వలస కార్మికులపై ఖాకీ ప్రతాపం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కాలినడకన వెళ్తూ రహదారిపై ప్రసవం
– సొంతూళ్లకు పంపాలని వేడుకోలు
– అనుమతించని ఏపీ పోలీసులు
– ఖమ్మంలో కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం
– కామారెడ్డిలో కాలినడకన బయలుదేరిన కార్మికులు
– రామగుండం నుంచి స్వస్థలాలకు..వలస కార్మికులపై ఖాకీ ప్రతాపం

వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తాపత్రయ పడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇక్కడ పనిలేక.. తీసుకొచ్చిన కంపెనీల యజమానులు పట్టించుకోక అవస్థలు పడుతున్నారు. కొందరికి తెలంగాణ పోలీసులు వెళ్లడానికి పాస్‌లు ఇచ్చినా సరిహద్దుల్లో నిరీక్షణ తప్పడం లేదు. అనుమతులు తెచ్చుకున్నా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వారిని అనుమతించడం లేదు. మరోవైపు జిల్లాల్లో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది వలస కార్మికులు తమను స్వగ్రామాలకు పంపాలని మంగళవారం కూడా ఆందోళన చేశారు. ఖమ్మంలో కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అతిగా ప్రవర్తించారు. కార్మికులతో వాగ్వాదానికి దిగారు. కాలరు పట్టుకుని బెదిరించారు. ఈలోపు అధికారులు నచ్చజెప్పడంతో వెనుతిరిగారు.

నల్లగొండ జిల్లా దామరచర్లలోని వాడపల్లి వద్ద గల ఆంధ్ర – తెలంగాణ సరిహద్దు వద్ద రెండ్రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కూడా వందలాది మంది వలస కూలీలు రాగా, ఆ రాష్ట్ర పోలీసులు అనుమతించలేదు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పోకర్ణ పరిశ్రమల్లో పనిచేస్తున్న 200 మంది కార్మికులు కంపెనీ ఎదుట ధర్నా చేశారు. రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మేకగూడ సర్పంచ్‌ పాండు రంగారెడ్డి తెలిపారు. ఖమ్మం ఇండిస్టియల్‌ ఏరియాలోని గ్రానైట్‌తో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒరిషా, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 400మంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పెద్దఎత్తున నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లేందుకు యత్నించారు. ఖమ్మం టూ టౌన్‌ పోలీసులు సీఐ తుమ్మ గోపి ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్‌ రోడ్డు సమీపంలో వారిని నిలువరించారు. తాము సొంతూర్లకు వెళ్తామంటుంటే..వారిపై పోలీసులు రెచ్చిపోయారు. స్వల్పంగా లాఠీలు ఝుళిపించారు. కొందరి మెడపట్టుకుని బెదిరించారు. ఈలోపు అడిషనల్‌ డీసీపీ మురళీధరరావు అక్కడికి చేరుకుని వలస కార్మికులతో చర్చలు జరిపి నచ్చజెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి రెండ్రోజుల్లో స్వస్థలాలకు పంపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం వారందరికీ సీఐ గోపి భోజనం ప్యాకెట్లు అందజేసి వెనక్కి పంపారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో జాతీయ రహదారి పనులు చేపడుతున్న డీబీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్న జార్ఖండ్‌ రాష్ట్ర కూలీలు కాలినడకన సొంతూర్లకు తరలివెళ్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో కంపెనీ తమను పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోయారు. దీంతో అధికారులు సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికులకు సదుపాయాలు కల్పించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వెనక్కి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే చొరవతో స్వస్థలాలకు వలస కార్మికులు
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన నియోజకవర్గంలోని ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సంస్థల్లో పనిచేస్తున్న వలస కార్మికులను ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఐదు వేల మంది వలస కార్మికులు ఉన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కొందరిని డీసీఎం వాహనాల్లో సొంత రాష్ట్రాలకు తలించామని, మిగతావారిని రైలు మార్గం ద్వారా పంపిస్తామని వివరించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates