చిన్న ప్రాణం.. పెద్దకష్టం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆహారం కోసం వలస కూలీల పిల్లల బేల చూపులు
  • నిస్సహాయంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులు

హైదరాబాద్‌: ఆ రోడ్డుపై వెళ్లే వాహనం ఏదైనా నెమ్మదించిందంటే చాలు… పిల్లాజెల్లా పరుగెత్తుకుని వచ్చి చుట్టు ముడుతున్నారు. చెప్పులు లేకుండా ఎండలో కాలుతున్న తారు రోడ్లపై పరుగులు పెడుతున్నారు. వారిలో చిన్నారులు దయనీయంగా చేతులు చాపుతున్నారు. ఈ పూటకు ఇంత ఆహారం దొరికితే చాలన్నట్లు ఉంది వారి తపన. ఇది హైదరాబాద్‌లోని అంబర్‌పేట-శివం రోడ్డులో కనిపిస్తున్న దుస్థితి. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ వలస కుటుంబాల్లోని చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కొన్ని కుటుంబాలు ఇక్కడ పాదచారుల బాటపై కవర్లతో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. గడ్డపారలు, గొడ్డళ్లు చేసి విక్రయిస్తేనే వీరి బతుకు సాగేది. అలాంటిది ఇప్పుడు ఆ పనులు నిలిచిపోవడంతో ఆకలి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఉన్న కుటుంబాల్లో దాదాపు 20 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. కమ్మరి వృత్తిపై జీవించే ఈ కుటుంబాల్లో పని దొరికితేగానీ కడుపు నిండదు. నెల రోజులుగా పనుల్లేవు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో కొద్దిరోజులు నెట్టుకొచ్చినా ఇప్పుడు దాతల వైపు చూస్తున్నారు. బతుకమ్మకుంట ప్రాంతంలో పలు జిల్లాల నుంచి వలస వచ్చిన కుటుంబాల్లోని చిన్నారులు వీధుల్లో గుంపులుగా ఆడుకుంటున్నారు. బడులున్న సమయంలో కనీసం అక్కడైనా చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం లభించేదని, ఇప్పుడే ఏమీ పెట్టలేకపోతున్నామంటూ వారి తల్లిదండ్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మూసారంబాగ్‌ ప్రాంతంలో నల్గొండ, సిరిసిల్ల, మెదక్‌, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలు రోడ్డు పక్కన గుడిసెల్లో నివసిస్తున్నారు. ఇదే తీరులో చేతివృత్తులు చేసుకుంటూ చాలా కుటుంబాలు చంపాపేట, బాలానగర్‌, కూకట్‌పల్లి, నాచారం, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయి.

పిల్లలు బక్కచిక్కిపోతున్నరు
పదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. ఇక్కడే రోడ్డుపక్కన ఉంటున్నం. నెల రోజులుగా పనిలేదు. దాతలు ఇచ్చే అన్నంపైనే కాలం వెళ్లదీస్తున్నాం. నాకు నలుగురు పిల్లలు. ఇప్పుడు వారిని ఎట్లా కాపాడుకోవాలో తెలియడం లేదంటూ అనిత అనే మహిళ తన బాధను వ్యక్తం చేసింది.

బడికెళ్తే కూరన్నం.. గుడ్డు
బడికి వెళ్తే కూరగాయలతో అన్నం, గుడ్డు, అరటిపండు పెడతారు. నెల రోజుల నుంచి పగటిపూట ఎవరో ఒకరు ఇచ్చేది తింటున్నా. రాత్రి మాత్రమే మా అమ్మ వండుతోంది. పగలంతా రోడ్ల పక్కన ఆడుతున్నం. రాత్రికి ఈ కాలువ పక్కనే నిద్ర పోతున్నా. నేను ఆంధ్ర మహాసభ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న. మా బడి ఎప్పుడు తీస్తారో అంటూ హైదరాబాద్‌లోని అంబర్‌పేట-శివం రోడ్డులో పాదచారుల బాటపై నివాసముండే అనుష్క అనే చిన్నారి ‘ఈనాడు’తో వాపోయింది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates