కాస్త నయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం
  • రెండు రోజులుగా కొత్త కేసుల కన్నా డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్యే ఎక్కువ
  • కొత్తగా 13 కేసులే నమోదు
  • ఆస్పత్రుల్లో ఉన్నవారు 667 మందే
  • ఇప్పటిదాకా 291 మంది డిశ్చార్జ్‌
  • గ్రీన్‌గా మారుతున్న రెడ్‌జోన్లు
  • కుదుటపడుతున్న కరీంనగర్‌
  • 7 రోజులుగా నమోదు కాని కేసులు
  • కరోనా రహితంగా పెద్దపల్లి జిల్లా
  • గ్రీన్‌జోన్‌లోకి నాగర్‌కర్నూలు జిల్లా

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది! ఒక దశలో రోజుకు 40.. 50.. 60 కేసులు కూడా నమోదు కాగా.. గత మూడు రోజుల్లో కేవలం 55 కేసులే నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో అయితే.. కొత్త కేసుల సంఖ్య కన్నా డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గురువారం 27 కొత్త కేసులు రాగా 58 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవారం 13 కొత్త కేసులు రాగా 29 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ, మెదక్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో శుక్రవారం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అంతేకాదు, కరోనా కారణంగా శుక్రవారం ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య కేవలం 25. ఈ గణాంకాలన్నీ చూస్తే రాష్ట్రంలో పరిస్థితి కాస్తనయమవుతున్నట్టే కనిపిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక.. ఇప్పటికే కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కట్టడి ప్రాంతాలుగా ప్రకటించిన చాలా చోట్ల.. చాలారోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్ల విభాగం నుంచి తొలగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

పది మంది ఇండోనేసియన్లకు వైరస్‌ పాజిటివ్‌ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కరీంనగర్‌ క్రమంగా కుదుటపడుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కట్టడిప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల 14 రోజులుగా ఎలాంటి కేసులూ రాకపోవడంతో అక్కడ కట్టడిని ఉపసంహరించారు. అలాగే.. వైరస్‌ బారిన పడి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు కోలుకోవడం.. వారి బంధువులు, కుటుంబసభ్యులకు పలుమార్లు పరీక్ష చేసినా నెగెటివ్‌ రావడంతో పెద్దపల్లిని కరోనా రహిత జిల్లాగా అధికారులు ప్రకటించారు. వైరస్‌ సోకినవారు ఉన్న ప్రాంతాల్లో రెడ్‌జోన్‌ను ఎత్తివేస్తున్నట్టు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. అదేకోవలో, ఇప్పటివరకూ రెండే పాజిటివ్‌ కేసులు నమోదైన నాగర్‌కర్నూలు జిల్లాలో కూడా కొత్త కేసులేవీ రాకపోవడంతో ఆ జిల్లాను గ్రీన్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు.  మహబూబ్‌నగర్‌జిల్లాలో 11 మందికి వైరస్‌ సోకగా.. వారిలో ఐదుగురిని వారం క్రితమే డిశ్చార్జ్‌ చేశారు.

శుక్రవారం మరో నలుగురిని ఇంటికి పంపారు. మహబూబ్‌నగర్‌లోని ఐదు కట్టడి ప్రాంతాల్లో.. ఒకచోట రెడ్‌జోన్‌ ఎత్తివేశారు. హైదరాబాద్‌లో సైతం మంగళ్‌హాట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆర్‌కే పేట్‌లో నెలరోజులుగా విధించిన కట్టడిని అధికారులు ఉపసంహరించారు. కరోనా నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ ఆర్‌కే పేట్‌ వాసులు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలోని చందానగర్‌ సర్కిల్‌లో కట్టడి జోన్ల నుంచి 6 ప్రాంతాలను తొలగించారు.

13లో 9 గద్వాలవాసులవే..
కొత్త కేసుల విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 540 మందిని  పరీక్షించగా అందులో 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో తొమ్మిది మంది గద్వాలవాసులే. అలాగే గ్రేటర్‌ పరిధిలో ఇద్దరికి, మేడ్చల్‌ జిల్లాలో ఒకరికి, నిర్మల్‌లో ఒకరికి వైరస్‌ సోకింది. గద్వాల పట్టణానికి చెందిన భార్యాభర్తలకు వైరస్‌ పాజిటివ్‌ రాగా.. మరొకరు రాజోలిగ్రామానికి చెందినవారు. గ్రేటర్‌ పరిధిలోని కాప్రాలో ఒక వ్యక్తికి (46) వైరస్‌ పాజిటివ్‌ రావడంతో ఆయన కుటుంబసభ్యుల కూడా వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు.

నిజాంపేట మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఒక చిన్నారికి, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఒక ఎంఐఎం నాయకుడికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 983కు, డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 291కి చేరింది. వాస్తవానికి శుక్రవారం100 మందికిపైగా డిశ్చార్జ్‌ అవుతారని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. అయితే.. తొలుత నెగెటివ్‌ వచ్చిన కొందరిలో మళ్లీ పాజిటివ్‌ రావడంతో వారిని ఆస్పత్రుల్లోనే ఉంచేశారు. దీంతో అనుకున్నస్థాయిలో డిశ్చార్జ్‌లు జరగట్లేదని అధికారులు చెబుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates