తెలంగాణ యాపిల్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఇదిగో తెలంగాణ యాపిల్‌
  • కోతకు సిద్ధంగా ఉన్న తొలి పంట…
  • మరో ఇరవై రోజుల్లో మార్కెట్‌లోకి
  • కెరమెరి ఏజెన్సీలో రైతు ప్రయోగం సఫలం
  • ఉద్యాన సాగులో నవశకం

కుమరం భీం జిల్లా కెరమెరి ఏజెన్సీలోని ఓ కుగ్రామం.. ఊరంతా పత్తి సాగు చేస్తుంటే యువ రైతు కేంద్రె బాలాజీ కొంచెం వినూత్నంగా ఆలోచించాడు. తన చేనులో యాపిల్‌ మొక్కలు తెచ్చి నాటాడు. అతడిని చూసి తోటి రైతులందరూ… ‘‘పిచ్చి పట్టిందా’’ అంటూ అవహేళనగా మాట్లాడారు. అయినా.. అతడు వెనకడుగు వేయలేదు. నాలుగేళ్ల పాటు పట్టు వీడని విక్రమార్కుడిలా కృషి చేసి కశ్మీర్‌లో పండే యాపిల్‌ను కుమరం భీం జిల్లాలోనూ పండించాడు. ఉద్యానవన సాగులో నవశకానికి నాంది పలికాడు.

ఆసిఫాబాద్‌ : కశ్మీర్‌ యాపిల్‌.. సిమ్లా యాపిల్‌.. ఇప్పటి వరకూ ఇవే మనకు తెలుసు. ఏ మార్కెట్‌కు వెళ్లినా.. ఏ షాపులో చూసినా ఇవే కనిపిస్తాయి. వీటికి దీటుగా త్వరలోనే తెలంగాణ యాపిల్‌ మార్కెట్‌లోకి రానుంది. మరో ఇరవై రోజుల్లో మొదటి పంటను కోసేందుకు రైతు కేంద్రె బాలాజీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ కశ్మీరంగా పేరు గాంచిన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి ఏజెన్సీలో వినూత్న ఆలోచనతో యాపిల్‌ సాగు చేస్తున్న విషయాన్ని సరిగ్గా మూడేళ్ల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దాంతో శాస్త్రవేత్తలు ఆ రైతు ఉత్సాహానికి మంత్రముగ్ధులై మరింత చేయూతనిచ్చారు. ఫలితంగా యాపిల్‌ పంట పండించాలనుకున్న రైతు స్వప్నం సాకారమైంది.

అందరిలా ఆలోచించకుండా..
కెరమెరి మండలంలోని ధనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ.. అందరి రైతుల్లా ఆలోచించలేదు. వాణిజ్య పంటల్లో వస్తున్న నష్టాలతో విసుగెత్తిపోయి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తాపే యాపిల్‌ను ఎందుకు పండించకూడదన్న ఆలోచనతో 50 మొక్కలు తెచ్చి నాటారు. అవి ఏడాదికే పూతకొచ్చి కాయలు కాయడంతో.. రెట్టించిన ఉత్సాహంతో సీసీఎంబీ శాస్త్రవేత్తలను సంప్రదించారు. వారి సూచనల మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌ వెరైటీ ఎల్లో రకం మొక్కలు తెచ్చి నాటారు. ఇక్కడి వాతావరణానికి ఆ మొక్కలు అనువుగా ఉండడంతో ఏపుగా పెరిగాయి. చూస్తుండగానే పూత పూసి కాతకాశాయి. దాంతో రైతు బాలాజీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఐదు ఎకరాల్లో మొత్తం 400 మొక్కలు నాటగా.. ప్రస్తుతం ప్రతి మొక్కకు 20-40 కాయలు కాశాయి. మరో 15-20 రోజుల్లో మొదటి దఫా పంట కోత కోసేందుకు సిద్ధమవుతున్నాడు రైతు బాలాజీ. సగటున ఒక్కో చెట్టు నుంచి మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున మొత్తంగా 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇందులో కశ్మీర్‌ వెరైటీ, సిమ్లా వెరైటీ, గోరఖ్‌పూర్‌ వెరైటీలు ఉన్నాయి. ప్రస్తుతం చెట్ల వయస్సు 3-4 ఏళ్ల లోపే ఉండడంతో కాయ సైజు కాస్త చిన్నగా ఉన్నా, 6-8 ఏళ్ల మధ్య నాణ్యమైన దిగుబడులు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చిన యాపిల్‌ పండు ఒక్కోటి 100-150 గ్రాముల బరువు తూగుతుందని ఆ రైతు వివరించారు.

జీవామృతమే ప్రధాన ఎరువు
తన వ్యవసాయ క్షేత్రంలో ఆవు మూత్రం, పేడ, శనగపిండి మిశ్రమాలతో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతాన్ని బాలాజీ ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఖర్చు, చీడ పీడల బెడద తక్కువగా ఉంటోంది. ఇక్కడ 400 యాపిల్‌ చెట్లతోపాటు 160 దానిమ్మ, 100 మామిడి, 40 బత్తాయి, 20 సంత్ర చెట్లు ఉన్నాయి.

నష్టాలతో విసిగిపోయి..
పత్తి పంటలో వరుస నష్టాలతో ఏం చేయాలో పాలుపోలేదు.  యాపిల్స్‌ను ఎందుకు పండించకూడదన్న ఆలోచనే.. నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. తొలుత ప్రయోగాత్మకంగా ఉద్ధానం నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చి నాటా. అయితే నా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు వీరభద్రరావు, నరేశ్‌ అగర్వాల్‌.. అవి నాసిరకం మొక్కలని తేల్చడంతో నిరాశ చెందా. వారు సిమ్లా వెరైటీ మొక్కలు ఇచ్చి నాటమన్నారు.  నాటిన 9 నెలలకే కాయలు కాయడం సంతోషం కలిగించింది.

బాలాజీ

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates