ఆపేస్తుండ్రు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పాసులున్నా పోనిస్తలేరు..
– మంచినీళ్లు కూడా ఇస్తలేరని కార్మికుల కన్నీరు
– రామగుండంలో రోడ్డెక్కిన వలసజీవులు.. పోలీసుల లాఠీచార్జి
– హైదరాబాద్‌లో పలుచోట్ల వేలాది మంది ఆందోళన
– వరంగల్‌ కలెక్టరేట్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌వాసులు
– సరిహద్దుల్లో పిల్లాపాపలతో మహిళలు, గర్భిణుల పడిగాపులు

వలసకార్మికుల బతుకులు మరింత దయనీయంగా మారుతున్నాయి. అమాంతంగా విధించిన లాక్‌డౌన్‌తో వారికి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. మరోవైపు లాక్‌డౌన్‌ను నిరంతరం పెంచుకుంటూ పోవటం కూడా వలస బతుకులకు దారితెన్నూలేదు. తిందామంటే తిండి లేదు.. చేద్దామంటే పనిలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. కనిపించని కరోనా వైరస్‌ కన్నా..లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో చనిపోతామన్న భయం మానసికస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నది. ఇక్కడ ఉండి.. ఆకలితో చావటం కన్నా.. సొంతూర్లకు వెళ్లి బతుకుదామని పట్టణం విడిచి..తమ స్వగ్రామాలకు తరలివెళ్లటానికి సిద్ధమవుతున్నారు. బతికుంటే బలుసాకన్నట్టు.. కొందరు కాలిబాటన వెళ్తూ తనువు చాలిస్తే.. మరి కొందరు ఇప్పటికీ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లపైకి వస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో మొదలైన ఈ ఆందోళనలు దేశమంతా విస్తరిస్తున్నాయి. కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినా సవాలక్ష మెలికలు ఉండటంతో.. వలసకార్మికులు సొంతూర్లకు వెళ్లటానికి నానా అవస్థలు పడుతున్నారు.

మొన్నటివరకు పిల్లాపాపలతో వందకిలోమీటర్లు నడిచిన వలస కార్మికుల వ్యథలు ఇంకా తీరడం లేదు. సొంతూర్లకు పోతామన్నా అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఇప్పటికీ పడిగాపులు తప్పడం లేదు. ఆకలితో అలమటిస్తున్నామని వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. దీంతో ఓపిక నశించిన కార్మికులు పలు జిల్లాల్లో పెద్దఎత్తున ఆందోళ నకు దిగుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టోలీచౌకీ, బంజారాహిల్స్‌లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ కార్మికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. వరంగల్‌లో శనివారమే రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇతర రాష్ట్ర కార్మికులు కలెక్టరేట్‌కు బయల్దేరి వెళ్లారు. ఇక ఆంధ్రా అధికారులు అనుమతించకపోవడంతో మహిళలు, గర్భిణులు ఎండలోనే పడిగాపులు గాస్తు న్నారు. ’35రోజులుగా తిండికి తిప్పలు పడుతున్నాం. క్యాంపుల్లో సరిగా భోజనం దొరకడం లేదు. రోగమొస్తే ఇక్కడే సచ్చేటట్టు ఉన్నాం. మమ్మల్ని మా ఊళ్లకు పంపండి. ఎన్నిరోజులన్ని ఈడనే ఆపుతరు’ అంటూ రామగుండంలో ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం అందజేసిన సాయం ఎటూ సరిపోక సహనం కోల్పోయి నినాదాలు చేశారు. రెండ్రో జులు గా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగినా స్పందన లేకపోవ డంతో పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు, కార్మికులకు వాగ్వాదం చోటుచేసుకో వడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే కోరుకంటి ఆనంద్‌ చేరుకుని సముదాయించారు. వారందరినీ తిరిగి క్యాంపులకు తరలించారు.

హైదరాబాద్‌లోని టోలీచౌకీ ప్రాంతంలో ఉత్తర్‌ ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల కార్మి కులు గుమిగూడారు. తమ ప్రాంతాలకు వెళ్లిపోతా మని పట్టుబట్టడంతో పోలీసు అధికారులు చేరుకుని వారితో మాట్లాడారు. బంజారాహిల్స్‌ వెంకటేశ్వర కాలనీ డివిజన్‌ ప్రాంతాల్లో నివసించే దాదాపు వెయ్యి మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ రాష్ట్రాలకు పంపాలని వేడుకున్నారు. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి క్యాంపుల కు తరలించారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన సుమారు 40 మంది హన్మకొండ అదాలత్‌ నుంచి కలెక్టరేట్‌కు బయలుదేరారు. వాహనాలు సమకూ ర్చాలని, సొంతింటికి పంపాలని డిమాండ్‌ చేశారు. అధికారులు ఎవరూ స్పందిచలేదనీ, టోల్‌ఫ్రీ నెంబరు 18004251980 కూడా పనిచేయడం లేదని వాపోయారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండల గనుల్లో పనిచేసే 194మంది కార్మికులు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా వినకుండా కొందరు కూలీలు నడుచుకుం టూ ఇంటిదారి పట్టారు. నల్లగొండ జిల్లాలోని దామ రచర్ల వద్ద వాడపల్లి చెక్‌ పోస్ట్‌ దాటి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి అనేక మంది కూలీలు వస్తున్నా పోలీసులు అడ్డుకుంటు న్నారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని చెప్పారు. నాగార్జునసాగర్‌ సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి రాగా, ఆ రాష్ట్ర పోలీసులు అనుమతించలేదు. తిండి, మంచినీరు లేక చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎండలో అనేక ఇబ్బందులుపడ్డారు. మాదగ్గర డబ్బు లు లేవుతినడానికి తిండిలేక చిన్న పిల్లలు అలమటి స్తున్నారు. కనీసం మంచినీరు కూడా ఇస్తలేరు’ అని కొందరు వలసకూలీలు కన్నీటి పర్యంతమయ్యారు.

వేతనాలు ఇవ్వని యాజమాన్యాలు
పని లేదూ, డబ్బుల్లేవు.. కంపెనీ షెల్టర్లలో ఉంటున్నాం.. మమ్మల్ని ఇంటికి పంపండని కాంట్రా క్టర్ల వద్ద పనిచేసే కార్మికులు మొరపెట్టుకున్నారు. నిజామాబాద్‌జిల్లా డిచ్‌పల్లిమండలం సుద్దపల్లి గ్రామ శివారులో మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సం బంధించిన పైపుల తయారీ చేసేందుకు జిమెయిల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సుమారు 350 నుంచి 400 మంది జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కూలీలున్నారు. లాక్‌డౌన్‌ వల్ల వసతుల్లేక దుర్భరంగా ఉంటున్నారు. కంపెనీ యాజమాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదని వారు తెలిపారు. ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌, తహశీల్దార్‌ వేణుగోపాల్‌ గౌడ్‌ చేరుకుని వాళ్లను శాంతింపజేశారు.

ఆన్‌లైన్‌లో పాసులు పొందినా నో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సుమారు 200మంది వలస కూలీలు ఆన్‌లైన్‌లో పాసులు పొందారు. శనివారం అర్ధరాత్రి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట -జీలుగుమిల్లి మధ్య ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అనుమతించలేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని తేల్చిచెప్పారు. ఆందోళనకు దిగడంతో అశ్వారావుపేట తహసీల్దార్‌ చల్లా ప్రసాద్‌, సీఐ రాజ్‌గోపాల్‌ చెక్‌పోస్టు వద్దకు వెళ్లి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనుమతి కోసం ఆదివారం రాత్రివరకు బస్సులు, ప్రయివేటు వాహనాలు, సమీప చెట్ల కిందే ఉన్నారు. వృద్ధులు, చంటిపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మెడికల్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే…
తెలంగాణ రాష్ట్రంలోని వలస కూలీలు, ఇతరులు తమ స్వస్థలాలకు వెళ్లాలంటే మెడికల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌-19 నివారణ కోసం కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన అధికారుల్ని కోరారు. పోలీస్‌, రెవెన్యూ, వైద్యశాఖల అధికారులతో ప్రత్యేకంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. స్వస్థలాలకు వెళ్లేవారి వివరాలు, ఆరోగ్య పరిస్థితిని ధృవీకరిస్తూ ఈ కమిటీలు పత్రాలు ఇస్తాయనీ, అలాగే వాహనాల నెంబర్లు, ప్రయాణీకుల సంఖ్యను కూడా ఆయా పత్రాల్లో పొందుపర్చాలని తెలిపారు. ఈ ధృవీకరణ పత్రాలను అన్ని రాష్ట్రాల్లోని చెక్‌పోస్టుల వద్ద అనుమతిస్తారని పేర్కొన్నారు. ఈ కమిటీలు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అంతరాష్ట్ర సరిహద్దులకు రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్‌పోస్టుల వద్ద ఈ ధృవపత్రాలను అందచేస్తారని వివరించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates