అడవిబిడ్డలు.. కోల్పోయే ఉద్యోగాలు 2 లక్షలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– తెలుగు రాష్ట్రాలపై ప్రభావం
– టీచర్‌ ఉద్యోగాల జీఓ కొట్టివేతతో అలజడి
– మరో 20 శాఖల నియామకాలపైనా ప్రభావం
– 32 జీవోల మనుగడ ప్రశ్నార్థకం
– ఆదివాసీల అందోళన
కొండూరి రమేష్‌బాబు

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్‌ 3 ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆదివాసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివాసీ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే ఈ జీవోను 2000 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. దట్టమైన అడవులతో కనీస రహదారి సౌకర్యం కూడా లేని ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేయటానికి మైదాన ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఫలితంగా ఏజెన్సీలో అవసరమైన స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించలేక పోయింది. దీనితో ఆదివాసీల్లో అక్షరాస్యత శాతం అతి తక్కువగా నమోదయింది. ఆదివాసీ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో చదువు మధ్యలోనే నిలిపి వేయటానికి టీచర్ల కొరత కూడా కారణమని ప్రభుత్వం భావించింది. స్థానిక ఆదివాసీలనే టీచర్లుగా నియమిస్తే ఎన్‌రోల్‌మెంట్‌ పెంచవచ్చని, వారి భాషలోనే విద్యాబోధన కొంత వరకూ చేయవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఐదవ షెడ్యూలు ప్రాంతంలో గవర్నర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా టీచర్‌ నియామకాల్లో నూరు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 3 వ నంబర్‌ జీవోను జారీ చేసింది. అప్పటి నుంచి ప్రత్యేక డీఎస్సీల ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రిజర్వేషన్‌ అమలు చేస్తూ వచ్చింది. ఈ జీవో అమల్లోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే 15,000 మంది ఆదివాసీలను ఏజెన్సీ ప్రాంతంలో టీచర్లుగా నియమించింది.

గిరిజన సలహా మండలిని సమావేశ పర్చాలి
ఏజెన్సీ ప్రాంతంలో టీచర్‌ నియామకాలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్‌ 3 నుసుప్రీం కోర్టు కొట్టివేసిన నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లో గిరిజన సలహా మండలి సమావేశాలను వెంటనే నిర్వహించాలి. రిజర్వేషన్లు కొనసాగించే విధంగా తీర్మానం చేసి గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి పంపించాలి. రెండు రాష్ట్రాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆదివాసీ అధికార మంచ్‌ గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు ఒక లేఖ కూడా రాసింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉన్నందువల్ల ఆర్టికల్‌ 371 డీ ప్రకారం ప్రత్యేక జోన్లుగా ప్రకటించి రిజర్వేషన్లు అమలు చేయాలి. 6 వ షెడ్యూలులో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి రిజర్వేషన్లు ఉన్నా యి. టీచర్‌ నియామకాలకు సంబంధించిన జీఓ కొట్టి వేయటంతో ఆదివాసీ నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్నారు. వారు ఉద్యోగాకాశాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది.
-డాక్టర్‌ మిడియం బాబూరావు,
జాతీయ చైర్మెన్‌, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌

రిజర్వేషన్ల కోసం పోరాటం…
ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ తదితర ఉద్యోగాల కోసం కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్లు కొనసాగించే వరకూపోరాటం చేస్తాం. ఉద్యోగులమంతా ఆదివాసీ యువతకు అండగా ఉంటాం. అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి రిజర్వేషన్లు కొనసాగించాలి. లేక పోతే లక్షలాది మంది నిరుద్యోగులుగా మారిపోతారు. అన్ని పార్టీల ఆదివాసీఎమ్మెల్యేలను కలిసి చర్చించిన తర్వాత ఆందోళప కార్యక్రమాన్ని ఖరారు చేస్తాం. రిజర్వేషన్లు కొనసాగించే విధంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఆదివాసీల తరపున న్యాయ పోరాటం చేయాలి. ప్రత్యేక రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత కల్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
కుర్సం రామారావు
రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ టీచర్స్‌ ఫెడరేషన్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates