వీటి కంటే జైళ్లు నయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– క్వారంటైన్‌ సెంటర్లలో వలసకూలీల వెతలు
– కనీస సదుపాయాల లేమితో కష్టాలు
– మానసిక ఆందోళనకు గురవుతున్న బాధితులు

లక్నో : వందలాది కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుతున్న వలసకార్మికులను క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. వారికి కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నాయి. దీంతో అక్కడ ఉండాలంటేనే వాళ్లు నరకం అనుభవిస్తున్నారు. వాటి కంటే జైళ్లలో ఉండటం నయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన కార్మికులను అక్కడి బీజేపీ ప్రభుత్వం 14 నుంచి 20 రోజుల పాటు నిర్బంధ కేంద్రాలకు పంపుతున్నది. కానీ అక్కడ వారిని పట్టించుకునేవారేవరూ లేరనీ, తమకు కనీస అవసరాలను తీర్చడానికి కూడా ఎవరూ రావడం లేదని వారు వాపోతున్నారు.

యూపీలోని బలరాంపూర్‌కు చెందిన పలువురు వలసకార్మికులు ఇటీవలే మహారాష్ట్రలోని పూణె నుంచి కాలినడకన యూపీకి చేరారు. వారిని ఇదివరకే పూణెలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి అక్కడినుంచి పంపించారు. వారందరూ ఇంటికి చేరుకోగానే అధికారులు వచ్చి వారిని బలవంతంగా జిల్లాలోని 130 చోట్ల ఉన్న నిర్బంధ కేంద్రాలకు తీసుకెళ్లారు. దాదాపు 5 వేల మంది ఈ కేంద్రాలలో ఉంటున్నారు. వీరిలో ఎవరికీ పాజిటివ్‌ లక్షణాలు లేకున్నా.. వారిని అక్కడికి తీసుకొచ్చి 14 రోజులు కావస్తున్నా.. అధికారులు మాత్రం అక్కడి నుంచి పంపించడానికి ససేమిరా అంటున్నారు.

కాగా క్వారంటైన్‌ కేంద్రాల్లో పారిశుధ్యం ఊసే లేదనీ.. తాగునీరు, టాయిలెట్లు, పడుకోవడానికి ప్రత్యేక బెడ్‌షీట్లు ఏవీ లేవని బాధితులు వాపోతున్నారు. ఈ కేంద్రాల్లో మహిళలూ ఉన్నారనీ, వారికి ప్రత్యేకమైన వాష్‌రూంలు ఏర్పాటుచేయలేదని చెబుతున్నారు. సరైన ఆహారం కూడా పెట్టడం లేదని బాధితులు అంటున్నారు. తాముంటున్న కేంద్రాల పక్కనుంచే మురుగునీరు ప్రవహించే కాల్వలున్నాయనీ, చిన్నపిల్లలు అక్కడికెళ్తే వారికి ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకెవరికీ మాస్కులు కూడా ఇవ్వలేదనీ, రాత్రిపూట కరెంటు లేక చీకట్లో ఉంటున్నామని చెప్పారు. సంబంధిత అధికారులను అడిగితే క్యాండిళ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. బలవంతంగా తీస్కొచ్చి ఇక్కడ పడవేశారనీ, తమ ఆరోగ్యం ఎలా ఉందో చూడటానికి ఎవరూ రావడం లేదని వలసకూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి గోడు పట్టించుకునే వారెవరూ లేకపోవడంతో కేంద్రాల్లో ఉండే కొంతమంది ఒత్తిడికి గురై మానసిక ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నవారిలో పలువురు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారూ ఉన్నారనీ, కానీ వారిని చూడటానికి వైద్యులు రావడం లేదని తద్వారా వారు మరింత ఒత్తిడికి గురవుతున్నారని వలసకూలీలు తెలిపారు.

మాకు డబుల్‌ క్వారంటైన్‌
నీలేశ్‌, వలసకూలీ, బలరాంపూర్‌
ముందు మమ్మల్ని పూణెలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడి నుంచి కాలినడకన వచ్చి ఇంటికి చేరుకుంటే అధికారులు మళ్లీ మమ్మల్ని నిర్బంధగృహాలకు పంపారు. ఇక్కడ పట్టించుకునే నాధుడే లేదు. కనీస వసతుల్లేవ్‌. మా గురించి ఆరా తీసేవారూ, ఆరోగ్యం గురించి పట్టించుకునేవారెవరూ లేరు. అలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడెందుకు ఉంచారు. ఇక్కడ ఉన్నవారిలో కొంతమంది 14 రోజులు అయిపోయి నెగిటివ్‌ వచ్చినా అధికారులు వారిని ఇంటికి పంపించడం లేదు. మేం ఇంటికెళ్లిపోతాం. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనీయండి.

ఇక్కడే చచ్చిపోతామేమో…
సంతోష్‌కుమార్‌, రోహువ, గోరఖ్‌పూర్‌
మేముంటున్న క్వారంటైన్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాల్లేవు. రాత్రిపూట చీకట్లోనే ఉంటున్నాం. అధికారులను అడిగితే క్యాండిళ్లు ఇస్తున్నారు. మాకు మాస్కులు కూడా ఇవ్వడం లేదు. ఈ కేంద్రాల్లో చిన్నపిల్లలు, మహిళలూ ఉన్నారు. టాయిలెట్లు లేకపోవడంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా కంటే ముందు ఇక్కడి సమస్యలతోనే మేము చచ్చిపోయేట్టున్నాం.

20 రోజులు గడిచినా ఇక్కడే
వసీం, బలరాంపూర్‌
నేనొచ్చి 20 రోజులు దాటిపోయింది. కరోనా పరీక్షలు చేయిస్తే నెగిటివ్‌ అని వచ్చింది. అయినా నన్ను ఇంటికి పంపించడం లేదు. మా ఇల్లు మొత్తం నా మీదే ఆధారపడి బతుకుతుంది. నేను లేకుంటే వారి అవసరాలు ఎవరు తీరుస్తారు..? ఇక్కడ ఉన్నప్పుడే నా ఫోన్‌ కూడా పోయింది. పదిహేను రోజులుగా మా వాళ్లతో మాట్లాడలేదు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates