కోవిడ్‌ మరణాలు: ఎందుకీ తేడాలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా మహమ్మారితో చనిపోతున్న వారి శాతం(మరణాల రేటు) ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటోంది. వైరస్‌ ఒకటే అయినప్పుడు వేర్వేరు చోట్ల వేర్వేరుగా ప్రభావం చూపడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి? ఈ వైరస్‌ అంత వేగంగా ఉత్పరివర్తనం చెందడం లేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నప్పటికీ కొన్ని దేశాల్లో ప్రాణాంతకంగా మారడానికి మరికొన్ని చోట్ల మరణాలు తక్కువగా నమోదవడానికి కారణాలు ఏమిటి? దీనిపై అంటువ్యాధుల నిపుణులు స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. కొవిడ్‌ మరణాల రేటు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో ఎలా ఉంది? పరిశీలిద్దాం..

అంతటా ఒకేలా లేదు..
ప్రపంచవ్యాప్తంగా(ఏప్రిల్‌ 25 నాటికి) 29,19,404 మంది కొవిడ్‌ బారిన పడగా.. 2,03,164 మంది ప్రాణాలు కోల్పోయారు. నమోదైన కేసులు, మరణాలను లెక్కిస్తే 6.96 శాతం మంది చనిపోయారు. ఈ రేటు అన్నిచోట్లా ఒకేలా లేదు. కరోనాను కట్టడి చేస్తున్న దక్షిణ కొరియాలో 2.24 శాతం ఉంటే.. ఫ్రాన్స్‌లో ఏకంగా 14 శాతంగా, ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన అమెరికాలో 5.65 శాతం, భారత్‌లో 3.12 శాతంగా ఉంది. అయితే ప్రమాదకర స్థాయిలో ఈ వైరస్‌ మార్పులకు లోనైందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. కరోనా ఆనుపానులు తేల్చడానికి నిర్విరామంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, నిపుణులు మరణాల రేటులో భారీ తేడాలుండటానికి అనేక అంశాలు కారణమవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.

తేడాలకు కారణం?
జన సాంద్రత, వయోభేదాలు, వైద్య సదుపాయాల లేమి, పెరిగిన కేసుల తీవ్రతకు అనుగుణంగా చికిత్సలు అందించే సామర్థ్య లేమి వంటివి మరణాల రేటులో తేడాలకు కారణాలు కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వ్యాప్తిని తగ్గించేంద]ుకు సరైన సమయంలో చర్యలు చేపట్టడం, వ్యాధిని ముందే గుర్తించడం, పరీక్షల సామర్థ్యం, ప్రజారోగ్య విధానాలూ కీలకమేనని చెబుతున్నారు. దేనివల్ల కేసుల పెరుగుదల లేదా తగ్గుదల జరుగుతోందీ తేల్చడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాల జనాభా ప్రాతిపదికన మరణాల రేటును చూస్తే చాలా తక్కువగానే ఉంటుందని అంటున్నారు.

వయో ప్రభావం..
కరోనా సోకిన వారిలో వివిధ వయసులను బట్టి ముప్పు అవకాశాల్లో వ్యత్యాసాలుంటాయి. వయోధికులు ఎక్కువగా తీవ్ర అస్వస్థతకు గురి కావడమో, మృతి చెందడమో జరుగుతోంది. లాన్సెట్‌ (బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత వైద్య పత్రిక) పరిశోధకులు పేర్కొన్న మేరకు.. చైనా సహా అనేక దేశాల్లో 40-49 ఏళ్ల వయసు వారిలో మరణాల రేటు తక్కువగా, 80 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా(ఇటలీలో 20.2 శాతం) ఉంది. వయోధికులు ఎక్కువగా ఉన్న ఇటలీలో మరణాల శాతం పెరగడానికి ఇదో కారణం కావొచ్చన్న అంచనాలున్నాయి.

పరీక్షల నిర్వహణ..
వివిధ దేశాల్లో పరీక్షల నిర్వహణ తీరు, కేసుల లెక్కింపు విధానాల్లో తేడాలుండటం మరణాల రేటు మారడానికి ఒక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని దేశాల్లో కొవిడ్‌ లక్షణాలు బయటపడిన వారికి, ఆస్పత్రులకు వస్తున్న వారికే పరీక్షలు చేస్తున్నారు. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు బయట పడకపోయినా పరీక్షలు నిర్వహించడంలేదు. అనుమానితులు, కొవిడ్‌ రోగులతో సన్నిహితంగా ఉన్నవారు, వారిని కలిసినవారు.. ఇలా ఎక్కువ మందికి పరీక్షలు చేస్తేనే మొత్తం రోగుల సంఖ్య తేలుతుందని, అప్పుడు మరణాల రేటు కచ్చితంగా చెప్పొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పరీక్షలు ఎక్కువ చేయడంవల్లే మరణాల రేటు తక్కువగా ఉంటోందని విశ్లేషిస్తున్నారు. ఎంత ఎక్కువ మందికి పరీక్షలు చేపడితే కరోనా నిర్ధారణ కూడా అదే తీరులో జరుగుతుంది. తొలి దశలోనే చికిత్సలు అందించడం, తీవ్రంగా దీని బారిన పడిన వారికి ప్రత్యేక చికిత్సలు అందించడం, ఇతర జాగ్రత్తలు పాటిస్తే మరణాల శాతం తగ్గుతుంది.

అమెరికాలోనూ వ్యత్యాసాలు..
అమెరికాలో ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి మధ్య మరణాల రేటులో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. న్యూయార్క్‌లో ప్రపంచం, అమెరికా సగటులను మించి మరణాల రేటు (7.6%) ఉంది. మిషిగన్‌లో అంతకంటే ఎక్కువగా 8.8% ఉంది. దక్షిణ డకోటాలో అది 0.5 శాతం మాత్రమే. అమెరికాలో ఈ వారంలో కొవిడ్‌తో మృతి చెందిన వేల మందికి నెల రోజుల క్రితమే ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో కొత్త కేసుల నమోదు తగ్గినప్పటికీ మరణాల శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఆరంభంలో మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యధిక కేసులు నమోదు కావడంతో ఆరోగ్య సంరక్షణ విధానంపైన, వైద్య వనరులపైనా ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోవడంతో మరణాల రేటు కొంత పెరిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కట్టుదిట్టమైన విధానాల అమల్లో తేడాలు, వయోధికులు, ఆరోగ్యవంతమైన జనాభాలో తేడాలు వంటివి కారణంగా విశ్లేషిస్తున్నారు.

భారత్‌లో..
భారత్‌లో మరణాల రేటు 3.12 శాతం. కోలుకుంటున్న వారి (రికవరీ) శాతం 20.89. మహారాష్ట్రలో అత్యధికంగా 6,817 కేసులు నమోదు కాగా మరణాల రేటు 4.42 శాతం.

ఇక్కడ 1 శాతం లోపే..
5 వేలకు పైగా కరోనా కేసులు బయటపడిన దేశాల్లో 6 దేశాల్లో మరణాల రేటు 1 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రధానంగా 74,588 కేసులు నమోదైన రష్యాలో 0.91 శాతం మరణాల రేటు. సింగపూర్‌లో ఇది మరింత తక్కువగా 0.09 శాతం ఉండటం గమనార్హం. అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బెలారస్‌, ఖతార్‌లలో 1 శాతం లోపే ఉన్నాయి.

ఇతర కారణాలూ..
* వివిధ దేశాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడిన వారు, హృద్రోగులు, తీవ్ర ఊబకాయం, మధుమేహం, మూత్రపిండాలు చెడిపోవడం, కాలేయ వ్యాధులున్న వారు ఎక్కువగా ఉన్నచోట.. ఆరోగ్యకరమైన వ్యక్తులు తక్కువగా ఉన్నచోట మరణాల రేటు పెరుగుతోంది.
* ఆరోగ్య సంరక్షణ విధానాలు, వైద్య వసతుల సామర్థ్యం, వ్యవస్థాపరమైన ఏర్పాట్లు మెరుగ్గా ఉండటం.. ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ వంటి చర్యలు పక్కాగా పాటించడం వంటివి మరణాలను తగ్గిస్తున్నాయి.
* భారత్‌ వంటి దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు-తేమ, కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ అమలు, ఇతర వ్యాక్సినేషన్లు వంటివి మరణాల రేటును తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
* భౌతిక దూరం పాటించకపోవడం వంటి అంశాల వల్లా కొన్ని దేశాల్లో మరణాల రేటు పెరుగుతోంది.
* ఇది కొత్త వైరస్‌ కావడంతో తదనుగుణంగా వైద్య ఏర్పాట్లు లేకపోవడం ప్రారంభంలో కొన్ని దేశాల్లో తగిన చికిత్సలు అందించలేకపోయారు.
* కేసుల సత్వర గుర్తింపు, రోగులతో సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించి వేరుగా ఉంచడం వంటి చర్యలతో మరణాల రేటును తగ్గించొచ్చు.
* ఆధునిక సాంకేతక విజ్ఞానాన్ని వినియోగించడం దక్షిణ కొరియా వంటి దేశాల్లో సత్ఫలితాలనిచ్చింది.

మరణాల రేటు తెలియాలంటే.. ఎందరు కొవిడ్‌ బారిన పడ్డారు? ఎంతమంది చనిపోయారు? అన్నది కచ్చితంగా తేలాల్సి ఉంటుంది. మరణిస్తున్న వారి గురించి తెలుసుకోగలుగుతున్నాం, కానీ ఎందరికి సోకిందన్నది మనకు తెలియడం లేదు.
– అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ నిపుణులు

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates