కోవిడ్‌ దెబ్బకు అమెరికా కుదేలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కోవిడ్‌-19 బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఇప్పట్లో ఆగేలా కనబడటం లేదు. ఆదివారం మరో 1,741 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 55,415కు పెరిగింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య(9.87 లక్షలు) పది లక్షలకు చేరువయింది. కరోనా బాధితుల్లో 1,18,781 మంది కోలుకోగా, 8,13,126 మంది చికిత్స పొందుతున్నారు. 15,143 మంది పరిస్థితి విషమంగా ఉంది.

మరోవైపు కొలరాడో, మిన్నిసోటా, ఒక్లహామా, అలస్కా, టెక్సాస్‌, జార్జియా, టెన్నిసీ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపులతో కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు ఎక్కువశాతం ‘స్టే ఎట్‌ హోమ్‌’కు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. రోగుల చికిత్సలో డిస్‌ఇన్పెక్టంట్స్‌ ఇంజెక్షన్స్‌, అతినీల లోహిత కిరణాల వినియోగంపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. కాగా, కరోనా ప్రభావంతో అమెరికాలో నిరుద్యోగిత రేటు 16 శాతం పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటేసింది. స్పెయిన్‌లో 23,190, ఇటలీలో 26,644, ఫ్రాన్స్‌ లో 22,856, బ్రిటన్‌లో 20,732 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షన్నర దాటినా మరణాల సంఖ్య(5,976) ఆరు వేలలోపే ఉండటం గమనార్హం. ఇక రష్యాలో ఆదివారం రికార్డు స్థాయిలో 6,361 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 80,949కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 66 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 747కు చేరింది. పారి‌స్‌లో ఆంక్షలతో విసిగిపోయిన ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చేశారు. చైనాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా జన్మస్థానం వుహాన్‌లో కొత్త కేసులు, మరణాలు చోటుచేసుకోలేదు.

RELATED ARTICLES

Latest Updates