పెన్షన్ల కోత కరెక్ట్‌ కాదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తెలంగాణ హైకోర్టు 

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రిటైర్డు ప్రభుత్వోద్యోగులకు చెల్లించే పెన్షన్లలో 50శాతం కోత విధించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు చెల్లించే పెన్షన్లలో కోత విధించడాన్ని తప్పుబట్టింది. కన్నోళ్లే ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్న ప్రస్తుత సమాజంలో… వారికి చెల్లించే పెన్షన్లలో కోత విధించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. గిరిజన సంక్షేమ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేసి రిటైరైన నాగలి నారాయణ, ఖమ్మం జిల్లాకు చెందిన గోగినేని లక్ష్మి, రిటైరైన మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సీజే రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు న్యాయవాదులు వాదించారు. ‘సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమ వేతనాల్లో 50 నుంచి 60 శాతం కరోనాపై పోరాట నిధికి ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ…పెన్షన్లపైనే ఆధారపడ్డ రిటైర్డ్‌ ఉద్యోగులపై కనీస దయ చూపకుండా 50 శాతం కోత ఎలా విధిస్తారు’ అని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెన్షనర్లను వారి కుటుంబ సభ్యులే చేరదీసే పరిస్థితి లేదని పేర్కొంది. వృద్ధాప్యంలో వారికి అనుకోని అంటు రోగం సోకితే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. 4వ తరగతి ఉద్యోగుల జీతాల్లో కేవలం 10శాతం కోత విధించిన ప్రభుత్వం పెన్షనర్లను ఎందుకు విడిచిపెట్టలేదని నిలదీసింది. జీవిత చరమాంకంలో ఉన్న పెన్షనర్ల పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ సమాధానమిచ్చారు. పెన్షన్లలో కోత తాత్కాలికమేనని కోర్టుకు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రిటైర్డు ఉద్యోగులు అనారోగ్య సమస్యలకు ఖర్చుచేసిన మొత్తాలను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ కోరారు. అయితే రిటైర్డ్‌ ఉద్యోగుల మెడికల్‌ బిల్లులు ప్రభుత్వం తిరిగి చెల్లింపులు చేస్తున్నా.. ముందుగా ఖర్చుచేసేందుకు వారికి డబ్బులు అవసరమవుతాయి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది.

RELATED ARTICLES

Latest Updates