సామాన్యుల సంగతేంటీ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-సంక్షోభ సమయాన పేదలు, మధ్యతరగతికి గుండుసున్నా..
-ప్రయివేటీకరణకు ‘ఉద్దీపన ప్యాకేజీ’ బాటలు
– బడాకార్పొరేట్ల చేతుల్లోకి దేశ సంపద, సహజవనరులు
– కేంద్ర బడ్జెట్‌లో చెప్పిందే.. మళ్లీ చెప్పిన నిర్మలాసీతారామన్‌ : ఆర్థిక విశ్లేషకులు
-మోడీ సర్కార్‌ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో

కామన్‌మ్యాన్‌కు ఏం దక్కింది? కార్పొరేట్‌కు ఏం దక్కింది? అన్న చర్చ జరుగుతున్నది. పేదలు, మధ్యతరగతి చేతిలో కొద్దిగా బియ్యం, కొద్దిగా పప్పు పెట్టి.. ఆర్థిక ఉద్దీపన అంటే ఇదేనని కేంద్రం చెబుతున్నది. ప్యాకేజీ పేరుతో విలువైన జాతీయ సంపద, సహజ వనరులు (బొగ్గు, ఖనిజ నిక్షేపాలు, అణుశక్తి, ఇస్రో, విద్యుత్‌, రక్షణ తయారీ, విమానయానం) కార్పొరేట్‌ చేతికి అప్పజెప్పింది. నడిరోడ్డుపై నిలబడి సాయంకోసం దిక్కులు చూస్తున్న దేశ ప్రజలకు ఉద్దీపన ప్యాకేజీతో చిన్న సాయం అందుతుందా? అని రాజకీయ, ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

న్యూఢిల్లీ : ఈపీఎఫ్‌ఓ ఖాతాదార్లకు 3వేల కోట్లకుపైగా అందజేశామని ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పుకున్నారు. నిజానికి ఇది ఖాతాదార్లు దాచుకున్న సొమ్ము. సంక్షోభ సమయాన, ఆర్థిక అవసరాలకు కొంతమంది ఆ మొత్తాల్ని (వారు పొదుపు చేసుకున్నదే) విత్‌డ్రా చేసుకున్నారు. ఇందులో మోడీ సర్కార్‌ ఈపీఎఫ్‌ఓ ఖాతాదార్లకు అదనంగా ఇచ్చిందేమిటో అర్థం కావటం లేదు. తాము ఏండ్లుగా పొదుపుచేసుకున్న సొమ్ములో కొంత భాగాన్ని తీసుకుంటే…దానిని కూడా ఆర్థిక ఉద్దీపనగా మోడీ సర్కార్‌ చెప్పుకోవటం జిమ్మిక్కు. నిర్మలా సీతారామన్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడిస్తున్న ఉద్దీపన ప్యాకేజీలో ఇలాంటి ‘జిమ్మిక్కు’లెన్నో ఉన్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఉద్దీపన ప్యాకేజీ విన్న తర్వాత సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా సంక్షోభంలో చిక్కుకొని వలసకూలీలు, పేదలు, మధ్య తరగతి అష్టకష్టాలు పడుతుంటే…ఉద్దీపన ప్యాకేజీ కార్పొరేట్లకు ప్రకటించారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్యాకేజీ ఈతీరుగా ఉంటే ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం చుట్టిముట్టినవేళ వివిధ దేశాలు ప్రజల కొనుగోలు శక్తి పెరిగేవిధంగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుంటే, భారత్‌లో దానికి విరుద్ధంగా కార్పొరేట్లకు పెద్ద పీట వేశారని తెలుస్తున్నది.

లాభపడేవారు : పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అత్యంత ధనవంతులు, వేల ఎకరాల భూములున్న శ్రీమంతులు. స్టాక్‌మార్కెట్‌లో వందల కోట్లు పెట్టుబడిపెట్టేవారు.

నష్టపోయినవారు : లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారు. వలస కార్మికులు, పేదలు, చేతివృత్తులపై ఆధారపడ్డవారు, ప్రయివేటు ఉద్యోగస్తులు. కార్మికులు, వ్యవసాయదారులు. ప్యాకేజీతో ఒక్క పైసా ప్రయోజనం లేదు.

సంక్షోభాన్ని సాకుగా చూపి..
సంక్షోభాన్ని సాకుగా చూపి, సామాన్యులకు ఏదో చేస్తున్నామని చూపుతూ…దేశ ప్రయోజనాలు, సహజ వనరులను(బొగ్గు, ఖనిజ నిక్షేపాలు, అణుశక్తి, విద్యుత్‌, ఇస్రో, టెలికాం, రక్షణ తయారీ) కార్పొరేట్లకు తాకట్టుపెట్టడమే ‘డిజాస్టర్‌ క్యాపటలిజం’. ఉద్దీపన ప్యాకేజీ విన్న తర్వాత ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట…’ఇటీజ్‌ డిజాస్టర్‌ క్యాపటలిజం’. దీనర్థం…విపత్తును కూడా కార్పొరేట్‌ లాభాలకు ఉపయోగించుకోవటం. ఇలాంటి ఉద్దీపన ప్యాకేజీతో ప్రజల జీవితంలో చిన్న మార్పుకూడా రాదని నిపుణులు పెదవి విరుస్తున్నారు.

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా ఏకతాటికిపైకి వచ్చి ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. ఈక్రమంలో కోట్లాదిమంది జీవనోపాధి, జీవన పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఉద్దీపన ప్యాకేజీలో కార్మికులకు, రైతాంగానికి దక్కిందేమిటని సీఐటీయూ సహా దేశంలో కీలకమైన 10 కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వారికి మేలు చేయాల్సింది పోయి, కీడు చేయటమేంటని అన్ని వైపుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉద్దీపన ప్యాకేజీ పేరుతో, సంస్కరణల పేరుతో జరుగుతున్నదాంట్లో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతాంగం : ఉద్దీపన ప్యాకేజీ పేరుతో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆహార ఉత్పత్తుల రంగమంతా ప్రయివేటుపరం కానుంది. పెద్దమొత్తంలో ఆహార నిల్వలు చేపట్టడానికి ప్రయివేటు కంపెనీలకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా మార్కెట్‌ ధరల్ని నియంత్రించే అవకాశం ఇచ్చారు. ధరలు పడిపోయినవేళ రైతుల నుంచి సేకరణ చేపడతారు. ఆ తర్వాత మార్కెట్‌ లాబీ అంతా ఒక్కటై…ధరల్ని పెంచుకొని లాభాలు పోగేసుకుంటారు. ఈ వ్యవస్థలో రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉండదు. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండవు. మధ్య దళారుల ఆగడాలు పెరుగుతాయి. ప్రజల ఆహార భద్రతకు సైతం పెనుముప్పు పొంచివుంది.

కార్మికులకు : కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా కార్మిక చట్టాల్ని మార్చే తతంగం వేగవంతమైంది. వీటి ప్రకారం, పని గంటలు పెరిగాయి. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం లేదు. పరిశ్రమల్లో క్యాంటిన్లు, భద్రతా చర్యలు పెద్దగా పట్టించుకునే విషయాలు కాదు. సమ్మె చేసే హక్కులేదు. పనిలోంచి తీసేస్తే కార్మికుడి గోడు వినే వారు ఉండరు.

CourtesY Nava Telangana

RELATED ARTICLES

Latest Updates