రూ.30వేలు కట్టాం.. ఇదేం భోజనం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కప్పు అన్నం, 2 చపాతీలు..
  • వాటి రుచీ అధ్వానం
  • రెండు పండ్లకు రూ.540 
  • బిల్లు వేసిన హోటల్‌
  • క్వారంటైన్‌ హోటళ్లలో ప్రవాసుల పరేషాన్‌
  • టికెట్‌, క్వారంటైన్‌ ఖర్చుతో జేబు గుల్ల
  • ఏపీ వాసులకు రెండోసారీక్వారంటైన్‌ భయం

స్టార్‌ హోటళ్లలో క్వారంటైన్‌ పేరిట తమ నుంచి వేల రూపాయలు వసూలు చేసి.. భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని గల్ఫ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రవాసులు మండిపడుతున్నారు. వందే భారత్‌ మిషన్‌ కింద తొలి విడతలో కువైత్‌ నుంచి బయలుదేరిన విమానం శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వచ్చిన వారిలో గర్భిణులు, మహిళలు, చిన్నారులే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరందరినీ క్వారంటైన్‌ నిమిత్తం గచ్చిబౌలిలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు తరలించారు.

అయితే, పెయిడ్‌ క్వారంటైన్‌ పేరిట రూ.30వేలు వసూలు చేసి.. ప్లేట్‌ భోజనం కూడా సరిగ్గా పెట్టలేదని కొందరు ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లక్షణాలు లేని వారు ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాలని చెబితే ప్రయాణానికి సిద్ధపడ్డామని, ఇక్కడికి వచ్చాక హోటల్‌ క్వారంటైన్‌ అన్నారని పలువురు గర్భిణులు ఆందోళన వెలిబుచ్చారు. ‘‘గర్భిణులకు ఆహారం చాలా ముఖ్యం. హోటల్‌లో కప్పు అన్నం, రెండు చపాతీలు ఇచ్చారు. ధర్మశాలలో భోజనం ఇంతకన్నా చాలా బాగుంటుంది. రెండు పండ్లు తెప్పించుకుంటే ట్యాక్స్‌ కలిపి రూ.540 చార్జి చేశారు. రోజుకు రూ.2-3వేలు చెల్లించుకుంటూ పోతే 14 రోజులకు రూ.42వేలు ఖర్చవుతుంది’’ అని కూకట్‌పల్లికి చెందిన శ్రీలక్ష్మి ప్రసన్న తెలిపారు. ఏడాదిన్నర కుమారుడికి, తనకు కలిపి కప్పు అన్నం, రెండు రొట్టెలు, రెండు కూరలు ఇచ్చారని చార్మినార్‌ ప్రాంతానికి చెందిన షాఫియా వాపోయారు. హోటల్‌లో ఇచ్చిన భోజనం సరిపోక బర్గర్‌ ఆర్డర్‌ చేద్దామనుకున్నానని, దాని ధర రూ.500 ఉండడంతో మిన్నకుండిపోయానని ఆవేదన వెలిబుచ్చారు.

గల్ఫ్‌లో ఉంటున్న తన భర్తకు సకాలంలో వేతనాలు అందడం లేదని, ఇబ్బందుల మధ్య స్వదేశానికి తిరిగొస్తే క్వారంటైన్‌ పేరిట హోటల్‌ నిర్వాహకులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. రూ.30వేలు చెల్లించాక ఇలా కప్పు అన్నం పెడతారని తెలిస్తే.. తాను ప్రభుత్వ ఉచిత క్వారంటైన్‌ను ఎంచుకునే వాడినని కరీంనగర్‌కు చెందిన చెందిన రాచకొండ నరేందర్‌ చెప్పారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో తమకు ఇస్తున్న భోజనం.. ఐదేళ్ల చిన్నారికి కూడా సరిపోదని తెలిపారు.

రెండోసారి క్వారంటైన్‌ చేస్తారా?
గల్ఫ్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల నుంచి తెలుగు ప్రవాసులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే వారైతే విమాన టికెట్‌కే రూ.లక్ష వరకూ చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ పెయిడ్‌ క్వారంటైన్‌కు రోజుకు రూ.5వేల నుంచి రూ.30వేల చొప్పున చెల్లించాల్సి రావడం వారికి తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. ఇక, విదేశాల నుంచి వస్తున్న ఏపీ వాసుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌ చేరుకుని, పెయిడ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇక్కడ 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఏపీకి వెళ్తే అక్కడ మళ్లీ క్వారంటైన్‌ చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. కరోనా ప్రభావంతో వేతనాలు సరిగ్గా రాక తాము ఇబ్బందులు పడుతుంటే.. స్వదేశానికి వచ్చాక క్వారంటైన్‌ కోసం తాము దాచుకున్నదంతా ఖర్చు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates