సార్క్లో కరోనా ప్రభావం తక్కువే..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఇతర దేశాలతో పోలిస్తే అంతంత మాత్రమే..
– జనాభాకు తగిన పరీక్షలు లేకపోవడమేనా..?
– ఇదే ట్రెండ్‌ కొనసాగితే అధ్యయనాలు చేయాల్సిందే : నిపుణులు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం దక్షిణాసియా దేశాల (సార్క్‌)లో మాత్రం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇక్కడ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నదని అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. గణాంకాల ప్రకారం చూసినా ఈ వాదన సబబుగానే ఉన్నా.. ఈ ప్రాంతంలో ఉండే జనాభాకు తగినంతగా పరీక్షలు జరగడం లేదని మరికొంతమంది వాదిస్తున్నారు. పటిష్టమైన లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ వ్యాప్తిని ఈ ప్రాంతం సమర్థవంతంగా అరికడుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక, మాల్దీవులతో కూడుకున్న సార్క్‌లో.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 22,65,727 (ఆదివారం నాటికి) కరోనా కేసుల్లో 1.1 శాతం మాత్రమే నమోదయ్యాయి. మరణాల రేటు చూసుకున్నా 0.49 శాతంగానే ఉంది. పై ఎనిమిది దేశాల్లో భారత్‌లోనే ఎక్కువ కేసులు (17 వేలకు పైగా) నమోదవుతుండటం గమనార్హం. తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్‌ (8 వేలు), బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. విచిత్రంగా భారత్‌కు, చైనాకు సరిహద్దుగా ఉండే భూటాన్‌లో రెండంకెల కేసులు (ఆదివారం నాటికి 5 మాత్రమే) కూడా నమోదు కాలేదు.

తగినన్ని పరీక్షలు లేకనేనా..?
ప్రపంచ జనాభాలో 21 శాతం జనాభాతో సార్క్‌ ఐదో స్థానంలో ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నవారిలో 3శాతం మంది ప్రజలు ఈ ప్రాంతంలోనే జీవి స్తున్నా.. కరోనా ప్రభావం ఇక్కడ తక్కువగా ఉంది. అయితే దీనికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్‌ కారణమనీ చెబుతున్నా.. జనాభాకు తగినన్ని పరీక్షలు జరగడం లేదనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవమని పలువురు చెబుతున్నారు. గణాంకాలను బట్టి చూస్తే.. సుమారు 35 కోట్ల జనాభా ఉండే యూఎస్‌లో ప్రతి 10 లక్షల మందికి గానూ 10,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇటలీలలో 20,590 మందిని టెస్ట్‌ చేశారు. 130 కోట్ల మందికి పైగా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 247 మాత్రమే. పాకిస్థాన్‌లో 367 మందికి, బంగ్లాదేశ్‌లో 132 మందికి, శ్రీలంకలో 220 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సార్క్‌ మొత్తం జనాభా సుమారు 175 కోట్లు. పరీక్షల సంఖ్యను పెంచితే కేసులు పెరిగే అవకాశముందనీ, భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులను బట్టి చూస్తే అర్థమవుతున్నదనీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఉధృతి తక్కువే…
కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దేశాల్తో పోలిస్తే భారత్‌లో పరీక్షలు జరిపిన వారిలో పాజిటివ్‌ వచ్చినవారి సంఖ్య తక్కువేనని ఇటీవలే నిటిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌.. ఓ అధ్యయనాన్ని జోడిస్తూ ట్వీట్‌ చేశారు. యూఎస్‌లో పరీక్షలు చేసిన వారిలో 19.8 శాతం మందికి పాజిటివ్‌ అని తేలగా.. ఫ్రాన్స్‌లో ఇది 41.8 శాతంగా, ఇటలీలో 15.1 శాతంగా ఉంది. భారత్‌లో మాత్రం 4.7శాతం మందికి మాత్రమే పాజిటివ్‌ అని తేలుతుంది. ఇదే మన పొరుగుదేశాల్లో చూస్తే.. పాకిస్తాన్‌లో 9.54 శాతం, బంగ్లాదేశ్‌లో 10.06 శాతం, శ్రీలంకలో 5.12 శాతంగా నమోదవుతుంది. అలాగే కేసులు రెట్టింపు కూడా సార్క్‌ రీజియన్‌లో తక్కువగానే ఉంది. ఇటలీ, యూఎస్‌లలో తొలి కేసులు నమోదై.. అవి పది రోజుల సమయంలోనే 1300 రెట్లు పెరిగాయి. కానీ భారత్‌లో మాత్రం పెరుగుదల రేటూ తక్కువగానే ఉన్నదని ఇటీవలే కేంద్ర ఆరోగ్య, వైద్య మంత్రిత్వ శాఖ ఓ నివేదిక వెలువరించింది.

అధ్యయనాలు చేయాల్సిందే : పిఎస్‌ రాఘవన్‌, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు కన్వీనర్‌
మనదేశంలోనే గాక సార్క్‌ దేశాల్లోనూ వైరస్‌ ప్రభావం, అది సోకినతర్వాత మరణాల రేటు తక్కువగానే ఉంది. దీనికి ఆయా దేశాలు పాటిస్తున్న లాక్‌డౌన్‌.. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులా లేక మరేదైనా ఉందా అనేది పరిశోధన చేయాలి. మరికొన్ని రోజులూ ఇదే ట్రెండ్‌ కొనసాగితే మాత్రం ఇందుకు సంబంధించి సుదీర్ఘ అధ్యయనాలు జరపాల్సిన ఆవశ్యకతైతే ఉంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates