పులి వదిలేసినా విధి చిదిమేసింది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కొనఊపిరితో ఉన్న భార్యను అడవి నుంచి మోసుకొచ్చిన భర్త
  • ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఒక్క వాహనమూ లేక దక్కని ప్రాణం

 బల్లార్ష : అడవిలో పులి దాడిలో గాయపడిన భార్యను భర్త తన భుజాలపై ఎత్తుకుని రహదారి దాకా వచ్చినా.. ఆసుపత్రికి తరలించేందుకు వాహనాలేవీ రాక తుదిశ్వాస విడిచిన హృదయ విదారక సంఘటన ఇది. మహారాష్ట్రలోని భండార జిల్లా పౌని తాలూకా సావర్ల గ్రామానికి చెందిన మమత షెండే (38), ఆమె భర్త నరేశ్‌ షెండే గ్రామం పక్కనే ఉన్న అడవిలోకి ఇప్పపువ్వు సేకరించేందుకు వెళ్లారు. ఇప్పపువ్వు సేకరిస్తున్న సమయంలో మమతపై పెద్దపులి దాడి చేసింది. ఆమెను గొంతు వద్ద నోటకర్చుకుని కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. ఆమె కేకలు విని నరేశ్‌ కర్రతో అరుస్తూ పులిని వెంబడించాడు. కొద్ది దూరంలో మమతను వదిలేసి పులి అడవిలోకి పారిపోయింది. సాయం కోసం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో భార్యను నరేశ్‌ తన భుజాలపై వేసుకొని అర కిలోమీటరుకు పైగా కాలినడకన పౌని వెళ్లే ప్రధాన రహదారిపైకి తీసుకువచ్చాడు. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏదైనా వాహనం వస్తుందేమోనని ఆశగా చూశాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒక్క వాహనమూ రాలేదు. మమత అక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న భండార అటవీశాఖ అధికారి వివేక్‌ హోసింగ్‌ ఘటనాస్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని పౌని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సాయంగా అంత్యక్రియల కోసం రూ.25 వేలు అందించారు. మమత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates