‘జూమ్‌’కి పోటీ.. తెలుగోడి 42

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • అదరగొట్టిన బెజవాడ టెకీ రాజశేఖర్‌
  • 9 నెలల కృషితో వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌
  • పరీక్షిస్తున్న న్యూయార్క్‌ యూనివర్సిటీ
  • హార్వర్డ్‌ వర్సిటీనీ మెప్పించిన యాప్‌

చైనా వాళ్ల ‘జూమ్‌’ యాప్‌కు దీటైన వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ రూపొందించినవారికి భారత ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది గుర్తుందా? 

బెజవాడకు చెందిన రాజశేఖర్‌ (35) అనే టెకీ.. ప్రభుత్వం ఆ ప్రకటన చేసే సమయానికే జూమ్‌ను మించిన యాప్‌ను రూపొందించేశాడు. దాని పేరు.. ‘42’. న్యూయార్క్‌, హార్వర్డ్‌ వర్సిటీలు మెచ్చిన యాప్‌ అది!

లాక్‌డౌన్‌ వేళ చాలా పాఠశాలలు.. పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడానికి వాడుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌. కానీ, జూమ్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ అంత శ్రేయస్కరం కాదని కేంద్రం.. ఆ యాప్‌ను తమ కార్యాలయంలో నిషేధిస్తున్నామని గూగుల్‌ ప్రకటించడంతో అంతా ఆలోచనలో పడ్డారు. దానికి బదులుగా ఏవైనా ఉచిత వీడియోకాన్ఫరెన్స్‌ యాప్‌లు ఉన్నాయా అని చూడటం మొదలుపెట్టారు. అలాంటివారందరికీ శుభవార్త. ఏపీలోని విజయవాడకు చెందిన రాజశేఖర్‌.. ‘42’ పేరుతో జూమ్‌కు దీటైన మొబైల్‌ యాప్‌ను రూపొందించాడు. ఫర్‌, టు.. అనే రెండు పదాలూ కలిసొచ్చేలా రాజశేఖర్‌ తన యాప్‌కు ఈ పేరు పెట్టాడు.

అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్శిటీ ఈ యాప్‌ను పైలట్‌ పద్ధతిన పరీక్షిస్తుండగా.. హార్వర్డ్‌ యూనివర్సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) ఈ యాప్‌ పనితీరు గురించి తెలుసుకోవడానికి ఆదివారంనాడు రాజశేఖర్‌తో 42 యాప్‌ ద్వారానే కనెక్ట్‌ అయ్యారు. అతడు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను తిలకించి.. జూమ్‌ యాప్‌ కన్నా అదనపు ఫీచర్లతో, రక్షణలతో రూపొందించిన ఆ యాప్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి, ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌లోకి రాబోతోంది. రాజశేఖర్‌కు తల్లిదండ్రులు లేరు. విజయవాడ కృష్ణలంకలో మేనమామల వద్ద పెరిగాడు. పదో తరగతి, ఇంటర్‌ వరకూ విజయవాడలోనే చదివిన రాజశేఖర్‌.. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అమెరికాలో చేశాడు. ‘42’ యాప్‌కు తొమ్మిది నెలల క్రితమే రూపకల్పన చేశాడు. ముందుగా ‘42’ పేరుతోనే ఎడ్యుకేషన్‌ ఇన్ఫో తయారు చేశాడు. ఇంజనీరింగ్‌లో ఎలాంటి కోర్సులు చేసిన వారు ఎన్ని మార్కులు సాధిస్తున్నారు? ఎలాంటి కోర్సులు చదివిన వారికి ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయి? ఎలాంటి కోర్సులు చదివి ఆయా రంగాల్లో ఉద్యోగాలు సంపాదించి ఎంతెంత వేతనాలు సంపాదిస్తున్నారు? తదితర వివరాలతో ఒక సమాచార బ్యాంకును రూపొందించి ‘42’ స్టూడెంట్‌ పేరుతో ఆన్‌లైన్‌లో ఉంచాడు.

అలాగే ఇంజనీరింగ్‌ కళాశాలలు, అవి అందించే కోర్సులు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా 42 స్టూడెంటల్‌లో నిక్షిప్తం చేశాడు. ఇది ఎంతగానో పాపులర్‌ అయింది. ఈ క్రమంలో 42 శ్రేణిలో జూమ్‌యాప్‌ తరహాలో దాని కంటే మరిన్ని ఫీచర్లు, సెక్యూరిటీపరంగానూ మెరుగ్గా ఉండేలా రెండు యాప్‌లను తీసుకు వచ్చాడు. రెండూ ఆన్‌లైన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ అప్లికేషన్లే. ఒకటి 42 లెర్న్‌. దీన్ని విద్యాసంస్థల కోసం రూపొందించారు. రెండోది 42 వేవ్‌. ఇది కార్పొరేట్‌ సంస్థలు, వాటి సిబ్బంది అవసరాలను తీర్చటానికి రూపొందించారు. ఈ రెండింటికీ యాప్‌లతో పాటుగా వెబ్‌సైట్‌లను కూడా రాజశేఖర్‌ రూపొందించాడు. నిజానికి అతడు ఈ యాప్‌లను భారతీయుల కోసమే, బెంగళూరులో ఉన్నప్పుడే అభివృద్ధి చేశాడు. అయితే, వాటి గురించి తెలుసుకున్న న్యూయార్క్‌ యూనివర్సిటీ.. తమ అధ్యాపకులు, విద్యార్థుల కోసం దీన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది. చాలా సౌకర్యవంతంగా, మంచి ఫీచర్లతో ఉండటంతో న్యూయార్క్‌ యూనివర్సిటీకి ఈ యాప్‌ నచ్చింది. ఈ విషయం హార్వర్డ్‌ యూనివర్సిటీకి తెలియడంతో వారు కూడా రాజశేఖర్‌ను సంప్రదించారు.

భలే మంచి చౌక బేరము..
సాధారణంగా వీడియోకాన్ఫరెన్స్‌ యాప్‌లు ఫ్రీ ట్రయల్‌, ప్రీమియం వెర్షన్‌లో ఉంటాయి. రాజశేఖర్‌ 42 యాప్‌ కూడా ఈ రెండు వెర్షన్లలో వస్తోంది. ప్రీమియం వెర్షన్‌ ఉపయోగించుకోవాలంటే మిగిలిన ప్రముఖ యాప్స్‌ కంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ట్రయల్‌ వర్షన్‌ను 30 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. ట్రయల్‌వెర్షన్‌లో చాలా యాప్‌లు పరిమిత సంఖ్యలోనే వీడియోకాన్ఫరెన్స్‌కు అనుమతిస్తాయి. కానీ 42 యాప్‌ ద్వారా ఎంత మంది అయినా కనెక్ట్‌ కావచ్చు. భ ద్రతపరంగా మరో ముఖ్యమైన ఫీచర్‌ ఏంటంటే.. ఏ దేశంలోని వారు ఈ యాప్‌ను ఉపయోగిస్తే వారికి సంబంధించిన డేటా అదే దేశంలోని సర్వర్‌లో నిక్షిప్తమయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల అన్నిదేశాలూ సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్‌ రికార్డింగ్‌ సౌకర్యం కూడా ఉంది.

వినూత్న ఆలోచనలతో..
రాజశేఖర్‌ చిన్న వయసులోనే పెద్దపెద్ద కంపెనీలలో పనిచేశాడు. ఇండియాలో కార్‌ 24 అనే సంస్థలో బిజినెస్‌ హెడ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఎకో ఇన్సూరెన్స్‌ కంపెనీలో చేరి ఆ సంస్థ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించాడు. ఓలా ప్రయాణానికి, అమెజాన్‌ ఉత్పత్తులకు వినియోగదారులకు రూ.1తోనే ఇన్సూరెన్స్‌ చేయించే సరికొత్త ఐడియా అతడిదే. ఆ తర్వాత అమెరికాలో ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కోసం ఒక యాప్‌ రూపొందిస్తే.. అక్కడి ‘బిజినెస్‌ పోస్ట్‌’లో దాని గురించి కథనం ప్రచురితం కావడం విశేషం.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates