మహిళలు, శిశువులను విస్మరిస్తే…!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మరో ఆరోగ్య సంక్షోభానికి దారి తీయొచ్చు
– హెచ్చరిస్తున్న నిపుణులు
– గర్భిణీ స్త్రీలను కాపాడుకోవాలని సూచన

రాంచీ : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆ కేసులను తప్ప మిగితావారి వైద్యం గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. గర్భిణీ మహిళలను, శిశువులను, చిన్నారులను విస్మరిస్తే, వారికి సరైన సమయంలో వైద్యం అందించకుంటే అది మరో ఆరోగ్య సంక్షోభానికి దారి తీసే ప్రమాదమున్నదని వారు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలను విస్మరిస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా రవాణా సదుపాయాలు బంద్‌ అవడంతో మారుమూల గ్రామాల ప్రాంతాల్లో ఉండే గర్భిణీ స్త్రీలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులు కూడా ఈ తరహా కేసులను అడ్మిట్‌ చేసుకోవడం లేదు. ఇటీవలే జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఓ నిండు గర్భిణీని ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకురాగా.. మూడు ప్రయివేటు ఆస్పత్రులు ఆమెను చేర్పించుకోలేదు. ఈ ప్రయాణంలో తీవ్ర రక్తస్రావం అయి ఆమె కడుపులో బిడ్డ కన్నుమూసింది. చివరికి రిమ్స్‌లో చేర్పించడంతో ఆమె ప్రాణాలు దక్కాయని రాంచీకి చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త తెలిపింది. ఇదే తరహా ఘటన రెండ్రోజుల క్రితం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా రామన్నగూడెంలోనూ చోటుచేసుకుంది. అర్ధరాత్రి పూట పురిటినొప్పులు రావడంతో గర్భిణిని దగ్గర్లోకి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆమె భర్త అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా అది రాలేదు. పోలీసులను వేడుకున్నా వాళ్లూ వాహనం డ్రైవర్‌ లేడని చెప్పారు. దీంతో బైక్‌ మీదే ఆమెను ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు అడ్మిట్‌ చేసుకోకపోవడంతో ఆ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది.

ఇదే విషయమై రాంచీకి చెందిన వైద్య నిపుణురాలు సరోజిని స్పందిస్తూ… మహిళలు, శిశువులను విస్మరిస్తే ఆరోగ్య సంక్షోభానికి దారి తీసే ప్రమాదముందని అన్నారు. గర్భిణీ స్త్రీలకు, అప్పుడే పుట్టిన శిశువులకు సరైన సమయంలో చికిత్స అందకుంటే అది వారి ప్రాణాలకే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేండ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనీ, కానీ లాక్‌డౌన్‌ కారణంగా అంగన్‌వాడీలు మూసేయడంతో వారిలో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదముందని హెచ్చరించారు. గర్భస్థ మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని సూచించారు. ఐసీడీఎస్‌ ద్వారా అవసరమైన వారికి పోషకాహారం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates