చావైనా, బతుకైనా సొంతూర్లనే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబసభ్యులపైన బెంగతో వందల కిలోమీటర్లు కాలినడకనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పెద్దసంఖ్యలో ఊర్లకు బైలెళ్లుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోనూ ఈ సమస్య కనిపిస్తున్నది. ప్రధానంగా ఆహార, జీవనశైలి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో వారు గ్రామాలకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు.

ఖమ్మం: అనుకోని విపత్తు కరోనా రూపంలో విరుచుకుపడిన వెంటనే ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఎక్కడి వారక్కడే ఇంటికే పరిమితం కావాలని అదేశించింది. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో వలస కూలీలకు రేషన్‌కార్డులతో నిమిత్తంలేకుండా బియ్యం, నగదు ఇచ్చారు. పక్షం రోజులకుపైగా వారు ప్రభుత్వ సంరక్షణలో సంతృప్తిగా ఉన్నారు. మొదట్లో అక్కడక్కడా కొందరు కాలినడకన తమ గ్రామాలకు వెళుతూ కనిపించినా అధికారులు వారికి నచ్చజెప్పి సంరక్షణ కేంద్రాలకు తరలించడంతో సమస్య సద్దుమణిగింది. అయితే ఇటీవల లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత వలస జీవుల్లో ఆందోళన రేకెత్తింది. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తిరిగి రోడ్లమీదికి రావడం కనిపిస్తున్నది.

జూలూరుపాడు కూలీల కథ
వలస కూలీల సమస్య తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కూలీల గుడారాలను సందర్శించి వారితో మాట్లాడింది. ఈ మండలంలో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో మిర్చి ఏరడానికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి 8,400 మంది కూలీలు వచ్చినట్టు అంచనా. ఏటా జనవరిలో వచ్చే కూలీలు నెలారెండు నెలలు మిర్చి ఏరి తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈసారి లాక్‌డౌన్‌ అడ్డుపడటంతో తమ గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మొదట్లో 15 రోజులే అనడంతో ప్రభుత్వ శిబిరాల్లో ఉండి నిరీక్షించారు. కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించడంతోవారు ఆందోళనకు గురయ్యారు. ఇలా ఎంతకాలం? అనే ప్రశ్న ఎదురై.. సహనం కోల్పోతున్నారు.

వేధిస్తున్న ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యలు
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వలసకూలీలతో మాట్లాడినప్పు డు ప్రధానంగా వారి ఆహారపు అలవాటు పెద్ద సమస్యగా కనిపించింది. వారి ఆహారంలో జొన్న రొట్టె ముఖ్యమైనది. అధికారులు వీరికి బియ్యం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్లో జొన్నపిండి దొరకట్లేదు. వెంటతెచ్చుకున్న పిండీ అయిపోయింది. ప్రభుత్వం అందజేసిన బియ్యం తినలేక.. ఇప్పటికే వాటిని స్థానికులకు విక్రయించారు. వారి దగ్గర ఉన్న పదార్థాలు అయిపోవడంతో ఆహార సమస్య ఎదురవుతున్నది. దీనికితోడు కొద్దిమంది కూలీలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు దగ్గర లేకపోవడంతో మందులు కొనడం సమస్యగా మారింది.

ఉమ్మడి ఖమ్మంలో 50 వేల మంది..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల సుమారు 50 వేల మంది వలస కూలీలు ఉన్నారు. వీరు వ్యవసాయ పనులతోపాటు ఇటుక బట్టీలు, గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా అనేకమంది చనిపోతున్నారన్న వార్తలు టీవీల్లో చూసి.. ఊళ్లలో తమ కుటుంబసభ్యుల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వీరు పనిచేసే గ్రామాలు, పట్టణాల్లో అన్నిరకాల దుకాణాలు మూసిఉండటం, జనజీవనం పూర్తిగా స్తంభించడం వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నది. అందుకే ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలను సమకూర్చినా ఉండటానికి ఇష్టపడటం లేదు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారికి సరిగ్గా ఇదే సమయంలో ఇప్పపువ్వు ఏరే పనులు మొదలవుతాయి. ఏడాదికి సరిపడా సంపాదించుకునే సమయమిది. ఇక్కడే ఉండిపోతే ఆ ఆదాయం పోతుందని వాపోతున్నారు. కొందరు మహిళలు నెల రోజులేనని వచ్చి ఇక్కడే ఉండిపోవడంతో ఇంటివద్ద పిల్లల పరిస్థితిపై దిగులుగా ఉన్నారు. ఇలాంటి కారణాలతో దొరికిన మార్గాల ద్వారా వందల కిలోమీటర్లు నడిచి వెళ్లడానికైనా సిద్ధపడుతున్నారు.

మా ఊరికి పోతా..
15 రోజుల పని కోసం ఇక్కడికి వచ్చాను. మా ఆయన చనిపోయిండు. ఇంటి వద్ద ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా దగ్గర పని లేక కొన్ని రోజులు ఇక్కడికి వచ్చాను. పని ముగిశాక వెళ్దామనుకుంటుండగా ఇంతలో అదేదో జబ్బు వచ్చిందంట. ఎవరిని ఎక్కడికి కదలనివ్వడం లేదు. నా పిల్లలు ఎలా ఉన్నారో ఏమో.. నన్ను ఎలాగైనా మా ఊరుకు పంపండి. మీ కాళ్లు మొక్కుతా.
– నభిత, సక్నూరు, నాందేడ్‌ జిల్లా, మహారాష్ట్ర

చస్తమో.. బతుకుతమో తెల్వదు
మందులేని జబ్బు వచ్చిందంట. మేము చస్తమో, బతుకుతమో కూడా తెలియట్లేదు. మా ఊరు పోతే మా వాళ్లు ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం రూ.500 ఇచ్చింది. బియ్యం కూడా ఇచ్చింది. కానీ వాటిని మేము తినం. మాకు రొట్టెలు తినడమే అలవాటు. ఆ పిండి ఇక్కడ దొరకడం లేదు.
– రామ్‌రావు సక్నూరు, నాందేడ్‌, మహారాష్ట్ర

ఇప్ప పువ్వు సేకరించాలి
మాకు వానాకాలంలో మాత్ర మే పని ఉంటుంది. ఆ తరువాత ఇక్కడికి మిర్చి ఏరడానికి వస్తాం. మళ్లీ మార్చి, ఏప్రిల్‌ నెలలో మా ఊరు వెళ్లిపోయి ఇప్ప పువ్వు సేకరిస్తాం. వాన పడగానే పొలం పనులు మొదలయితాయి. మా ఊరికి మమ్మల్ని పంపించండి. ఇక్కడ బియ్యం, డబ్బులు ఇచ్చారు.
– మున్నీబోర్కే, గెల్గూరు, బీజాపూర్‌ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌

ఖాళీగా ఉండలేం..
మాకు వానలు పడే కాలం వచ్చింది. వ్యవసాయ పనులు చేసుకోవాలి. మమ్మల్ని ఇక్కడే ఉండమంటే ఎలా ఉంటాము. మా ఊర్లో ఏ కరోనా లేదంట. మేము వెళ్లిపోతాం. మాకు ఇక్కడ ప్రభుత్వం బియ్యం, డబ్బులు ఇచ్చిం ది. అయినప్పటికీ ఎన్ని రోజులిస్తారు. మేము పనులు చేసుకుంటేనే బ్రతికేది.
– సునీత కారం గెల్గూరు, బీజాపూర్‌, ఛత్తీస్‌గఢ్‌

Courtesy Namasthe Telangana

RELATED ARTICLES

Latest Updates