ఆర్థిక ప్యాకేజి కాదు.. అప్పుల ప్యాకేజి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రజల సంక్షేమం పట్ల శ్రధ్ద ఉన్నా ముందు అట్టడుగు ప్రజలనుంచి చర్యలు ప్రారంభించాలి. వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ పేదలు, పోడు రైతులు, పేద రైతులైన ఆ ప్రజానీకం చేతిలోకి ప్రత్యక్షంగా నగదు పంపాలి. అది మాత్రమే ప్రస్థుత గడ్డు పరిస్థితినుంచి ప్రజలను, ఆర్థిక వ్యవస్థను గట్టెంక్కించే చర్య అవుతుంది తప్ప మరొకటేదీ కాదు. ఈ ప్రభుత్వం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం అది. ప్రజలు కూడా ఆ వైపున ఆలోచించి ప్రభుత్వాన్ని వత్తిడి చేయాలి.

వివిధ దేశాలు కరోనా ప్యాకేజీలు ప్రకటించటం మన ప్రభుత్వంపై వత్తిడి పెంచింది. గతంలో ప్రకటించిన ప్యాకేజిలపైన కూడా అసంతృప్తి వ్యక్తమయింది. విపక్షాల నుండేకాక, యన్‌డీఏ భాగస్వాముల నుంచీ, ఏ పక్షమూ కాని ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి సైతం విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో మే12న ”ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌” ప్యాకేజి మోడీ ద్వారా వెలువడింది. దీని వివరాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నోటివెంట విడతలవారీగా చెప్పబడుతున్నాయి. ఇప్పటికి 4 ప్యాకేజీల ప్రకటనలు అయ్యాయి. ఆ వివరాలు పరిశీలిస్తే ఈ ప్యాకేజి ఆర్థిక పరిస్థితులు బాగున్న సమయంలో వేసుకొనే ప్రణాళిక అనిపిస్తుంది తప్ప, ప్రజలు కష్టాలలో ఉన్న సమయంలో ప్రకటించే ఆర్థిక ప్యాకేజి అనిపించదు.

అసలు కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ జబ్బున పడింది. 2015-16లో 8శాతం ఉన్న జీడీపీ అభివృద్ది రేటు, 16-17కు 7శాతానికి, 17-18కి 6శాతానికి, 18-19కి 5శాతానికి, ప్రతి సంవత్సరం ఒక శాతం చొప్పున పడిపోతూ వచ్చింది. ఈ సంవత్సరం పరిస్థితి సాధరణంగానే ఉన్నా ఆ 5శాతం కూడా ఉండదని జరిగిన ఆర్థిక పరిణామాలు తెలియచేశాయి. 2018 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి రంగం అభివృద్ది 12.1శాతం ఉంటే, 2019 మొదటి త్రైమాసికానికి 0.6శాతానికి పడిపొయింది. అదే కాలంలో వ్యవసాయ అభివృద్ధి 5.1శాతం నుంచి 2శాతానికి పడిపొయింది. నిర్మాణ రంగం 8శాతం నుంచి 2శాతానికి పడిపొయింది. ఎందుకిలా జరుగుతుంది, మీ సమస్యలు చెప్పండని, కంపెనీల సీఈఓల సమావేశం పెట్టి ప్రభుత్వం అడిగింది. వాళ్ళు మా వాహనాలు అమ్ముడు పోవటం లేదు. మా బట్టలు అమ్ముడు పోవటంలేదు, చెప్పులు అమ్ముడు పోవటం లేదు. చివరకు మా బిస్కట్‌లు, అండర్‌ వేర్‌లు కూడా అమ్ముడు పోవటం లేదని, ఆయా రంగాల సీఈఓలు చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు మూత వేసుకోవటమే అని కూడా చెప్పారు.

చెప్పినట్టుగానే, 2019 అక్టోబర్‌ నాటికే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఉన్న నిరుద్యోగులకు తోడు, మూతపడ్డ పరిశ్రమల్లో పనిచేసేవారు చేరారు. ఫలితంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రకారం 9.94శాతానికి నిరుద్యోగం చేరింది. 2018 ఆగస్టు నాటికి కోటీ పదిలక్షల మంది నిరుద్యోగులుగా నమోదు చేసుకొంటే, 2019 సెప్టెంబర్‌ నాటికి 4.5 కోట్ల మంది, నిరుద్యోగులుగా నమోదు చేసుకొన్నారు. వస్తూత్పత్తిలో 49శాతం, జీడీపీలో 7.5శాతం వాటా కలిగి ఉన్న ఆటో మొబైల్‌ రంగం, దీని అనుబంధ రంగాలలో 4కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. 17 ప్రధాన వాహనోత్పత్తి కంపెనీలలో 10 కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే 23శాతం ఉత్పత్తి తక్కువ చేసినట్టు తేలింది.

ఈ నేపధ్యంలో కరోనా వచ్చింది. అసలే మిణుకు, మిణుకు మంటున్న మన ఆర్థిక వ్యవస్థను, మార్చి 22నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కొడిగొట్టే దీపంలా మార్చింది. ఐయంయఫ్‌, ప్రపంచ బ్యాంకుతో పాటు అన్ని సర్వే సంస్థలు 2020లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. అభివృద్ది రేటు మైనస్‌లోకి వెళుతుందని చెపుతున్నాయి. అవే సంస్థలు మన దేశ జీడీపీ అభివృద్ధి రేటు 0 నుంచి 1శాతం ఎక్కువో, తక్కువో ఉండే అవకాశం ఉందని చెపుతున్నాయి.

20లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన తరువాత, ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి ప్రభుత్వం ఇప్పటికైనా సక్రమమైన ఆలోచనలోకి వచ్చిందని అనేకమంది అనుకొన్నారు. ఈ ప్యాకేజి ద్వారా ప్రజల వద్దకు డబ్బు చేరితే, తద్వారా వినియోగం, డిమాండ్‌ పెరిగి ప్రజల సమస్యలు తీరడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ప్రముఖ ఆర్థికవేత్తలు అనేక మంది చెప్పారు. కానీ ఐయంయఫ్‌, కార్పొరేట్‌ శక్తులు మాత్రం, సంస్కరణలను మరింత తీవ్రం చేయాలని చెప్పాయి. తను అధికారంలోకి రావటానికి అనూహ్యంగా ధనాన్ని సమకూర్చి దోహదపడిన జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు చెప్పిన మాటలను ఆచరించడానికే ఈ ప్రభుత్వం సిద్దపడింది. ఈ ప్యాకేజీ ప్రకటనల్లో కూడా అది స్పష్టంగా కనపడుతున్నది.

20లక్షలకోట్లతో ఏమి చేయవచ్చు?
ప్రభుత్వం ఏమి చేస్తున్నది?
ఈ 20లక్షల కోట్లను దేశంలోని మొత్తం 135కోట్ల జనాభాకు, అంబానీ – అదానీతో సహా పంచితే, ఒక్కొక్కరికి రూ.14,815 వస్తాయి. కానీ అలా చెయ్యమని ఎవరూ కోరరు. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రిపోర్టు ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 5.78కోట్ల మంది ఇన్‌కమ్‌ రిటర్న్స్‌ దాఖలు చేశారు. వీరు కాక ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకుండా ఉన్నారని ప్రభుత్వ సంస్థలు చెపుతున్న కుటుంబాలు మరో 5కోట్లు ఉంటాయి. వీరిని ప్యాకేజి నుంచి మినహాయించి పేదలనే ప్రామాణికంగా తీసుకొంటే! నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం ఇప్పటికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్‌ కార్డులు 23కోట్లు. దేశం మొత్తం మీద మరో 3కోట్ల దరఖాస్తులు, కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 26కోట్ల కుటుంబాలకు ప్రకటించిన ప్యాకేజి పైకం పంచితే ఒక్కో కుటుంబానికి రూ.76,923 వస్తాయి.

దేశంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లలో 7.70కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మూలుగుతున్నాయి. వాటిని ఈ రేషన్‌ కార్డుదారులకు పంచితే, ఒక్కో కుటుంబానికి 2.96 క్వింటాళ్ళ బియ్యం లేదా గోధుమలు అందుతాయి. ఈ సంవత్సరం ఇప్పటికి వచ్చిన 40లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఆహార భద్రత కోసం పూర్తిగా నిల్వ చేసుకొనే అవకాశం ఉంది.

ప్రకటించిన ప్యాకేజీలో 4వ వంతు కంటే తక్కువ కేటాయించితే, ఈ దేశంలో రైతులు తీసుకొన్న అన్ని రకాల రుణాలు మాఫీ చేయవచ్చు. ఈ ప్యాకేజీ ప్రకటనలలో భాగంగానే ఆర్థిక మంత్రి చెప్పిన ప్రకారం 4.32లక్షల కోట్ల రుణాలు వ్యవసాయం కోసం రైతులు తీసుకొన్నారు. దీని ద్వారా దేశంలోని 10కోట్ల రైతు కుటుంబాలు రుణ విముక్తి చెందుతాయి.

12.07.2019న కేంద్ర మంత్రి స్మ్రృతీ ఇరానీ, లోక్‌సభలో చెప్పిన ప్రకారం ఈ దేశంలో 54.07లక్షల మహిళా సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులున్నాయి. అందులో 5.96కోట్లమంది మహిళలు సభ్యులు గా ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.10,000 నుంచి 15,000లు 7శాతం వడ్డీకి రుణం ఇస్తున్నారు. ఈ ప్యాకేజీలో 4వ వంతు కేటాయించితే ఇప్పుడున్న రుణాలు మాఫీ చేయటంతో పాటు తలా రూ.10వేలు ఆ 6కోట్లమంది మహిళలకు అందచేయవచ్చు.

కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటి వరకూ చేసిన ప్రకటనలలో పై చర్యలు ఏమైనా కనపడతాయేమోనని ఎదురు చూసిన వారికి తీవ్రమయిన నిరాశ కలిగింది. మే 13న నరేంద్రమోడీ 20 లక్షల కోట్లు ఉద్దీపన పథకాన్ని ప్రకటించినప్పుడు దేశ ప్రజలు సంతోషించారు. కచ్చితంగా ధనికులు కాని వారందరికీ ఏదోఒక మేలు జరుగుతుంది అని భావించారు. కానీ ఆర్థిక మంత్రి ప్రకటనలు వారిని తీవ్రంగా నిరుత్సాహ పరిచాయి.

స్థూలంగా చూస్తే మొదటి ప్యాకేజీలో ఎంఎస్‌ఎంఈలకు 3లక్షల కోట్లు అప్పు ఇప్పిస్తామన్నారు. రెండవ ప్యాకేజీలో రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా 2లక్షల కోట్ల అప్పుకు అవకాశం ఇప్పిస్తామన్నారు. మూడవరోజు లక్ష కోట్లతో రైతులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల చేతుల్లోకి వచ్చేది, ఏమన్నా ఉందీ అంటే, వలస కార్మికులకు 2సార్లు, నెలకొకసారి ఇచ్చే 5కేజీల ఆహార ధాన్యాలు తప్ప మరేమీ కనపడటం లేదు. వినియోగం, డిమాండ్‌ పెంచే చర్యలు ఈ ప్యాకేజీలో ఎక్కడా ఈషన్మాత్రం కూడా కనపడవు. అందుకే ఇది అప్పుల ప్యాకేజీ తప్ప, ఆర్థిక వెసులుబాటు కలిగించే ప్యాకేజీ కాదు. ఆర్థిక వెతలు తీర్చే ప్యాకేజీ కాదు.

ముఖ్యంగా దేశమంతా ఆతృతగా ఎదురు చూసిన వలస కార్మికులకు, ఈ ప్యాకేజి తీవ్రమైన అన్యాయం చేసింది. కరోనా కాలంలో వలస కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ద వైర్‌ పత్రిక సమాచారం ప్రకారం ఇప్పటికి 528మంది వలస కార్మికులు, కరోనా తెచ్చిన ఆర్థిక-సామాజిక ఇబ్బందుల వల్లగానీ, ప్రమాదాలలో గానీ చనిపొయ్యారు. ముఖ్యంగా ఔరంగాబాద్‌ రైలు ప్రమాదం యావజ్జాతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 16మంది వలస కార్మికులు మరణించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ కార్మికులు మహారాష్ట్ర నుంచి తమ స్వగ్రామానికి పయనమయ్యారు. పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళటానికి రోడ్డు మార్గం కాకుండా రైలు మార్గం ఎంచుకొన్నారు. ఒకే రాత్రి 55కి.మీ నడిచి ఔరంగాబాద్‌కు 10కి.మీ దూరంలోకి చేరుకొన్నారు. విపరీతంగా అలసి పొయ్యారు. కొద్దిసేపు సేదదీరుదామని ఆ రైలు పట్టాల మధ్యనే పడుకొన్నారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో గూడ్స్‌ రైలు, పడుకున్న ఆ 16మంది మీదనుండి వెళ్ళింది. ఆ రైలు సమీపంలోకి వచ్చినా, మీద నుంచి వెళుతున్నా గమనించలేని స్థితిలో వాళ్ళు నిద్రపొయ్యారంటే, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు రోడ్లపైనే ప్రసవాలు, తల్లీబిడ్డల మరణాల వార్తలు కూడా గణనీయ సంఖ్యలోనే వినవచ్చాయి. నిండు గర్భిణులు, పాలుగారే వయసున్న చిన్న పిల్లలు, చంటిపిల్లల తల్లులు, హైవేల మీదా, రైల్లే ట్రాక్‌మీదా వందల కి.మీలు కాలినడకన చేస్తున్న ప్రయాణాలు, హృదయాలను కదిలించి వేస్తున్నాయి.

ఈ స్థితిలో ఉన్న వలస కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమిచ్చింది. నెలకు 5కేజీల బియ్యం చొప్పున, అదీ రెండు నెలలు ఇస్తామన్నది. ఉపాధి పని వీరికి కూడా ఇస్తారట. అదికూడా గొప్ప ఉద్దీపనగా చెపుతున్నారు. 2017లో పార్లమెంటుకు సమర్పించిన ఎకనమిక్‌ సర్వేలోనే 14కోట్ల మంది వలస కార్మికులున్నారని చెప్పింది. 20లక్షల కోట్ల ఈ ప్యాకేజీలో వారికిచ్చేది, ఆ బియ్యం కింద 3,500 కోట్లు మాత్రమే. ఈ 3,500 కోట్లను ఆ 14కోట్ల మందికి పంచితే ఒక్కొక్కరికి వచ్చేది రూ.250. ఇందులో పెద్ద కుట్ర దాగున్నది. వారికి తగిన సహాయం చేస్తే ఎక్కడ ఉన్న చోటనే ఉండి పోతారో అని పాలకవర్గాలకు భయం పట్టుకొన్నది. అందుకే కడుపు మాడ్చాలనే నిర్ణయించిది. ఇంత పెద్ద ప్యాకేజీలో ఏదన్నా మొదట చెయ్యాల్సింది ఉందీ అంటే, వీళ్ళను ఏ ఇబ్బందీ లేకుండా స్వంత గ్రామాలకు చేర్చడం. ఆ పని గురించి ఈ ప్యాకేజీలో మచ్చుకైనా కేటాయింపు లేదు.

రెండవది వ్యవసాయ రంగం గురించి. ఇంత పెద్ద ప్యాకేజీలో 50శాతంపైగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్న రంగానికి తగిన ప్రాధాన్యత ఉంటుందని భావిస్తాము. రైతుకు ఆసరా అంటే రుణమాఫీ, స్వామినాధన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు ఉంటాయని ఎవరైనా అనుకొంటారు. కానీ ఆర్థిక మంత్రి ప్రకటనలో ఈ అంశాల ప్రస్తావన అసలే లేదు. ఏమిచ్చారు ఈ రంగానికి అని చూస్తే, లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మరో 50,000కోట్లు అనుబంధ పరిశ్రమలకు ఖర్చు పెడతామన్నారు. ఇవన్నీ అనేక సందర్భాలలో విన్నవే. నిర్దిష్టమైనవి ఏమీ లేవు.
ఎంఎస్‌ఎంఈలు కూడా ఈ అప్పుల ప్యాకేజీల ద్వారా మనుగడ సాగించలేవు. ఈ సెక్టార్‌లో మానవ శ్రమ అధికంగా ఉంటుంది. ఆ శ్రమ చేసేవాళ్ళు ఈ రంగంలో ఎక్కువ మంది వలస కార్మికులు. ఈ రోజు వారి బతుకే ప్రశ్నార్ధకంగా ఉంది. అలాంటి స్థితిలో మళ్ళీ తిరిగి వచ్చి పని చేస్తారనేది అత్యాసే అవుతుంది.

అందుకే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రజల సంక్షేమం పట్ల శ్రధ్ద ఉన్నా ముందు అట్టడుగు ప్రజలనుంచి చర్యలు ప్రారంభించాలి. వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ పేదలు, పోడు రైతులు, పేద రైతులైన ఆ ప్రజానీకం చేతిలోకి ప్రత్యక్షంగా నగదు పంపాలి. అది మాత్రమే ప్రస్థుత గడ్డు పరిస్థితినుంచి ప్రజలను, ఆర్థిక వ్యవస్థను గట్టెంక్కించే చర్య అవుతుంది తప్ప మరొకటేదీ కాదు. ఈ ప్రభుత్వం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం అది. ప్రజలు కూడా ఆ వైపున ఆలోచించి ప్రభుత్వాన్ని వత్తిడి చేయాలి.

పోతినేని సుదర్శన్‌రావు

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates