ఫలం.. నిష్ఫలం..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • గుండె తరుక్కు పోయే బాధ
  • మామిడి, ద్రాక్ష, బత్తాయి కొనేవారే లేరు
  • ద్రాక్ష తోటలోకి మేకలను తోలేసిన రైతు
  • ఎకరాకు రూ.5 లక్షల దాకా నష్టం
  • తోటల్లోనే రాలిపోతున్న బత్తాయిలు
  • ఉచితంగా తీసుకెళ్లండి అంటున్న రైతులు
  • 6.5 లక్షల టన్నుల మామిడి దిగుబడి
  • పడిపోయిన ధర.. క్వింటాకు రూ.3,500

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ జగిత్యాల/నాగర్‌ కర్నూల్‌/వనపర్తి/గద్వాల : మేడ్చల్‌ జిల్లా కీసరలోని బుచ్చిరెడ్డి అనే రైతు ఆరున్నర ఎకరాల్లో ద్రాక్షతోట సాగుచేశాడు. ద్రాక్ష బాగా కాసింది. బుచ్చిరెడ్డి ఆనందాన్ని లాక్‌డౌన్‌ దెబ్బకొట్టింది. రవాణా, మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో తలపట్టుకున్నాడు. చెట్ల నుంచి ద్రాక్షా పళ్లు రాలిపోతున్నాయి. తోటలోకి మేకలను వదిలాడు. అతడికొచ్చిన ఈ నష్టం రూ.35లక్షలు!!

గద్వాల జిల్లా ఉండవల్లిలో పల్లె గోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి 9ఎకరాల్లో బత్తాయి తోట పెట్టాడు. కాయ ఏపుగా వచ్చింది. లాక్‌డౌన్‌తో కొనుగోళ్లు లేక చెట్లపైనే కాయను వదిలేశాడు. ఎవరికైనా వచ్చిఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ల వచ్చునని వారు చెప్పారు. ధరూర్‌ మండలంలో బండ్ల రాజశేఖర్‌రెడ్డి తన తోటలోని బత్తాయి పండ్లను ఉచితంగా పంపిణీ చేశాడు.

వనపర్తి జిల్లా వీణవంక మండలానికి చెందిన శివశంకర్‌ నాలుగు ఎకరాల తోటను రూ.3.3 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. పెట్టుబడికి మరో రూ.2 లక్షలు. ఎకరాకు 3టన్నుల దిగుబడి వచ్చి.. టన్ను ధర రూ.70వేలు పలికితే ఖర్చులు పోనూ రూ.2లక్షలు మిగులుతాయని అనుకున్నాడు. లాక్‌డౌన్‌తో కథ అడ్డం తిరిగింది. పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. పైగా రూ.3లక్షలు నష్టపోతున్నానని వాపోయాడు.

..వీరే కాదు.. రాష్ట్రంలో ద్రాక్ష, మామిడి, బత్తాయి తోటలు సాగుచేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలనే నమ్ముకుంటే లాభాల మాట అటుంచి కనీసం పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. కరోనా వైరస్‌ ప్రబలడం.. ఆ కారణంగా ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ పండ్ల తోటల రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు ఎగుమతులన్నీ ఆగిపోయాయి. చేతికి అందిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నారు.  రవాణా కష్టాలను అధిగమించి హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకొస్తే అక్కడ దళారులు ముంచుతున్నారు.  మధ్యాహ్నం వరకే మార్కెట్‌ ఉంటుందని హడావుడి చేసి హడావిడి చేసి సగానికి సగం రేట్లు అడుగుతుండ్రు.

గత్యంతరం లేక తీసుకొచ్చిన ద్రాక్షను రైతులు తెగనమ్ముకుంటున్నారు. ఒక్కోసారి పంట కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.  ఎకరాకు కనీసం రూ.3లక్షల నుంచి 5లక్షల వరకు ద్రాక్ష రైతులు నష్టపోయారు. గత ఏడాది ద్రాక్ష తోటల వద్దే కిలో రూ.50కి పైగానే రైతుకు ధర లభించింది. ఇప్పుడు కిలో రూ.20 నుంచి రూ.30వరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. గద్వాల జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో బత్తాయి తోటలు విస్తరించాయి. ఎకరానికి 8 టన్నుల బత్తాయి దిగుబడులు వస్తాయి. జిల్లాలో సుమారు 50 వేల టన్నుల బత్తాయి వచ్చింది. కొనుగోళ్లులేక పంటను ఏంచేయాలో తెలియక రైతులు పండ్లను చెట్లపైనే వదిలేస్తున్నారు.

మామి‘డీలా’
రాష్ట్రంలో దాదాపు 88,665 మంది రైతులు 3,08,340 ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ఎకరానికి సగటున 3.7 టన్నుల చొప్పున రాష్ట్రంలో 6.50 లక్షల  టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈసారి కాత కాస్త తక్కువగా ఉండటంతో మంచి డిమాండ్‌ ఉంటుందని మామిడి రైతులు ఆశపడ్డారు. లాక్‌డౌన్‌తో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నిజానికి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మామిడి పంట 50 శాతం మేరకు ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రైలు రవాణా పూర్తిగా మూసివేయడంతో ఈ ఏడాది మామిడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి.

రాష్ట్రంలో సెర్ప్‌  ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో కొనుగోళ్లు చేసి, పెద్ద పెద్ద మాల్స్‌కు తరలించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ వల్ల మాల్స్‌ మూత పడటంతో ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. నిరుడు క్వింటా మామిడి పంట ధర రూ.5 వేల నుంచి రూ.5500 వరకు పలుకగా, ప్రస్తుతం రూ.3500 వరకు మాత్రమే పెడుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates