భారీగా అప్పులు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– రూ.12లక్షల కోట్లు సేకరించే దిశగా కేంద్రం
– కోవిడ్‌-19 కారణంగా రుణ పరిమితి పెంచాం : ఆర్‌బీఐ వెల్లడి
– ప్రతినెలా బహిరంగ మార్కెట్ల నుంచి రూ.1.2లక్షల కోట్లు అప్పులు !

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పినదాని ప్రకారం ఈఏడాది ప్రభుత్వం చేయాలనుకున్న అప్పులు రూ.7.8లక్షల కోట్లు. అయితే కరోనా మహమ్మారి ప్రభుత్వ లెక్కల్ని తారుమారు చేసింది. మరిన్ని అప్పులు చేస్తేగానీ…ఆర్థికనావ సజావుగా సాగే పరిస్థితి కనపడటం లేదు. దాంతో రుణ పరిమితి పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ ఉన్నతాధికారులు గత కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో అప్పుల పరిమితిని రూ.12లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన వెలువడింది. దాంతో ఈఏడాది మొత్తం ప్రభుత్వ వ్యయంలో అప్పుల వాటా దాదాపు 54శాతానికి చేరుకుంది. కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు రుణ కార్యక్రమంపై సమీక్ష జరిపామని, అప్పుల పరిమితిని పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ విడుదలచేసిన ప్రకటన ప్రకారం, మే 11-సెప్టెంబరు 30మధ్య బహిరంగ మార్కెట్ల ద్వారా రూ.4.88లక్షల కోట్లు సేకరించాలన్నది మొదట్లో కేంద్రం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు రూ.6లక్షల కోట్లు సేకరించబోతున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.98కోట్లు అప్పులు సేకరించారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ భారీగా పెంచటం ద్వారా, అప్పుల ద్వారా కేంద్రం నిధుల సేకరణకు తెరలేపిందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ బద్రీశ్‌ కుల్హాలీ అన్నారు. బహిరంగ మార్కెట్లో రుణాల సేకరణ ఇప్పుడు బాగానే ఉంటుందని, వాటి చెల్లింపు ముందు ముందు ఆర్‌బీఐకి పెద్ద గుదిబండలా మారుతుందని ఆయన చెప్పారు. పెంచిన రుణ పరిమితి ప్రకారం, కేంద్రం ప్రతినెలా రూ.1.2లక్షల కోట్లు అప్పులు చేయనున్నది.

ఆర్‌బీఐపై ఒత్తిడి
కేంద్రంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్‌ బాధ్యతలు చేపట్టాక, ప్రభుత్వ రుణ పరిమితి పెంచాలని ఆర్‌బీఐపై తీవ్ర ఒత్తిడి కొనసాగిందని తెలుస్తున్నది. గత 7-8రోజులుగా ఇదే అంశంపై చర్చోపచర్చలు సాగినట్టు సమాచారం. ఈనేపథ్యంలో 2020-21లో ద్రవ్యలోటు లక్ష్యం 3.5శాతం(జీడీపీలో) నుంచి 5.3శాతానికి పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్‌-19 విసురుతున్న సవాళ్ల కారణంగా ద్రవ్యలోటు లక్ష్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. అప్పుల ద్వారా సేకరించిన నిధులతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే కొంతలో కొంతైనా మాంద్యం పరిస్థితులు మెరుగుపడతాయని వారు అంటున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates