ఆకలి.. అభద్రత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వినూత్నంగా కదంతొక్కిన కార్మికలోకం
– భౌతికదూరం పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా మే డే
– కరోనా నుంచి రక్షణ, కార్మికుల హక్కులు కాపాడాలంటూ ప్రదర్శనలు

పారిస్‌ : కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్నవేళ సర్వత్రా ఆకలి, అభద్రత నెలకొన్నాయని కార్మికలోకం ఆందోళన వ్యక్తం చేసింది. మే డే స్ఫూర్తిని కరోనా వైరస్‌ అడ్డుకోలేదని పలు దేశాల్లో కార్మికులు నినదించారు. అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున, భౌతికదూరం పాటిస్తూ శుక్రవారం ‘మే డే’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రాన్స్‌ దేశంలో కార్మికులు అపార్ట్‌మెంట్‌ బాల్కానీల్లో నిలబడి పాటలు పాడగా, చెక్‌ రిపబ్లిక్‌లో కారు హారన్లు మోగించారు. గ్రీస్‌ పార్లమెంట్‌ ముందు హక్కుల కోసం నినదిస్తూ పెద్ద సంఖ్యలో కార్మికులు మే డే ర్యాలీ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆయా దేశాల్లో నిబంధనలు పాటిస్తూనే, సాంప్రదాయ ప్రదర్శనలకు భిన్నంగా తమదైన శైలిలో కార్మికులు మే డే వేడుకలు జరిపారు.వైరస్‌బారిన పడకుండా సురక్షితంగా పనిచేసుకునే పరిస్థితులు కల్పించాలని, కార్మికులకు మాస్కులు, రక్షణ చర్యలు చేపట్టాలని అమెరికా, యూరప్‌ దేశాల్లో కార్మికసంఘాలు డిమాండ్‌ చేశాయి. మెరుగైన వైద్య బీమా, ఉపాధి కోల్పోయినవారికి ప్రభుత్వ సాయం అందజేయాలని పారిస్‌, కాలిఫోర్నియా, అంకారా, ఏథెన్స్‌…తదితర నగరాల్లో కార్మికులు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. ”ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పని ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా కార్మికుల విషయంలో రక్షణాత్మక చర్యలు చేపట్టాలి” అని ఫ్రాన్స్‌లోని కార్మికసంఘం నాయకుడు ఫిలిప్పీ మార్టినెజ్‌ రేడియో ప్రసంగంలో చెప్పారు.

గ్రీస్‌లో..
భౌతికదూరం పాటిస్తూ గ్రీస్‌ పార్లమెంట్‌ ముందు జరిగిన ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాస్కులు ధరించి, ఒకరికి మరొకరి మధ్య దూరం ఒక మీటర్‌ ఉండేట్టు చూసుకుంటూ పూర్తి నియంత్రణ పాటిస్తూ కార్మికలు జరిపిన ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షించింది.

అమెరికాలో…
కరోనా వైరస్‌ బారిన పడకుండా యాజమాన్యాలు సరైన చర్యలు చేపట్టాలని అమెరికాలో కార్మికసంఘాలు మే డే సందర్భంగా నినదించాయి. కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనల్ని నిరసిస్తూ అక్కడక్కడా ప్రదర్శనలు జరిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమైంది.

టర్కీలో..
రాజధాని అంకారా, ముఖ్య నగరం ఇస్తాంబుల్‌ సహా అనేకచోట్ల మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాస్కులు, చేతులకు గ్లోవ్స్‌ ధరించి కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. ఇస్తాంబుల్‌లో పోలీసులు ప్రదర్శనను అడ్డుకొని పలువుర్ని అరెస్టు చేశారు.

చెక్‌ రిపబ్లిక్‌
లాక్‌డౌన్‌ కారణంగా జర్మనీ, ఆస్ట్రియాతో ఉన్న సరిహద్దులు మూసుకుపోయాయి. దాంతో తాము పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయామని మే డే సందర్భంగా చెక్‌ రిపబ్లిక్‌లో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కారు హారన్లు మోగిస్తూ, డప్పులు కొట్టి…తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

బల్గేరియాలో..
ప్రతిపక్ష సోషలిస్టు పార్టీ ఈసారి భిన్నమైన పంథాలో కార్మికదినోత్సవాన్ని జరిపింది. కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, సామాజిక న్యాయాన్ని తెలియజేస్తూ ‘సామాజిక మాధ్యమం’లో అనేకమందికి సందేశాలు పంపింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates