జాతి బలమే కరోనాకు విరుగుడు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సమూహ రోగనిరోధక శక్తే కరోనాకు విరుగుడు
ఎలాంటి వైరస్‌లనైనా ఎదుర్కొనే దివ్యఔషధం ఇదే
ప్రతి జాతి, సముదాయంలో అంతర్లీనంగా వ్యవస్థ
ఒక తరం నుంచి మరో తరానికి క్రమానుగతంగా శక్తి
స్పానిష్‌ ఫ్లూ నుంచి ఒకప్పుడు కాపాడిందీ ఇదే
స్వీయ తప్పిదాలతో నేడు మనుషుల్లో బలహీనం
మారిన జీవన శైలి.. చెడు అలవాట్లే కారణం

హైదరాబాద్‌: ప్రతి మనిషిలో సహజంగా రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. ఇది మన శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను ఎదుర్కొనేందుకు ప్రతిరక్షకాలను (యాంటీబాడీలను) తయారుచేస్తుంది. అవి మన ప్రాణాలను రక్షిస్తూ ఉంటాయి. ఇదేవిధంగా ఒక జాతి లేదా ఒక సముదాయం మొత్తానికి ప్రత్యేకమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. అంటే.. ఒక వైరస్‌ లేదా బ్యాక్టీరియా పూర్తిగా లేదా స్వల్పంగా ఒక సముదాయంపై ప్రభావం చూపిస్తే, వారిలో ఆ సూక్ష్మజీవిని ఎదుర్కొనే వ్యవస్థ తయారవుతుంది. ఉదాహరణకు భారతీయుల్లో మలేరియా రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. దీనినే సమూహ రోగ నిరోధక శక్తి లేదా హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటారు. ఇది జన్యువుల ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి క్రమానుగతంగా వస్తుంది. ముఖ్యంగా అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు ఒక జాతిలో సమూహ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. అందుకే గతంలో వచ్చిన కుష్ఠు, మశూచి వంటి అనేక రోగాలు ఇప్పుడు మనుషులకు సంక్రమించడం లేదు.

కట్టడికి రెండు మార్గాలు
వైరస్‌ లేదా బ్యాక్టీరియా కలిగించే అంటువ్యాధులు సమాజంలో గొలుసు విధానంలో వ్యాప్తి చెందుతాయి. వీటిని ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఎక్కువ మందిలో అభివృద్ధి చెందినప్పుడే సంక్రమణ ఆగిపోతుంది. సగం జనాభాలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినా సంక్రమణకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు రెండు మార్గాలు ఉంటాయి. ఒక సమూహంలోని మనుషులకు స్వతహాగా రోగనిరోధక శక్తి పెరుగడం. అంటే సూక్ష్మజీవులు దాడి చేసినప్పుడు శరీరం స్పందించి యాంటీబాడీలు తయారు చేయడం. రెండో మార్గం.. వాక్సిన్లు. ఇది కృత్రిమ పద్ధతి. చనిపోయిన వైరస్‌ లేదా బ్యాక్టీరియాను వ్యాక్సిన్‌ రూపంలో అందించి యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపించడం. కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లు తరుచూ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు కొత్తగా వాక్సిన్లను కనిపెట్టి.. అందరికీ అందించడం పెద్ద సమస్య. అందుకే కొవిడ్‌ జాతికి చెందిన వైరస్‌లను ఎదుర్కొనేలా సమూహ రోగనిరోధక శక్తిని పెంపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే అత్యధిక శాతం జనాభాలో యాంటీబాడీలు ఉత్పత్తి కావాలి.

సహజ ‘సమూహ’ శక్తి ఎలాగంటే..
వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు ఒక్కో దశలో నిర్ణీత సంఖ్యలో ప్రజలను వైరస్‌ లేదా బ్యాక్టీరియా బారిన పడేలా చేస్తారు. వారిలో ప్రతిరక్షకాలు పుట్టిన తర్వాత రెండో దశలో మరికొందరిని వైరస్‌ బారిన పడేలా చేస్తారు. అయితే ఇలా హెర్డ్‌ ఇమ్యూనిటీని పెంపొందించడం సామాన్య విషయం కాదు. అత్యంత జాగ్రత్తల మధ్య దశలవారీగా నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి దశలో వృద్ధులు, చిన్నారులను ఇండ్లకే పరిమితం చేసి, సహజ రోగనిరోధక శక్తి అధికంగా ఉండే యువతను బయటికి పంపాలి. 15రోజుల్లో వారిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. కొందరికి వ్యాధి సోకినా.. వారికి వెంటనే చికిత్స అందించి నయం అయ్యేలా చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను బట్టి మహిళలను, వృద్ధులను, పిల్లలను బయటికి పంపుతారు. ఒకవేళ వైరస్‌ తిరుగబడినా.. చికిత్స అందించేందుకు వీలుగా వైద్యవ్యవస్థను సిద్ధం చేయాలి. తద్వారా అత్యధిక శాతం జనాభాలో యాంటీబాడీలు ఉండి, వైరస్‌ వ్యాప్తి ఆగిపోతుంది.

సహజ రోగనిరోధక శక్తి పెరుగాలి
సమూహ రోగనిరోధక శక్తి పెరుగాలంటే ముందు మనలోని సహజ రోగనిరోధక శక్తి బలంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ దీన్ని వృద్ధి చేసుకోవచ్చని సలహానిస్తున్నారు.

బ్రిటన్‌ తప్పిదమిదే..
కరోనాను ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్ముకున్నది. మొదటి దశలో యువతను మాత్రమే బయటికి పంపాల్సి ఉండగా.. అందరినీ స్వేచ్ఛగా వదిలేసింది. దీంతో కరోనా విజృంభించింది.

అనేక అడ్డంకులు..
కొవిడ్‌-19ను ఎదుదర్కొనేలా సమూహ రోగనిరోధక శక్తి పెరుగడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 2-3శాతం మందిలో మాత్రమే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యాయి. కాబట్టి హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయికి చేరడానికి సమయం పడుతుందని, లాక్‌డౌన్‌ ఎత్తివేయడం క్షేమం కాదని చెప్తున్నది. దీంతోపాటు..

కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులపై మళ్లీ వైరస్‌ ప్రభావం చూపుతుందో లేదో తెలియదు.
ఒక వ్యక్తిలో కరోనా ప్రతిరక్షకాలు పుట్టినా.. వారు పూర్తిగా సురక్షితమని, ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చేయడం లేదని కచ్చితంగా చెప్పలేం.
కరోనా చికిత్సకు సరైన వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. వ్యాక్సిన్‌ తయారీకి కనీసం మరో 6 నెలల నుంచి సంత్సరం పట్టొచ్చు.
హెర్డ్‌ ఇమ్యూనిటీని పెంపొందించే క్రమంలో ఎలాంటి విపత్తులను ఎదుర్కోవడానికైనా వైద్యరంగం సిద్ధంగా ఉండాలి.

Courtesy Namaste Telangana

RELATED ARTICLES

Latest Updates