31 వేల కోట్లున్నా ఆకలి కేకలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • నిర్మాణరంగ వలస కార్మికులను ఆదుకోని ఫండ్‌
  • వారి రక్షణకు డబ్బులున్నాయి.. చట్టాలున్నాయి!
  • అమలుకు ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వాలు
  • 31 వేల కోట్లలో కేవలం రూ.3066 కోట్ల ఖర్చు
  • కేంద్ర కార్మిక శాఖకు వెల్లువెత్తిన ఫిర్యాదులు
  • తెలంగాణలో 1800 కోట్లు
  • వాటితో ఆదుకోవాలని సీఎంకు తెలంగాణ
  • భవన నిర్మాణ వర్కర్స్‌ యూనియన్‌ లేఖ

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో చేయడానికి పనుల్లేక, చేతుల్లో డబ్బుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితుల్లో  ఆకలి చావుల భయంతో కోట్ల మంది వలస కార్మికులు మండుటెండల్లో పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడిచి సొంత గ్రామాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న కష్టాల గాథలను మీడియా, సోషల్‌ మీడియాల్లో కోకొల్లలుగా చూస్తున్నాం. దేశ విభజన తర్వాత ఇదే అతి పెద్ద మానవ వలస సంక్షోభమని చెబుతున్నారు. కొన్నిచోట్ల దారి పొడవునా దయగల పౌరులు ఆహారం ఇచ్చి వలస కూలీలను ఆదుకుంటున్నారు. ఈ వలస సంక్షోభం అనివార్యమా? లాక్‌ డౌన్‌ ముగిసే వరకు ఉన్న రాష్ట్రంలోనే వారికి తిండి, ఇతర అవసరాలు తీర్చలేమా? అంటే, సాధ్యమేనని కేంద్ర ప్రభుత్వం అంటోంది. నిజానికి వీరు ఎవరి దయతోనో కడుపు నింపుకోవాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ‘‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి’’ దాదాపు 52 వేల కోట్ల రూపాయలు మూలుగుతోంది. ఇలాంటి కార్మికుల సంక్షేమం కోసమే నిర్మాణ సంస్థల ముక్కు పిండి ఈ సొమ్ము వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా వాటిని ఖర్చు పెట్టవు.

లాక్‌డౌన్‌తో సొంత రాష్ట్రానికి బయల్దేరిన కార్మికులను పనిచేసే రాష్ట్రంలోనే నిలువరించి, ఉన్న చోటే వారికి తిండి, బస ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్చి 24నే ఆదేశించింది. ఇందుకోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలోంచి రూ.31 వేల కోట్లు వినియోగించుకోవాలని రాష్ట్రాలకు చెప్పింది. అయితే, గత ఇరవై రోజులుగా చాలా రాష్ట్రాలు ఈ నిధితో వలస కార్మికులను ఆదుకొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ కారణంగానే లాక్‌డౌన్‌ పొడిగించగానే రాష్ట్రాల మధ్య   రెండో దశ వలసలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి. గత నెల కేంద్రం ఇచ్చిన అడ్వయిజరీని పాటించకపోగా, కనీసం భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం-1996, అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979 ప్రకారమైనా చర్యలు తీసుకోలేదని కార్మిక సంఘాల వారు ఫిర్యాదు చేశారు.

భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి వసూలు చేసిన సెస్‌ వివరాలను వెబ్‌సైట్‌లో కూడా వెల్లడించలేదని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. స్థానిక సంక్షేమ బోర్డుల్లో ఉన్న సెస్‌ను కార్మికుల ఖాతాలకు బదిలీ చేయాలని కేంద్ర కార్మిక మంత్రి సంతోశ్‌ గంగ్వార్‌ రాష్ట్రాలను ఆదేశించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 5.1 కోట్ల మంది, కార్మిక సంఘాల లెక్కల ప్రకారం 6 కోట్ల మంది కార్మికులు నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. వారిలో 3.5 కోట్ల మంది మాత్రమే సంక్షేమ నిధి కింద నమోదయ్యారు. నమోదైన వారికే డబ్బులు సరిగా అందడం లేదు. నమోదు కాని 2.5 కోట్ల మంది దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌ నాటికి దేశంలో 18 వేల ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. 85 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఎంతమంది నమోదయ్యారన్న గణాంకాలు పక్కాగా లేవు.

తమిళనాడులో 1.34 లక్షల మంది అని ప్రభుత్వం చెబుతుంటే, 30 లక్షల మంది అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు వసూలు చేసిన రూ.52 వేల కోట్లలలో రూ.31 వేల కోట్లను కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీతో పాటు పంచిపెట్టాలని కేంద్రం ఆదేశించింది. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 10 వరకు కేవలం రూ.3066 కోట్లు చెల్లించారు. అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979 ప్రకారం ప్రతి కార్మికుడినీ పనిచేసే చోట నమోదు చేసుకుని, వారి సొంత రాష్ట్రం వివరాలను రికా ర్డు చేయాలి. అయిదుగురి కంటే ఎక్కువ మంది అంతర్‌ రాష్ట్ర కార్మికులను నియమించిన యజమానులు వారి వసతి, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ బాధ్యత స్వీ కరించాలి. లాక్‌డౌన్‌ విధించినపుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని గ ట్టిగా అమలు చేసి ఉంటే, ఏ వలస కార్మికుడూ ఎక్కడి కీ వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.

తెలంగాణలో రూ.1800 కోట్లు

  • వాటితో ఆదుకోవాలని సీఎంకు లేఖ

హైదరాబాద్‌ : తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు వద్ద రూ.1800 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఉజ్జిని రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. నెల రోజులుగా పనుల్లేక కార్మికులు అల్లాడుతున్నారని సీఎం దృష్టికి తీసుకొస్తూ లేఖ రాశారు. ఈ మొత్తంతో లాక్‌డౌన్‌ ముగిసే వరకు కార్మికులను ఆదుకోవాలని కోరారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates