రాజధాని రోడ్లపై చిరుత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రోడ్డుపై డివైడర్‌ పక్కన నక్కిన క్రూర మృగం
  • ఓ వ్యక్తిని గాయపర్చి ఫాంహౌ‌స్‌లో దూరిన చిరుత
  • రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌ పహాడ్‌లో ఆందోళన
  • ప్రజలు బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరిక
  • పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారుల ఏర్పాట్లు

రాజేంద్రనగర్‌ : లాక్‌డౌన్‌తో వాహనాల శబ్దాలు లేకపోవడం, జనసంచారం తక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో ఓ చిరుత రోడ్డుపైకి వచ్చి కలకలం రేపింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌ పహాడ్‌ ప్రాంతంలో గురువారం ప్రత్యక్షమైంది. పాత కర్నూలు రోడ్డులోని రైల్వే వంతెన సమీపంలో అండర్‌ బ్రిడ్జి డివైడర్‌ మధ్యలో చాలాసేపు పడుకున్న చిరుత తర్వాత పక్కనే ఉన్న ప్రైవేటు ఫామ్‌హౌ‌స్‌లోకి వెళ్లింది. ఈ సందర్భంగా లారీ వద్ద నిలబడిన కాకినాడకు చెందిన సుబాన్‌ అనే వ్యక్తి కాలిపై రక్కింది. అతన్ని మైలార్‌ దేవుపల్లి పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలోనే చేరుకున్నప్పటికీ ఫారెస్ట్‌, జూపార్కు అధికారులు ఆలస్యంగా వచ్చారు. ఫామ్‌హౌ్‌సలోని దట్టమైన చెట్లు, ముళ్ల పొదల్లోకి వెళ్లిన చిరుతను పట్టుకునేందుకు రెస్క్యూ టీం చేసిన ప్రయత్నాలు గురువారం సాయంత్రం వరకు ఫలించలేదు. రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో అధికారులు మేకలతో ట్రాప్‌ కేజ్‌లు, 25 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి షార్ప్‌ షూటర్లతో కలిసి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉదయం 8 గంటలకు అండర్‌ బ్రిడ్జి కింద డివైడర్‌ను ఆనుకుని లేవలేనిస్థితిలో ఉన్న చిరుతను అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించారు. వారు మైలార్‌ దేవుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చినా అటవీ అధికారుల రాక ఆలస్యం కావ డం, స్థానికుల అరుపులతో బెదిరిపోయిన చిరుత పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకు గుండా అన్‌మోల్‌ గార్డెన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రహదారి బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ బస్తీని ఆనుకుని ఉన్న పురన్‌లాల్‌ అనే ప్రైవేటు వ్యక్తికి చెందిన 60 ఎకరాల ఫాంహౌ్‌సలోకి వెళ్లిపోయింది.

అన్నదమ్ముల మధ్య వివాదంతో ఆ ఫాంహౌ‌స్‌లో ముళ్ల చెట్లు, పొదలు దట్టంగా పెరిగిపోయాయి. చిరుత దూరిన ఫాంహౌస్‌ పక్కన ఉన్న వెంకటేశ్వర కాలనీ, బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ బస్తీల ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని మైక్‌ల ద్వారా ప్రచారం నిర్వహించారు. 6 నెలల క్రితం కూడా రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో గల రూరల్‌ టెక్నాలజీ పార్కులోకి చిరుత వచ్చిందని ప్రచారం జరిగింది. అక్కడ ఓ అడవి పందిని సగం వరకు తిన్నదని తెలిసింది.

ఆహారం కోసం వచ్చి ఉంటుంది
చిరుతకు వయస్సు ఎక్కువై వేటాడలేని సమయంలో జనావాసాల్లోకి వచ్చి కుక్కలు, పశువులను పట్టి తింటాయి. ఇప్పుడు అందుకోసమే గగన్‌ పహడ్‌ వైపు వచ్చి ఉండొచ్చు. డీ హైడ్రేషన్‌ లేదా కాలికి గాయంతో రోడ్డు డివైడర్‌ వద్ద పడుకుని ఉండొచ్చు. జనం అరుపులతో అక్కడి నుంచి వెళ్లి ఉంటుంది.
డాక్టర్‌ రామ్‌సింగ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,
పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates