కాల్చే ఆకలి కూల్చే వేదన..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • నేడే మే డే
  • కరోనా లాక్‌డౌన్‌తో పోయిన ఉపాధి
  • తినడానికి తిండి లేక.. సంపాదన లేక
  • వలస కార్మికుల కష్టాలు, వేదనలు
  • అమెరికా నుంచి అనంతపురం దాకా..
  • ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దుస్థితి ఇదే!
  • 160 కోట్ల మందికి ఉపాధి కరువు
  • అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆందోళన

నేడే మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవం. కానీ.. ఎక్కడా కార్మికులు ఆనందంగా లేరు!! కడుపు నిండా తిండి లేదు. చేద్దామంటే పని లేదు. ఉన్న ఊళ్లో ఉండలేరు. పుట్టిన ఊరికి వెళ్లలేరు. కూలీలు, కార్మికులకు, ఉద్యోగులకు పని లేదు. పని చేసే ఉద్యోగులకు పూర్తి జీతాలు లేవు! అమెరికా నుంచి అనంతపురం దాకా ఇంచుమించుగా అందరిదీ ఇదే పరిస్థితి. ఇది కార్మికుల పాలిట కరోనా కల్లోలం!! ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 కోట్ల మంది కార్మికులది (ప్రపంచ కార్మికశక్తిలో సగం) ఇదే దుస్థితి అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కాల్చే ఆకలి.. కూల్చే వేదన
మహాకవి శ్రీశ్రీ అన్నట్టు.. ధనికస్వామికి దాస్యం చేసే.. యంత్ర భూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా.. ఇప్పుడు కణకణ మండే విలాపాగ్నులు, విషాదాశ్రువులే! దేశాలు వేరైనా.. ప్రాంతాలు ఏవైనా.. కార్మికుల జీవితాలపై కరోనా అనే పిడుగు పడింది. అందరిదీ ఒక్కటే పరిస్థితి! కాల్చే ఆకలి.. కూల్చే వేదనే!! కరోనా కల్లోలానికి అంతటి అమెరికా సైతం విలవిలలాడుతోంది. పేరుకు అగ్రరాజ్యమేగానీ.. ఉద్యోగ భద్రతకు అది పేద రాజ్యమే. అక్కడ ఉద్యోగాలుంటాయిగానీ.. ఉద్యోగ భద్రత ఉండదు. వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు చేసేవారిని పక్కన పెడితే.. గంటల లెక్కన పని చేయడం. వారాంతాల్లో జీవితాన్ని ఆస్వాదించడం. ఇదే అమెరికన్లకు తెలిసిన ఆనందం. కానీ, కరోనా వారి జీవితాల్లో పెనుకల్లోలమే సృష్టించింది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఆ దేశంలో దాదాపు 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా.

అలాంటివారిలో టామ్‌ కూడా ఒకడు. ఒక స్థిరమైన ఉద్యోగమంటూ లేకుండా గంటల లెక్కన పనిచేసే టామ్‌లాంటివాళ్లకి ప్రస్తుతం ప్రభుత్వం కొంతవరకూ ఆర్థిక సాయం చేస్తోంది. కానీ.. ఇప్పటికే ఉన్న అప్పుల సంగతి? వాహన రుణాల వంటి వాటి సంగతి? అవన్నీ పక్కన పెడితే.. అక్కడ వైద్యం చాలా ఖరీదు. ప్రాణమంత ఖరీదు. కరోనా విరుచుకుపడుతున్న తరుణంలో.. ఎవరు ఎప్పుడు ఆ  వైరస్‌ బారిన పడతారో తెలియని పరిస్థితి. టామ్‌ స్నేహితుడి తండ్రి ఇటీవలే అలా కరోనా బారిన పడ్డాడు. ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో ఆయనకు సరిగ్గా వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే భయం టామ్‌ను.. అతడిలాంటి లక్షలాది మంది అమెరికన్లను వెంటాడుతోంది.

భార్య చనిపోయినా..
నరేశ్‌ భూయా.. ఎక్కడో ఝార్ఖండ్‌లోని గఢ్వాల్‌ జిల్లా నుంచి పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వచ్చాడు! కళ్లు కనిపించని తల్లి.. అనారోగ్యంతో ఉన్న భార్య.. ముగ్గురు పిల్లలు! అందరికీ అతడే ఆధారం. భవన నిర్మాణ కార్మికుడిగా సంపాదించే రూ.6000లోనే కొంత ఖర్చుపెట్టుకుని మిగతాది ఊరికి పంపాలి. ఇన్నాళ్లూ అలాగే పంపాడు. ఇంతలో లాక్‌డౌన్‌ వచ్చిపడింది. అక్కడ అతడి భార్యకు జ్వరం వచ్చింది. ఇంటికి వెళ్లలేని దుస్థితి! వారాలు గడిచిపోయాయి. నరేశ్‌ భార్య శాంతి చనిపోయింది! గుండెల్లో దుఃఖం పొగిలి పొగిలి పైకి వచ్చి గొంతులో గడ్డకడుతుంటే దుఃఖాన్ని ఉగ్గబట్టుకుని బతుకుతున్నాడు భూయా.

అమ్మకు చీర కొందామనుకున్నా..
అతడి పేరు జితేశ్‌. మహారాష్ట్ర నుంచి 4నెలల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అతడి తండ్రికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. తల్లికి ఆయన్ను చూసుకోవడమే సరిపోతుంది. వారికి ఆధారం జితేశ్‌ సంపాదనే. ఇక్కడ తానుసంపాదించే సొమ్ములో కొంత ఇంటికి పంపేవాడు. ‘‘ఈసారి ఊరెళ్లేటప్పుడు ఇంటి ఖర్చులకు కావాల్సిన మొత్తం, సరిపడా సరుకులు, అమ్మకి చీర తీసుకెళదామనుకున్నాను. ఇప్పుడు ఖాళీ జేబుతో వెళ్లాల్సివస్తోంది. ఇంటి దగ్గర అమ్మానాన్నకు ప్రభుత్వం 10 కేజీల బియ్యం మినహా మరేమీ ఇవ్వలేదు. మళ్లీ పనులు మొదలయ్యే దాకా కుటుంబం ఎలా గడవాలి?’’ అంటాడతను ఆవేదనగా. మార్చిలో అతడు పనిచేసిన 20రోజుల జీతం కూడా కంపెనీ వాళ్లు ఇవ్వలేదు. పోనీ, మహారాష్ట్రకు వెళ్లినా అక్కడ కూడా చేయడానికి పనులేమీ లేవు.

ఇప్పుడతడి పరిస్థితి ఏంటి?
ఒక నరేశ్‌.. ఒక జితేశ్‌.. ఒక నర్సింహ.. ప్రాంతాలు వేరైనా వారి కష్టాలు ఒక్కటే! కాకపోతే ఒక్కటే ఊరట ఏంటంటే.. ఇన్నాళ్లూ కనీసం సొంత రాష్ట్రానికి వెళ్లలేని పరిస్థితి. వలస కూలీలు తమ సొంతరాష్ట్రాలకు వెళ్లడానికి ఇప్పుడు కేంద్రం అనుమతించింది కాబట్టి.. పిల్లాజెల్లాను, ముసలి తల్లిదండ్రులను, తమ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూసే జీవిత భాగస్వామిని చూసుకోవడానికైనా అవకాశం దొరికింది. కలో గంజో.. ఇక పల్లెలోనే! ఇంట్లోవాళ్లతోనే!!

నిబంధనలతో అనుమతులు ఇవ్వాలి!
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాం. అప్పు చేసి కొన్న కార్ల వాయిదాలు, పన్నులు చెల్లించడం కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రావెల్స్‌ కంపెనీలను మూసుకోవాల్సిందే. కనీసం షరతులతో అనుమతులిస్తే కొంత ఊరట కలుగుతుంది. ఆర్టీఏకు చెల్లించాల్సిన త్రైమాసిక పన్నును రద్దు చేస్తే కొంతలో కొంత మేలు.
బాబూరావు, విజయవాడ ట్యాక్సీ
ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

అల్లాడిపోతున్నాం!

షెడ్‌ తెరిస్తేనే కుటుంబం గడుస్తుంది. లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటి నుంచి పనుల్లేకుండా ఖాళీగా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. నాతోపాటు నా వద్ద పనిచేసే వాళ్లూ ఇబ్బంది పడుతున్నారు. మాకు మెకానిక్‌ షెడ్డే జీవనాధారం. రోజుకు రూ.500 – 1000 వరకు సంపాదిస్తా. వాహనం రిపేరు వచ్చిందని ఖాతాదారులు ఫోన్‌ చేసినా వెళ్లలేకపోతున్నా. రెక్కల కష్టంతో వచ్చే కాస్తోకూస్తో ఆదాయం లాక్‌డౌన్‌లో ఆగిపోయింది.
మోహనరావు, మెకానిక్‌, విజయవాడ

కన్నీళ్లు వస్తున్నాయి
మాది శ్రీకాకుళం జిల్లా. మూడేళ్ల క్రితం విజయవాడకు వచ్చేశాను. చిన్నగది అద్దెకు తీసుకుని ఉంటున్నా. మట్టి పనికో, బిల్డింగ్‌ పనికో వెళ్తే రోజుకు రూ.500-600లు సంపాదించుకునేవాడ్ని. ఇప్పుడు ఏ పనీ లేకుండా పోయింది. ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి. తిండికీ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేదు. ప్రస్తుతం దాతల సహాయంతో  రోజులు గడుస్తున్నాయి.
రామారావు, కూలీ

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates