‘గాంధీ’ వైద్యురాలికి అవమానం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఇంటా బయట సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆస్పత్రుల్లో ప్రాణాంతక వైరస్‌తో పోరాటం చేస్తుంటే.. బయట మానవత్వం లేని మనుషులతో తలపడాల్సి వస్తుంది. కోవిడ్‌-19 బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులకు ఇళ్లలోకి రానీయబోమని కొంతమంది హుంకరిస్తున్నారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో పనిచేసే వైద్యురాలికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

ఆమె నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌ యజమానితో పాటు ఇరుగు, పొరుగు వారు ఇంట్లోకి రానివ్వకుండా వైద్యురాలిని అడ్డుకున్న ఘటన మన్సూరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. మన్సూరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో తన సోదరుడి వద్ద సదరు వైద్యురాలు నెల రోజులుగా ఉంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు కొద్దిరోజులుగా ఆమె సేవలు అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అపార్టుమెంట్‌ వాసులు కొన్ని రోజులుగా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుక్రవారం ఆమె తన సామానులు తీసుకునేందుకు అపార్టుమెంట్‌కు వెళ్లగా యజమానితో పాటు స్థానికులు వైద్యురాలిని అడ్డుకున్నారు. వారంతా కలిసి ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అక్కడితో ఆగకుండా వైద్యురాలని నోటికి వచ్చినట్టు తిట్టి అక్కడి నుంచి గెంటేసినంత పని చేశారు. దీంతో కలత చెందిన వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైద్య బృందం జరిగిన ఘటన గురించి రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వివరించారు. వైద్యురాలిని అడ్డుకున్న వారితో పాటు ఇలాంటి ఘటనలకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కరోనాపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న తమను గౌరవించలేకపోయినా ఫర్వాలేదు గాని, అవమానాలకు మాత్రం గురిచేయొద్దని వైద్యసిబ్బంది కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Latest Updates