట్లకు విందుభోజనాలు” అని తేలిపో యింది. ఆకలితో అలమటించే వాళ్లకూ అవమానా లతో తగులబడే వాళ్లకూ ఆత్మనిబ్భరం ఒక్కటే పరిష్కారమని మాత్రం చెప్పి చేతులు దులుపుకొంది ఈ ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌.

నిజానికి ప్రధాని భారీ ప్యాకేజీ ప్రకటించడంతో దేశమంతా సంతోషించింది. 20లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే ఆ డబ్బంతా ప్రజలవద్దకు చేరితే వినియోగం, ఉత్పత్తి రెండూ పెరిగి ప్రజల సమస్యలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా గట్టెక్కుతుందని ఆర్థికవేత్తలంతా ఆశించారు. కాని ఆమె ఆ ఆశలన్నీ అడియాసలే అని తేల్చి చెప్పాక, ఏలికలెప్పుడూ యజమానులవైపే కానీ బాధిత ప్రజలవైపు కాదని తేలిపోయాక నివ్వెరపోయారు. లాక్‌డౌన్‌ ప్రథమార్థంలో ప్రకటించిన లక్షా డెబ్భైవేల కోట్లు, అంతకుముందు బడా కార్పొరేట్‌లకు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించిన 5లక్షల 24వేల కోట్ల వెసులుబాటును కూడా ఈ ప్యాకేజీలో కలిపేసారు. ఇప్పుడు ఈ ప్యాకేజీపై విత్తమంత్రి విడతలవారి వివరణల్లో కొత్తగా తేలిందేమిటంటే ఇది ఓ అప్పుల విధానమే తప్ప ఇందులో ప్రజలకిచ్చేదేమీ లేదని! లాక్‌డౌన్‌లో ఇబ్బందిపడుతున్న ప్రజలను ఆదుకోవడానికి, కరోనాను నివారించడానికి ఉద్దేశించిన ప్యాకేజీ ఇది. కానీ ఈ రెండూ లేకుండా బడ్జెట్‌కు ముందురోజు ఇచ్చిన ఎకనామిక్‌ సర్వే రిపోర్టుకు అనుగుణంగా ప్రయివేటైజేషన్‌కు పెద్దపీట వేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాను ఒక అవకాశంగా తీసుకుని ప్రజల కంట్లో దుమ్ముకొట్టి ప్రయివేటీకరణకు తెరతీసే విధానమే తప్ప ఇందులో ప్రజలకు ఒనగూరేదేమీలేదు.

వలస కార్మికుల బాధామయ గాథలను మార్చడానికి ఈ ప్యాకేజీ కాసింత నగదు సాయాన్ని కూడా అందించలేకపోవడం ఎంత అమానుషత్వం. కేవలం నెలకు 5 కేజీల బియ్యం చొప్పున ఓ రెండు నెలలు ఇస్తే సరిపోతుందా? ఏడున్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు గిడ్డంగుల నిండా ఉండి కూడా వారి కడుపుకింత తిండి పెట్టలేని ఈ ప్యాకేజీల వలన ఎవరికి ఉపయోగం? ఇక దేశంలో 50శాతానికి పైగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో ఈ ప్యాకేజీ మరోసారి ఎత్తి చూపింది. మార్కెట్లు మూసుకుపోయి, కొనే నాథుడు లేక, ఉన్నా పంటలకు తగ్గ ధర రాక ఇప్పటికే వేల కోట్లు నష్టపోయిన అన్నదాతలకు ఈ ప్యాకేజీ ఇస్తున్న అభయమేమిటి? కేవలం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొత్త రుణాలు, రుణాలపై మూడు నెలల మారిటోరియాలు వారి సమస్యను పరిష్కరిస్తాయా? అయినా ఇప్పటికే ఉన్న పాత క్రెడిట్‌కార్డులకే అప్పులు దొరకడం లేదని రైతులు వాపోతుంటే, ఈ కొత్త క్రెడిట్‌ కార్డుల వల్ల కొత్తగా ఒరిగేదేముంటుంది. వలసకూలీలు, రైతులు మాత్రమే కాదు.. అసంఖ్యాకులైన అసంఘటితరంగ కార్మికులు, ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, లెక్కకు మించిన స్వయం ఉపాధిపరులు, దేశంలో నూటికి 80శాతంగా ఉన్న పేదల్లో ఏ ఒక్క వర్గానికైనా ఈ ప్యాకేజీలో నిర్దిష్టంగా దక్కిందేమిటి? కేవలం అప్పుల నిర్వహణ, రుణ విధానం మినహ ఇందులో ప్రభుత్వం చేసే ఖర్చు ఏముంది?

కొంచెం వివరాల్లోకి వెళితే ఇందుకు బోలెడు ఉదాహరణలు దొరుకుతాయి. చిన్న పరిశ్రమలకు ప్రకటించిన 3లక్షల 70వేల కోట్లు, డిస్కంలకు ప్రకటించిన 90వేల కోట్లు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రైతులకు ప్రకటించిన 2లక్షల కోట్లు, ఎంఎఫ్‌ఐల 75వేల కోట్లు, వీధివ్యాపారులకు 5వేల కోట్లు, గృహ కొనుగోళ్లకు 70వేల కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ రుణాలు, రుణ విధానాలే తప్ప ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఖర్చు చేసేదేమీలేకపోవడం వైచిత్రి! అసలు ఈ ఆపత్కాలంలో కావాల్సిందేమిటి? అన్నార్తులను ఆదుకోవడం, ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదడం. ఇందుకు అత్యంత అవసరమైంది ప్రజల చేతుల్లోకి నగదు చేరడం.

అందుకే లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.7వేలు చొప్పున నగదు, ప్రతి మనిషికి 10 కిలోల ఆహారధాన్యాలు కనీసం మూడునెలల పాటు ఇవ్వగలిగితే.. ఈ చర్యలు ప్రజలను ఆకలి నుంచి రక్షించడమే కాదు, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికీ ఊతమిస్తాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు ఈ ప్యాకేజీలో సగం చాలు. కానీ ఆర్థిక నిపుణుల ఈ సూచనలను ప్రభుత్వం పట్టించుకున్నదే లేదు. పోనీ రుణవితరణలోనైనా ఏలికలు చేస్తున్న దానాలు, వాగ్దానాల అమలుకు బ్యాంకులు పూనుకుంటాయా? ఇప్పటికే ఏలినవారి అనుంగుమిత్రులంతా కలిసి ఎగ్గొట్టిన లక్షల కోట్ల బాకీలతో కూనారిల్లుతున్న మన బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఇది సాధ్యమవు తుందా..? ఇన్ని సమాధానాలు లేని ప్రశ్నల మధ్య ఈ ప్యాకేజీ మిథ్యా వాగ్దానాల తతంగమే అవుతుంది తప్ప ఉద్దీపన ఎలా అవుతుంది?

కాబట్టి ప్రధాని ఈ భారీ ప్యాకేజీని, దీనికి ఆర్థిక మంత్రి ఐదు విడతల సుదీర్ఘ వివరణలనూ చూస్తే, అవి గత బడ్జెట్‌ ప్రతిపాదనల పాత సారానే ఈ ప్యాకేజీ అనే కొత్త సీసాలోకి వొంపినట్టుగా స్పష్టంగా తెలిసిపోతోంది. కాబట్టి ఇదంతా పాత కేటాయింపుల సర్దుబాట్లు, సవరణలే తప్ప కొత్తగా ప్రకటించిందేమీలేదన్నది అక్షర సత్యం. ఈ 20లక్షల కోట్ల ”ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌” ఓ పచ్చి అబద్ధం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates