పేదలకు మరణశాసనమే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆర్థిక విపత్తులో అసంఘటితరంగం
– లాక్‌డౌన్‌ భారమంతా పేదలు, వలసకూలీలపైనే..
– ఉపాధి హామీ, ప్రజా పంపిణీ విస్తరించాలి…
– జన్‌ధన్‌తో రూ.500…ఉపాధి హామీతో రూ.10వేలు..ఏది మేలు! : ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్త జీన్‌ డ్రెజ్‌

కరోనా సంగతేమోగానీ… లాక్‌డౌన్‌ తెచ్చిపెట్టిన పరిస్థితులు పేదలు, వలస కూలీలకు మరణశాసనంగా మారిందని ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్త జీన్‌ డ్రెజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో లింగ సమానత, అభివృద్ధి ఆకలి సమస్యలు, కరువు…మొదలైన అంశాలపై సుదీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్న ఆయన, ఎలాంటి సన్నద్ధత లేకుండా లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌ పరిస్థితులపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..

మీ అంచనా ప్రకారం, లాక్‌డౌన్‌ ప్రభావం ఎంతమంది జీవితాలపై, జీవనోపాధిపై ఉంది?
అంసఘటితరంగంలో అందరిపైనా దీని ప్రభావం ఉంది. లాక్‌డౌన్‌ విధింపుతో ఒక్కసారిగా వారంతా ఆర్థిక తుఫాన్‌లో చిక్కుకుపోయారు. ఎటుపోవాలో? ఏం చేయాలో ? తెలియని పరిస్థితి వారిది. చేతిలో పని ఉంటేనే వారి కుటుంబాలు గడుస్తాయి. అట్లాంటిది ఇన్నిరోజులుగా వారందర్నీ నిర్బంధానికి గురిచేస్తే ఏమై పోవాలి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రిలీఫ్‌ ప్యాకేజీల్లో లోపాల్లేంటి? ఎలాంటి మార్పులు చేయాలి?
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ భారాన్ని మోస్తున్నది…పేదలు, వలస కూలీలు, దినసరి కూలీలే. ప్రపంచంలో అత్యంత కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వాల నుంచి చిన్న ప్రయత్నం కూడా జరగటం లేదు. పేదలకు వైద్య సేవలు లేవు. వారి పిల్లలకు పౌష్టికాహారం లేదు. మధ్యాహ్న భోజనం లేదు. ఉపాధి హామీ పనులు లేవు. అధికారస్వామ్యంతో, నియంతృత్వభావంతో విధానాలు ఎంచుకుంటే పనిచేయవు. ఇంత పెద్ద కష్టంలో మనుషులంతా ఒక్కటే అనే భావంతో పనిచేయాలి. కేరళలో అది కనపడింది. మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలబడింది. మానవ వనరులను, ఆర్థిక వనరులను కేరళ సమర్థవంతగా వాడింది.

ఆకలి, పేదరికాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి?
ప్రజా పంపిణీ వ్యవస్థను సాధ్యమైనంతగా విస్తరించాలి. అర్హులెవరు? కానివారెవరు? అని ఆలోచించే సమయం కాదు. సామాజిక వంట శాలలు కొంతవరకు పనిచేస్తాయి. ప్రభుత్వాలు చేయాలనుకుంటే చాలా పనులున్నాయి. సాధ్యమయ్యే విషయాలే ఇవన్నీ. వలస కూలీలు స్వంత రాష్ట్రాలకు వెళ్లాక…అక్కడ వారికి ఉపాధి హామీ కల్పించాలి.

ఉపాధి హామీ పనులతో ఏవిధంగా మేలు చేసే అవకాశముంది?
పేదలు, వలస కూలీలకు కేవలం బియ్యం, గోధుమలు, పప్పు ఇస్తే సరిపోతుందా! వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఆదాయ మార్గాల్ని చూపాలి కదా! జన్‌ధన్‌ యోజన ద్వారా నెలకు రూ.500 ఇస్తున్నారు. అదే ఉపాధి హామీ చట్టం అమలుజేస్తే, రూ.పదివేలు వారి చేతికి అందుతుంది. ఇందులో ఏది అమలుజేస్తే పేదలకు, వలస కూలీలకు మేలు? ఏ విధానం మంచిది? అన్నది ఇక్కడే అర్థమైపోతున్నది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates