సామాజిక భద్రతను ఉపేక్షిస్తే ఎలా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రజా పంపిణీ వ్యవస్థను తక్షణమే సార్వజనీకరణం చేయడం ద్వారా ఆహార సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం పూనుకోవాలి. ఆహారానికి అలమటిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి బడి పిల్లల మధ్యాహ్న భోజన పథక సదుపాయాలను ఉపయోగించుకోవాలి. వలసకూలీలకు ఆహారం, నగదు సమకూర్చి వారి మనుగడకు తోడ్పడాలి. వ్యవసాయక ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకోవాలి. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. ఈ సంక్షేమ చర్యలను ఏమాత్రం ఉపేక్షించినా కరోనా వైరస్ కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ అతి పెద్ద మానవ కల్పిత విపత్తుగా చరిత్రలో మిగిలిపోతుంది.

ప్రాణాలు కాపాడుకోవడమా లేక జీవనాధారాలను రక్షించుకోవడమా? మొదటి దేశవ్యాప్త లాక్‌డౌన్ లేదా లాక్‌డౌన్ -1 సందర్భంగా ఈ ప్రశ్నను విపులంగా చర్చించాము. సమాధానం స్పష్టమే. జీవితమే ముఖ్యం; ఆ తరువాతే వృత్తి ఉద్యోగాలు. యావద్దేశమూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుక సమైక్యంగా నిలబడింది. మార్చి 25 నుంచి అమలులోకి వచ్చిన 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన పిదప లేదా లాక్‌డౌన్ -2 ప్రకటించిన అనంతరం ప్రశ్న మారింది. ఏప్రిల్ 20 తరువాత కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిస్తూ లాక్‌డౌన్ -2 కాలంలో విధిగా అనుసరించేందుకు మార్గదర్శకాలను మోదీ ప్రభుత్వం జారీ చేసింది. ఆ సడలింపులు కొంత ఉపశమనం కలిగించేవనడంలో సందేహం లేదు. అయితే లాక్‌డౌన్ మూలంగా ఉపాధిని కోల్పోవడంతో పాటు ఆహారం సైతం కొరవడి అల్లాడిపోతున్న బాధితులకు సామాజిక భద్రతను విస్తరింపచేసే సూచనలూ కన్పించడం లేదు, హామీలూ విన్పించడం లేదు. మరి మన చర్చలు, వాదనలు లాక్‌డౌన్ కొనసాగింపునకు వ్యతిరేకంగా కాకుండా మరెలా వుంటాయి?

లాక్ డౌన్ -1 జనహిత ఆలోచన కాదు అని నేను చెప్పలేదు, చెప్పడం లేదు, చెప్పబోను. మూడు వారాల క్రితం నెలకొనివున్న దుస్తర పరిస్థితులు, వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాల దృష్ట్యా దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలుపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేమని నేను స్పష్టం చేశాను. అయితే ఆ నిర్ణయాన్ని సక్రమంగా అమలుపరచలేదన్నదే నా ఫిర్యాదు. ఆ నిర్ణయ ఆవశ్యకత గురించి ప్రజలకు వివరంగా తెలియజేయలేదు. నిర్ణయం తీసుకునేముందు, దానినెలా అమలుపరచాలనే విషయమై అధికార వర్గాలకు ఒక ఖచ్చితమైన అవగాహన, ప్రణాళిక లేవని నేను గట్టిగా అభిప్రాయపడ్డాను. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు అలాంటి లాక్‌డౌన్ మాత్రమే మార్గాంతరం అన్నట్టుగా వ్యవహరించడం సరికాదని నేను భావించాను. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కొనసాగించేందుకు ముందస్తు, కఠిన చర్యలు చేపట్ట వలసిన అవసరం ఎంతైనా వున్నది. ఈ దృష్ట్యా లాక్ డౌన్ -2 రోగం కంటే చికిత్స మరింత చేటు చేసేదని చెప్పక తప్పదు. ఈ అంశాన్ని మరింత నిశితంగా చూసేముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో సమకూరిన, దాని పొడిగింపు వల్ల సమకూరే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించేందుకు లాక్‌డౌన్ తోడ్పడింది. మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు నమోదయిన కరోనా కేసుల మొత్తం సంఖ్య 536 నుంచి 10,813 కి పెరిగింది. ఇతర దేశల్లో కరోనా కేసులు 500కు మించిన నాటినుంచి మూడు వారాల్లో వాటి సంఖ్య ఏ మేరకు పెరిగిందో చూస్తే, మన దేశం పలు ఇతర దేశాల కంటే ప్రశస్తంగా ఆ మహమ్మారిని కట్టడి చేసిందని స్పష్టమవుతుంది. ఆ నిర్దిష్ట మూడు వారాల వ్యవధి (అంటే ఒక దేశంలో కరోనా కేసులు 500కి మించిన రోజునుంచి 21 దినాల గడువు) లో కరోనా కేసు ల పెరుగుదల వివిధ దేశాలలో ఇలా వున్నది: బ్రిటన్ లో 38,000; ఇటలీలో 41,000; జర్మనీలో 50,000; స్పెయిన్‌లో 73,000; ఫ్రాన్స్, అమెరికాలలో 1 లక్షకు పైబడి వున్నది. కరోనా వ్యాధితో సంభవించిన మరణాల సంఖ్యను కూడా పోల్చి చూద్దాం. మన దేశంలో ఆ నిర్దిష్ట మూడు వారాల వ్యవధిలో దాదాపు 350 మంది కరోనా రోగులు మరణించారు. మరి ఇదే మరణాల సంఖ్య ఆ తుల్య కాలంలో అమెరికాలో 2400కి పైగా వున్నది! దీన్ని బట్టి లాక్ డౌన్ వల్ల కరోనా వ్యాధి వ్యాప్తిని ప్రభావశీలంగా కట్టడి చేయగలిగామని తేటతెల్లమయింది.

ఈ ప్రాథమిక సమాచారం ఆధారంగా భవిష్యత్తును అంచనావేసేందుకు సాహసిద్దాం. 2020 మే మాసాంతానికి మన దేశంలో కరోనా కేసులు 1 మిలియన్ (పది లక్షలు)కు పెరగగలవని అనుకుందాం (అమెరికాలో సైతం మే మాసాంతానికి కరోనా కేసులు ఈ స్థాయికి పెరుగుతాయని భావిస్తున్నారు). ప్రస్తుతం కరోనా కేసుల నమోదు రేటును అదే స్థాయిలో కొనసాగిస్తూ లాక్‌డౌన్ -2 ముగిసేనాటికి వాటి సంఖ్యను 50 వేల కంటే తక్కువగాను, మే మాసాంతానికి రెండు లక్షల కంటే తక్కువగాను వుండేలా అదుపుచేయ గలమని భావిద్దాం. అయితే కరోనా వైరస్‌ను సంపూర్ణంగా నిర్మూలించలేము గనుక 2020 సంవత్సరంలోని మిగతా కాలంలో మరో రెండు లక్షల కేసులు నమోదు కాగలవని అనుకుందాం.

మొత్తం కరోనా కేసుల సంఖ్యను పది లక్షలకు బదులుగా నాలుగు లక్షలకు పరిమితం చేయగలిగితే 21 రోజుల లాక్‌డౌన్ వల్ల వాటిల్లిన, దాని పొడిగింపుతో వాటిల్ల బోయే నష్టాలను చూద్దాం. లాక్‌డౌన్ వల్ల పూర్తిగా ఉపేక్షింపబడినవారు, ఎటువంటి నష్టపరిహారం పొందనివారు వలస కూలీలు. ఆరున్నర లక్షల మందికి పైగా వలస కూలీలు మెట్రోపాలిటన్ నగరాలలోని లేదా వాటి పరిసర ప్రాంతాలలోని సహాయ శిబిరాలలో బతుకులీడుస్తున్నారు. ఎటూ వెళ్ళలేక తాము పనిచేస్తున్న భవన నిర్మాణ ప్రదేశాలలోనే నిస్సహాయంగా వుండిపోయిన వారు, పట్టణాలు, నగరాలకు సుదూర ప్రాంతాలలోని పనిస్థలాల వద్ద చిక్కుకొన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే నిస్సహాయులైపోయిన వలసకూలీల సంఖ్య మరింత అత్యధికంగా వుంటుంది. ఇక ఎటువంటి ఆదాయం లేదా ఆహారం లేకుండా, స్వస్థలాలకు వెళ్ళలేక అద్దె కొంపలలోనే వుండిపోయిన వారి సంఖ్యను కూడా అదనంగా చేర్చి తీరాలి. అలాగే తమ ఇళ్ళలోనేవుండిపోయినవారిని గురించికూడా ఆలోచించండి. ఆదాయం లేక పోవడంతో పాటు బహుశా ఆహారం కూడా వీరికి కొరవడివుంటుందని చెప్పవచ్చు. లాక్‌డౌన్ -1 మొదటి రెండు వారాల్లో దాదాపు 12 కోట్ల మంది తమ జీవనాధారాలను కోల్పోవడం జరిగింది. అంటే, మన దేశంలోని 25 కోట్ల కుటుంబాలలో హీనపక్షం మూడో వంతు సంసారాలు లాక్‌డౌన్ పర్యవసానాలతో అమితంగా సతమతమయి పోయాయని చెప్పవచ్చు.

ఇది కేవలం జీవనాధారాల సమస్య కాదు. నిండు జీవితాల మనుగడకు సంబంధించిన సమస్య. హఠాత్తుగా పేదరికంలోకి జారిపోయిన కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే వున్నాయి. ఆ కుటుంబాలు పోషకాహారం, ఆరోగ్య భద్రత పై చేసే ఖర్చు ఒక్కసారిగా గణనీయస్థాయిలో తగ్గిపోతుంది. ఇటువంటి కుటుంబాల సంఖ్యను ఎంత తక్కువగా అంచనా వేసినా అది తప్పకుండా 1 కోటి మేరకు ఉంటుంది. అంటే, కనీసం ఐదుకోట్ల మంది వ్యక్తులు. కరోనా కల్లోలం తో నెలకొన్న ఆర్థిక సంక్షోభం అదనంగా 0.1 శాతం మరణాలకు దారితీస్తుందనుకుందాం. అంటే 50 వేల మరణాలు సంభవిస్తాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే లాక్‌డౌన్ వల్ల ప్రాణ రక్షణ ఎంత మందికి సమకూరిందో అంతే మందికి ప్రాణ హాని సంభవిస్తుంది. ఈ మరణాలు ‘నిరోధింపదగినవని’ ఆరోగ్య భద్రతా నిపుణులు అంటారు. ఎందుకంటే నాణ్యమైన ఆరోగ్య భద్రతా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయన్నది వారి నిశ్చిత భావన. మన దేశంలో ఏటా 24 లక్షల మరణాలు ఈ కారణంగానే సంభవిస్తున్నాయి మరి. లాక్ డౌన్ వల్ల నాణ్యమైన ఆరోగ్య భద్రతా సదుపాయాలకు నోచుకోలేక సంభవించే మరణాలు 1 శాతం పెరిగినా అదనంగా మరణించే వారి సంఖ్య 24,000 గా వుంటుంది. 2 శాతం పెరగడమంటే ఆ సంఖ్య 48,000గా వుంటుంది.

ఈ వాస్తవాలనే మరో కోణంలో చేద్దాం. ఒక తాజా అంచనా ప్రకారం మన దేశంలో పోషకాహారలోపం వల్ల ఏటా 73,000 మరణాలు సంభవిస్తున్నాయి. పేదరికంతో ముడివడివున్న ఇతర వ్యాధుల వల్ల కూడా సంభవిస్తున్న మరణాల సంఖ్య భారీగానే వుంటుంది. ఉదాహరణకు ఏటా అతి సారం వల్ల 5.2 లక్షల మంది; క్షయ వ్యాధి వల్ల 3.75 లక్షల మంది; మలేరియా వల్ల 1.85 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారు. శిశు మరణాల సంఖ్య 4.45లక్షల మేరకు ఉంటోంది. మరి పేదరికంలోకి అకస్మాత్తుగా జారిపోవడమంటే పోషకాహారలోపం తప్పక మరింతగా తీవ్రమవుతుంది. రాబోయే రెండు సంవత్సరాలలో పోషకాహార లోప సంబంధిత మరణాలు 10 శాతం, పేదరికంతో ముడివడివున్న ఇతర వ్యాధుల సంబంధిత మరణాలు 1 శాతం మేరకు పెరిగితే లాక్ డౌన్ ప్రేరిత మరణాల సంఖ్య అదనంగా 50,000 మేరకు ఉండడం ఖాయం. ఈ విషయాలు స్పష్టం చేస్తున్నదేమిటి? లాక్‌డౌన్ ఎంత మంది ప్రాణాలను కాపాడగలదో, అంతకంటే ఎక్కువగా కాకపోయినప్పటికీ, అంతే మంది జీవితాలను హరించివేస్తుంది.

ప్రాణాలను కాపాడుకున్నవారు ఆర్థికంగా మంచి స్థితిలో వున్నవారే నని మరి చెప్పనవసరం లేదు. అలాగే బతుకులు బుగ్గిఅయినవారు పేదలు కాక మరెవరవుతారు? జీవనాధారాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజంపై లాక్ డౌన్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ ఎంతమాత్రం సమర్థించరానిది.లాక్‌డౌన్-2 మార్గదర్శకాలు ఆర్థిక వ్యవస్థలోని పలు విభాగాలలో కార్యకలాపాలకు అనుమతినిచ్చాయి. ఏప్రిల్ 20 తరువాత నిర్మాణ రంగ పనులకు, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు, అలాగే వ్యవసాయరంగ పనులకు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి సడలింపు నివ్వడం ఎంతైనా హర్షణీయం. పూర్తిగా స్వాగతించాల్సిన చర్యలు. అయితే అసంఖ్యాక పేదలకు అత్యవసర సహాయ చర్యలను ముమ్మరంగా చేపట్టడం చాలా ముఖ్యం. ఇది జరగని పక్షంలో అంతా వ్యర్థమవుతుంది.

ఎలాంటి సడలింపుల వల్ల ఎటువంటి ప్రయోజనముండబోదు. ప్రజా పంపిణీ వ్యవస్థను తక్షణమే సార్వజనీకరణం చేయడం ద్వారా ఆహార సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం పూనుకోవాలి ఆహారానికి అలమటిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి బడి పిల్లల మధ్యాహ్న భోజన పథక సదుపాయాలను ఉపయోగించుకోవాలి. స్వస్థలాలకు యోజనాల దూరంలోని పని ప్రదేశాల వద్ద నిస్సహాయంగా వుండిపోయిన వలసకూలీలకు ప్రత్యేక రైళ్ళ నేర్పాటుచేయాలి. లేదా ఆహారం, నగదు సమకూర్చి వారి మనుగడకు తోడ్పడాలి. వ్యవసాయక ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకోవాలి. చిన్న వ్యాపార సంస్థలకు జీఎస్టీని తగ్గించాలి. రుణాలపై వడ్డీ చెల్లింపును మారటోరియం కింద రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. ఈ సంక్షేమ చర్యలను ఏమాత్రం ఉపేక్షించినా కరోనా వైరస్ కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ అతి పెద్ద మానవ కల్పిత విపత్తుగా మన చరిత్రలో మిగిలిపోతుంది.


యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates