దేవుడికైనా భయపడరా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా నివారణకు భారత్‌కు తెలిసిన ఏకైక మందు లాక్‌డౌన్‌. అన్ని దేశాలకు దీన్ని మనం టన్నులకొద్దీ ఎగుమతి చేయలేం. లాక్‌డౌన్‌ చాలా నిక్కచ్చి కచ్చతో అమలు చేస్తామని పోలీసులు మాటల ద్వారా, తన్నుల ద్వారా చెబుతూనే ఉన్నారు. మోదీనుంచి మొదలైన అందరూ ప్రజలను ప్రబోధిస్తున్నారు. స్టే సేఫ్‌ అని నినదిస్తూ పాటలు కడుతూ, కవితలు, కథలు రాస్తూ, కార్టూన్‌ గీస్తూ సోషల్‌ మీడియాలో విజృంభిస్తున్నారు. మరి ఈ లాక్‌డౌన్‌ నిబంధనలు మత సమావేశాలు చేసి చాలామందికి రోగం అంటించిన తబ్లిగీకి, శ్రీరామనవమికి అందరూ అయోధ్య రండి అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రికి వర్తించవా? ‘‘తబ్లిగీ జమాత్‌ సంఘటన జరిగిన రోజునే యోగి ఆదిత్యనాథ్‌ ఒక ప్రకటన చేశారు.

అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పెద్ద ఉత్సవాన్ని నిర్వహించాలని యోగి పిలుపు ఇచ్చారు. ఆచార్య పరమ్‌ హంస్‌ అయితే రామ భక్తులకు కరోనా వైరస్‌ రాకుండా శ్రీ రామచంద్రుడు కాపాడతాడు కనుక చాలామంది రావాలని ప్రకటిం చారు. కర్ఫ్యూ వంటి జాతీయ దిగ్బంధనాన్ని మోదీ మార్చి 24న ప్రకటించిన మరునాడే అధికారిక మార్గదర్శకాలను ఉల్లం ఘిస్తూ అయోధ్యలో డజస్లకొద్దీ అనుయాయులతో సహా మతపరమైన సమావేశాల్లో హాజరైనారు’’ అని ద వైర్‌ రాసింది. ఈ మాటల పైన మరొక ట్వీట్‌లో కూడా ద వైర్‌ ఎడిటర్‌ రాసిన మాటలపైన రెండు కేసులు పెట్టారు.

అది ఏ ట్వీటో పేర్కొనలేదు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు చేశారని ఆ సంపాదకుడిపైన రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడమే కాకుండా ఆయన స్వయంగా హాజరు కావాలని ఫైజాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 41ఎ కింద నోటీసు ఇచ్చారు. నిజానికి ఏది అభ్యంతరకరమో ఎందుకో వారు చెప్పలేదు. ఒకవేళ అభ్యంతరకరంగా ఉన్నా అది నేరమని ఎక్కడా నిర్వచించలేదు. నిర్వచించని నేరం కింద నేరం కేసు పెట్టడానికి వీల్లేదు. నిజానికి ఆవిధంగా కేసు పెట్టడమే నేరం.

ఈ నోటీసును ఇవ్వడానికి వరదరాజన్‌ ఇంటికి పోలీసులు వచ్చి ఏం చేశారో వరదరాజన్‌ భార్య ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నందినీ సుందర్‌ అనేక ట్వీట్‌ల ద్వారా వివరించారు. ఏప్రిల్‌ 10 మధ్యాహ్నం రెండు గంటలకు కొందరు అయోధ్య ప్రశాసన్‌ నుంచి వచ్చామని నోటీసు తీసుకోవాలని కోరారు. ఆమె ఇంటి గేటుకున్న మెయిల్‌ బాక్స్‌లో వేయండి అంటే వినకుండా వెళ్లిపోయారు, మళ్లీ 3.20 నిమిషాలకు నెంబర్‌ ప్లేట్‌ లేని నల్ల ఎస్‌యూవీలో ఏడెనిమిది మంది పోలీసు దుస్తుల్లో అయోధ్యనుంచి నేరుగా వాహనంలో వచ్చామన్నారు. సరే అని నోటీసు ఇవ్వండి సంతకం చేస్తానంటే ‘మేము ఆడవారికి, మైనర్లకు నోటీసు ఇవ్వం’ అన్నారు. ఏ రూల్‌ ప్రకారమో చెప్పండి అంటే ఎవరికో ఫోన్‌ చేసి, తలూపి, తరువాత నందినీ సుందర్‌ సంతకం తీసుకున్నారు. సిద్ధార్థ వరదరాజన్‌ ఏప్రిల్‌ 14న అయోధ్య పోలీసుస్టేషన్‌కు రావాలని సారాంశం.

ప్రభుత్వానికి భిన్నమైన దృక్పథాన్ని చూపుతూ విధానాల్లో లోపాలను ఎండకడుతూ ఉండడమే వైర్‌ వారు చేసిన నేరమా? లాక్‌డౌన్‌ ఉన్నందు వల్ల ఉత్సవాలు చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని వైర్‌ చేసిన వ్యాఖ్యానం తప్పయితే, లాక్‌డౌన్‌ ఉండగా అయోధ్యదాకా ప్రయాణం చేయడం పోలీసుస్టేషన్‌ రావడం నిబంధనలను ఉల్లంఘించడమే కదా. అసలు విషయం ఏమిటి? కరోనా వైరస్‌ నివారించడానికి లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదన్నదే మన విధానం. చాలామందికి కరోనా వైరస్‌ని అంటించడం నేరమని, తబ్లిగీ వారు ఆ నేరం చేశారని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. శ్రీరామనవమి పేరుమీద లాక్‌ డౌన్‌ రోజుల్లో అంతా తరలి రావాలన్నారని వైర్‌లో రాశారు. అందులో వద్దనీ అనలేదు. తిట్టలేదు. విమర్శించలేదు. వ్యతిరేకించనూ లేదు. శ్రీరామనవమి జరుపుకోవద్దనీ కోరలేదు. యోగి గారినీ వారి ప్రభుత్వాన్నీ కూడా ఏమీ అనలేదు. అది పరువు నష్టమా, రాజద్రోహమా లేక జాతీయ భద్రతకు భంగకరమా? లాక్‌ డౌన్‌ ఉల్లంఘించి అయోధ్యదాకా వెళ్లి పోలీసుస్టేషన్‌లో అధికారులకు ఆయన ఏం చెప్పాలి? ఏ నేరమో అర్థం కాకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, ఎందుకు రమ్మంటున్నారో చెప్పకుండా రమ్మనడం భయపెట్టడానికి తప్ప మరొకటి కాబోదు.

ఒక్కనోటీసు ఇవ్వడానికి బోలెడంత మంది పోలీసులు నెంబర్‌ లేని పెద్దవాహనంలో రావడం అవసరమా? పోలీసులే కాని ఎవరో చెప్పరు. పోలీసు దుస్తులే కాని ఆతని పేరు తెలిపే పట్టిక ఉండదు. ఉండాలని సుప్రీం కోర్టు తీర్పుల్లో చెప్పారు. చట్టం కూడా చెబుతున్నది. అయినా పోలీసులే పాటించకపోతే, ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకపోతే జర్నలిస్టులు ఏం చేయాలి? మామూలు ప్రజలు ఏం చేయాలి? ది వైర్‌ పత్రిక మాటల్లో నేరం ఏం ఉందో చెప్పకుండా.. పోలీసులు వచ్చి భయపెట్టడం, వాహనానికి నెంబరు పెట్టుకోవడానికి పోలీసులే భయపడడం ఇవన్నీ ఎందుకు? విమర్శించడమే రాజద్రోహమా, వీళ్లేమయినా నిజంగా రాజులా? ఇది రాజరికమా? ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానులు, ఎమ్మెల్యేలు ఎంపీలు సంవిధానం ప్రకారం వ్యవహరిస్తామని కొందరు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తారు. బీజేపీ నుంచి ఎన్నికైన వారయితే అందరూ దేవుడి మీదే ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం వారికి గుర్తుందా? ప్రమాణం ఉల్లంఘిస్తే సంవిధానం శిక్షిస్తుందో లేదో దేవుడెరుగు, దేవుడిమీద పెట్టిన ఒట్టు కూడా పనిచేయదని నమ్మకమా? కరోనాకు రాజ్యాంగానికి, లాక్‌డౌన్‌కో దేవునికో లేక దేనికైనా వీరసలు భయపడతారా?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates