ఏజెన్సీ టీచర్స్ నియామకాల్లో.. వందశాతం రిజర్వేషన్లు చెల్లవ్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

జీవో 3ను కొట్టివేస్తూ సుప్రీం తీర్పు
తెలుగు రాష్ట్రాలకు వర్తింపు

న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ఉపాధ్యాయ నియామకాల్లో వందశాతం రిజర్వేషన్లు చెల్లవని జీవో నెంబర్‌ 3ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 50 శాతం మించి రిజర్వేషన్లు ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధంగా ఉందని భారత సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ కల్పిస్తున్నట్టు న్యాయస్థానం చెప్పింది. ఒక వేళ ఇదే రీతిలో భవిష్యత్తులో రిజర్వేషన్లు 50 శాతానికి మించి కల్పిస్తే, 1986 నుంచి ఇప్పటి వరకు చేసిన నియామకాలకు రక్షణ ఉండదని న్యాయస్థానం ధర్మాసనం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ఉపాధ్యాయుల పోస్టులు వందశాతం ఎస్టీలతో భర్తీ చేయడాన్ని లీలా ప్రసాద్‌రావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ ఇందిరా బెనర్జీ , జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ , జస్టిస్‌ ఎంఆర్‌ షా , జస్టిస్‌ అనిరుద్ధ బోర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 152 పేజీలతో షెడ్యూల్డ్‌ ఏరియాలో నియామకాలపై స్పష్టమైన తీర్పును వెలువరించింది. తొలిసారి 1986లో షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. 1989లో ఆంధ్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది.

దీనిపై ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా… 1990 లో దానిని కొట్టి వేస్తూ పిటిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే, ఇదే రీతిలో జనవరి 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరోసారి జీవోను విడుదల చేసింది. అయితే, పరిపాలన ట్రిబ్యునల్‌ ఈ జీవోను కొట్టివేయగా, ఏపీ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు తొలి నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వందశాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, 2000 సంవత్సరంలో షెడ్యూల్డు ఏరియాలో వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ… ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉమ్మడి హైకోర్టు సమర్థించడం తగదంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాది సీఎస్‌ఎన్‌ మోహన్‌ రావు వాదనలు వినిపించారు. సదరు జీవో రాజ్యాంగ విరుద్దమని, ఆర్టికల్‌ 371 డీ ఇది వ్యతిరేకమని వాదించారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఎస్పీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పన విషయంలో రాజ్యాంగం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచిందన, షెడ్యూల్డ్‌ ఏరియాలో అభివృద్ధి విషయంలో ప్రత్యేక అధికారాలను రాజ్యాంగం కల్పించిందని వివరించారు. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే ఇప్పటి వరకు చేసిన నియామకాలకు మాత్రం రక్షణ కల్పిస్తున్నట్టు పేర్కొంది. నాడు జరిగిన నియామకాల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, ఇరు రాష్ట్రాలకు రూ . 2 .5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates