సగటు జీవికి కష్ట‘మే’..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఏప్రిల్‌ నెలంతా ఇంట్లోనే…
  • కుటుంబ ఆదాయం శూన్యం
  • మేలో మెతుకుకోసం వెతుకులాట

‘‘లాక్‌డౌన్‌ వేళ సగటు జీవి బతుకు కష్టాల కుంపటైంది. నెల జీతం మీద ఆధారపడే చిరుద్యోగి కలలపై కరోనా ఆశనిపాతంగా మారింది. అరకొర వేతనంతో బతుకు బండినిలాగే అసంఘటిత రంగ కార్మికుల జీవనాధారం కకావికలమైంది. ఇప్పుడు వాళ్లందరి నోట.. ఒక్కటే మాట. ఈ నెల ‘‘నాలుగేళ్లూ నోట్లోకెళ్లేదెలా…?’’ అనే..! కరోనాతో కాదు.. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామని, మెతుకు కోసం దాతల వైపు చూస్తున్నామని’ చిరు వేతనజీవుల ఆవేదన. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అసంఘటిత కార్మికుల వ్యథలపై కథనం.

హైదరాబాద్‌ సిటీ : ‘‘చింతల్‌బస్తీకి చెందిన రాజయ్య, శ్రీలక్ష్మి దంపతులు. వారికి ఇద్దరి పిల్లలు. భర్త ఓ స్వీట్‌షాపులో పనిచేస్తాడు. భార్య ఇంటిపని కార్మికురాలు. ఇద్దరి కష్టానికి నెలకు రూ.17 వేలు చేతికొస్తాయి. పిల్లలను ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించారు. ఇంటి అద్దె పోగా.. నెలకు రూ.2 నుంచి రూ.3 వేలు మిగులుతాయి. అవీ ఇతరత్రా ఏ ఖర్చూ లేకుంటేనే..! గత నెల నుంచి వారంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. మార్చిలోని ఇరవై రోజుల వేతనంతో ఏప్రిల్‌ వెళ్లదీశారు. ఇప్పుడు వాళ్ల దిగులంతా మే నెలలో ఇల్లు గడిచేదెలా’’ అనే.

‘‘బోరబండ వాసి అరుణ్‌ ఓ షాపింగ్‌మాల్‌లో ఉద్యోగి. అతని భార్య స్వప్న రెష్టారెంట్‌లో స్వీపర్‌. ఇద్దరి సంపాదన కలిపితే నెలకు రూ.14 వేలు దాటదు. అందులో ఇంటి అద్దె రూ.4 వేలు. వారికి ఇద్దరు పిల్లలు. అరుణ్‌ తల్లితో సహా ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఆ ఇంటికి భార్యాభర్తల రెక్కల కష్టమే ఆదరువు. 40 రోజుల నుంచి పనుల్లేక, అంతా ఇంటికే పరిమితమయ్యారు. బతుకుతెరువు కోసం శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆ కుటుంబం.. పనెప్పుడు దొరుకుతుందో.. రోజులు ఎట్ల గడుస్తయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది.’’

ఇలా ఒక్కరా, ఇద్దరా… రెక్కల కష్టం మీద ఆధారపడి నెలకు రూ.15 వేలకు మించని అసంఘటిత కార్మికులు భాగ్యనగరంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈఎస్‌ఐ లబ్ధిదారులు సుమారు 11 లక్షల మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే నగరంలోని భవన నిర్మాణరంగ కార్మికుల సంఖ్య ఆరు లక్షల మంది.. ఇలా ఏ రంగంలోనైనా వేతన జీవులు లక్షల్లో ఉన్నారు. వీరందరి నెలసరి వేతనం రూ.6 నుంచి రూ.15 వేల లోపే. ఏ నెలకు ఆ నెల వచ్చే సంపాదనే కుటుంబానికి ఆధారం. ప్రస్తుతం వారంతా లాక్‌డౌన్‌తో పనుల్లేక ‘‘బతుకు జీవుడా అంటూ’’ కాలం వెళ్లదీస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కష్టాలు గట్టెక్కేదెలా…!
హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇంటిపని తదితర రంగాల్లోని కార్మికులకు లాక్‌డౌన్‌ ముగిశాక కూడా ఎప్పుడు పనులు దొరుకుతాయో తెలియని పరిస్థితి. అసలు నగరంలో ఈఎస్‌ఐ, భవిష్యనిధి వంటి సౌకర్యాలకు దూరంగా ఉన్న బడుగుజీవుల వివరాలు కార్మిక శాఖ రికార్డుల్లోనూ అందుబాటులో లేవని సీపీఎం నగర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. అసంఘటిత కార్మికుల్లో కొంతమంది ఏప్రిల్‌ వరకూ రోజులు వెళ్లదీయగలిగారు. ఇప్పుడు సమస్యంతా ఇకపై ఇంటిని ఎలా నెట్టుకురావాలనేదే.! వీరిలో చాలామందికి రేషన్‌కార్డులు కూడా లేవు.

ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయం. ‘‘వెహికల్స్‌ వాయిదాలు చెల్లించాలి. ఇల్లుగడవాలి. ముఖ్యమంత్రి చెప్పారని… ఇంటి కిరాయి కట్టకుంటే, ఓనర్లు మాత్రం ఊరుకుంటారా.. అలా అని యజమానితో లడాయికి దిగితే ఆ ఇంట్లో ఎన్నాళ్లని ఉండగలం’’ అని బాలాపూర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ బాబూరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘రెక్కల కష్టం మీద ఆడే డొక్కలు మావి. అప్పు అడుగుదామన్నా మాకు ఇచ్చేవారు లేరు. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకున్నాం. పనిలేకుండా ఇల్లుగడిచేదెలా అనే ఆలోచనతో నిద్ర పట్టడంలేదు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి’’ అని ఇంటిపని కార్మికురాలు విజయలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు.

కరోనాతో కాదు.. ఆకలితో చచ్చేలా ఉన్నారు…
నగరంలో సుమారు ఆరు లక్షల మంది ఇంటిపనివారున్నారు. అందులో యాభై శాతం మంది నెల వేతనం రూ.6 వేల లోపే. రూ.10 వేల లోపు జీతం పొందుతున్నవారు 45 శాతం మంది ఉంటారు. కేవలం 5 శాతం మంది మాత్రమే రూ.15 వేలు పైన తీసుకుంటున్నారు. మాకు చాలామంది ఇంటి పనికార్మికులు ఫోన్లుచేసి ఆదుకోవాలని అడుగుతున్నారు. వారిలో చాలా మందికి రేషన్‌కార్డులు లేవు. కొద్దిమందికి మాత్రం 12 కేజీల బియ్యం, రూ.500 నగదు అందాయి. మిగిలిన వాళ్లు క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. కరోనాతో కాదు.. ఆకలితో చచ్చేలా ఉన్నామని వారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కార్పొరేట్లకు పన్ను రాయితీ ఇవ్వడం కాదు. బడుగుజీవుల నోటికి అన్నం ముద్దను అందించే ప్రణాళికలు ఇప్పుడు అత్యవసరం.
– సిస్టర్‌ లిస్సీ, తెలంగాణ డొమెస్టిక్‌ వర్కర్స్‌ యూనియన్‌ 

వలస కార్మికుల జీవనాన్ని కాపాడాలి..
కరోనాని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై పాలకులు స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ అదే జరిగితే కార్మిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ కార్మికులకు వేతనాలను చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– కె.భరతేష్‌, నగర అధ్యక్షుడు, ఏఐటీయూసీ 

ఒక్కో కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలి…
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులందరికీ ఒక్కో కుటుంబానికి రూ.7,500 చొప్పున నగదు సాయం అందించాలి. తెలంగాణలో భవన నిర్మాణరంగ కూలీల వెల్ఫేర్‌ బోర్డులో రూ.2,500 కోట్ల నిధులున్నాయి. అందులో నుంచి సివిల్‌ సప్లై విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.334 కోట్లు మళ్లించింది. అది చాలా అన్యాయం.
– ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ

నగరంలో రూ.15లోపు నెలవేతనం పొందుతున్న వారు : సుమారు 22 లక్షలు
ఆటో కార్మికులు  : 1.5 లక్షలు
ప్రైవేటు విద్య, వైద్య సంస్థల్లో సేవలందిస్తున్న వారు : 5.6 లక్షలు
భవననిర్మాణ కూలీలు  : 6 లక్షలు
ఇంటిపనివాళ్లు  : 6 లక్షలు
షాపింగ్మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లలోని వేతనజీవులు    : 1.85 లక్షలు
ప్రైవేటు రవాణా రంగ కార్మికులు : 1.2 లక్షలు
సెక్యూరిటీ, వాచ్మెన్ఉద్యోగులు  : 75 వేలు
బిద్రీ, గాజులు, గ్లాసు, చెప్పులు తదితర ఉత్పత్తి సంస్థల్లోని దినసరి కూలీలు : సుమారు 2 లక్షలు
ఈఎస్ లబ్ధిదారుల సంఖ్య  : 11 లక్షలు 

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates