అమానుష నిర్ణయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కాలంలో, ప్రపంచ ఆరోగ్యసంస్థకు నిధులివ్వడం ఆపేస్తున్నట్టుగా ట్రంప్‌ చేసిన ప్రకటన అనేకులకు ఆగ్రహం తెప్పించింది. ట్రంప్‌ ఊసెత్తకుండా ఈ సంస్థ కూడా, సంక్షోభకాలంలో తాను చేస్తున్న పోరాటానికి ఈ నిర్ణయం అతిపెద్ద అవరోధం అవుతుందని హెచ్చరించింది. యూరోపియన్‌ యూనియన్‌, రష్యా సహా చాలా దేశాలు ట్రంప్‌ వీరంగాన్ని ప్రశ్నించాయి. ఆదినుంచీ ఈ మహమ్మారి విషయంలో ట్రంప్‌ ఎంత తెలివితక్కువగా వ్యవహరించారో గుర్తుచేస్తూ, అమెరికాలో వేలాది చావులకు బాధ్యత వహించాల్సిన ట్రంప్‌ తన తప్పులకు ఆరోగ్యసంస్థను బలిచేస్తున్నారని అక్కడి మీడియా మండిపడుతున్నది. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి తనకు అదనంగా 675 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ అవసరమని ఇటీవలే లెక్కలు కట్టిన ఆరోగ్యసంస్థకు ట్రంప్‌ నిర్ణయం పెద్దదెబ్బే. భారత్‌ సహా చాలా దేశాలకు అది అందించబోయే సహాయం మీదా, సమన్వయం మీదా ఇది విశేష ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఆరోగ్య సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులు అమెరికా ఇప్పటికే చేసిందనీ, ట్రంప్‌ ప్రకటనను కేవలం అగ్రదేశాల మధ్య సాగుతున్న కరోనా రాజకీయంగానే చూడాలని కొందరి వాదన. కరోనాను ట్రంప్‌ మొదట్లో తేలిగ్గానే తీసుకున్నారు. అది కేవలం చైనా సమస్యేనని అనుకున్నందున, చకచకా ఆస్పత్రులు కడుతున్నప్పుడూ, నగరాలను దిగ్బంధిస్తున్నప్పుడూ ప్రశంసలు గుప్పించారు. కరోనా నియంత్రణకు బాగా కష్టపడుతోందనీ, ఫలితాలు సాధిస్తోందనీ మెచ్చుకున్నారు. చైనా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడి సహాయం చేయడానికి నేనున్నానంటూ అభయం కూడా ఇచ్చారు. అమెరికాలో ఒకటి రెండు కేసులు బయటపడినప్పుడు కూడా పెద్దగా పట్టలేదు. వేడి పెరుగుతున్న కొద్దీ ట్రంప్‌లో మార్పు మొదలైంది. యూరోపియన్‌ యూనియన్‌ చైనీయుల రాకపోకలకు అడ్డుకట్టవేయకపోవడం తమకు అంటుకుందని తాడెత్తున లేచారు. రెండునెలల పాటు నిపుణుల సలహాలు, హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ట్రంప్‌ చివరకు పరిస్థితి శృతిమించడంతో మార్చి 13న జాతీయ ఎమర్జెన్సీ విధించారు. ఆయన లాక్‌డౌన్‌ వ్యతిరేకి. ఆర్థికం దెబ్బతింటున్నదన్న వాదనతో ఆంక్షలు ఎప్పుడు ఎత్తేయాలా అని ఎదురు చూస్తున్న వ్యక్తి. ఎవరెన్ని చెప్పినా వినకుండా, మొత్తానికి ఆరున్నరలక్షల కేసులు, ముప్పైవేలకు మించిన మరణాలు సంభవించిన తరువాత చైనాను, ప్రపంచ ఆరోగ్యసంస్థను తప్పుబట్టడానికి సిద్ధపడ్డాడు.

కరోనా విషయంలో చైనాకు వంతపడుతూ, అది చెప్పినదానిని నమ్ముతూ, ఇచ్చిన సమాచారాన్ని పుచ్చుకుంటూ, చాలా కీలకవిషయాలపై దానిని ఆరోగ్య సంస్థ నిలదీయలేదని ట్రంప్‌ విమర్శిస్తున్నారు. అది చైనా తరఫున వ్యవహరించిందన్న వాదనకు సమర్థనగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? అని ఆరోగ్యసంస్థను నిలదీస్తున్నారు. ఆరోగ్య సంస్థ వరుస హెచ్చరికలను గుర్తుచేస్తూ చాలా ప్రశ్నలకు అమెరికా పత్రికలే నిజానికి సమాధానం చెప్పేశాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ను ఆరోగ్యసంస్థ అధ్యక్షుడిగా చేయడంలో 2017లో చైనా భారత్‌ సహయంతో చక్రం తిప్పింది. ఈ కారణంగానే చైనాతో టెడ్రోస్‌ కఠినంగా వ్యవహరించలేకపోయారని ట్రంప్‌ నమ్మకం. కరోనా విషయంలో ఆదినుంచీ చైనా దాపరికాన్ని ప్రదర్శించిన మాట వాస్తవం. సమాచారాన్ని పంచుకోవడంలోనూ, చివరకు మృతుల లెక్కల్లోనూ అది పారదర్శకంగా వ్యవహరించలేదు. దానిని బుజ్జగిస్తూ గుట్టువిప్పేట్టు చూడటంలో భాగంగా టెడ్రోస్‌ సాగిలబడినట్టు కనిపించివుండవచ్చు. చైనా మాటల్ని పూర్తిగా నమ్మి ఆయన కొన్ని అర్థంలేని వ్యాఖ్యలు చేసిన మాటా నిజమే. చైనాతో రాకపోకల్ని భారత్‌ సహా కొన్ని దేశాలు నిషేధించిన వెంటనే టెడ్రోస్‌ తప్పుబట్టారు. కరోనాపై చక్కగా పోరాడుతున్న వియత్నాంను కూడా చైనా మెప్పుకోలు కోసమే విమర్శించారు.

కరోనా కష్టకాలంలో ఆరోగ్యసంస్థ తన బాధ్యతను సవ్యంగా నిర్వర్తించిందా లేదా అన్నది అటుంచితే, ఈ సందర్భంగా దాని పనితనంలో రావాల్సిన మార్పుపై విస్తృత చర్చ జరుగుతున్నందుకు సంతోషించాల్సిందే. ప్రపంచాన్ని పీడించిన అనేక వ్యాధుల నివారణలో అది ముఖ్యభూమిక పోషించినప్పటికీ, దాని నత్తనడకవల్ల లక్ష్యాల సాధన అనుకున్నకంటే ఎక్కువ కాలం పట్టినమాట నిజం. సమాచార వ్యాప్తి వేగంగా ఉన్న ఈ కాలంలో దాని పనివేగం హెచ్చాలి. బడ్జెట్‌లో అధికమొత్తాన్ని అది పర్యటనలకు, చర్చలకు, ఉపన్యాసాలకే ఖర్చుపెడుతున్నదని కూడా విమర్శలున్నాయి. నిధులిచ్చేది లేదని అమెరికా ప్రకటించగానే, ఇంతకాలమూ ప్రపంచ ఆరోగ్యసంస్థకు రోటరీ ఇంటర్నేషనల్‌ కంటే తక్కువ నిధులు విదల్చుతున్న చైనా ఇప్పుడు ఏకంగా రెండుకోట్ల డాలర్లు ప్రకటించింది. ప్రపంచదేశాలన్నీ ఐకమత్యంతో విపత్తును ఎదుర్కోవాల్సిన తరుణంలో ప్రపంచ ఆరోగ్యసంస్థను రాజకీయవేదికగా మార్చే ప్రయత్నాలు మంచివి కావు.

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates