నడిరోడ్డుపై ప్రసవ వేదన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఫోన్‌ చేసినా అందుబాటులో లేని 108 
  • బైక్‌పైఎక్కించుకొని ఆస్పత్రికి బయలుదేరిన భర్త
  • వేడుకున్నా వాహనం డ్రైవర్‌ లేడన్న పోలీసులు
  • రోడ్డుపైనే ప్రసవం.. స్పందించని ఆస్పత్రి సిబ్బంది
  • వాహనం పంపం.. ఆమెనే తీసుకురావాలని స్పష్టం

సూర్యాపేట : నిండు గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవ వేదన అనుభవించింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం అందుబాటులో లేకపోవడంతో నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. రోడ్డుపై ప్రసవించిన తన భార్యకు చికిత్స చేయాలని భర్త జనరల్‌ ఆస్పత్రికి వెళ్లి వేడుకున్నా… ఆమెనే ఆస్పత్రికి తీసుకురావాలని వైద్య సిబ్బంది మొండిపట్టు పట్టారు. ఈ ఘటన సూర్యాపేటలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. అర్వపల్లి మండలం రామన్నగూడెనికి చెందిన దండకొండ వెంకన్న, రేష్మ దంపతులు సూర్యాపేటలోని అన్నాదురైనగర్‌లో ఉంటున్నారు. రేష్మకు రాత్రి ఒంటిగంట సమయంలో పురిటినొప్పులు మొదలయ్యాయి.

భర్త వెంకన్న 108కు ఫోన్‌ చేశాడు. వాహనం అందుబాటులో లేదని, పెన్‌పహాడ్‌ నుంచి రావల్సి ఉందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో వెంకన్న తన బైక్‌పైనే భార్యను కూర్చోపెట్టుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. సూర్యాపేట గల్లీలో ఉన్న బారికేడ్‌లు తొలగించుకొని కోర్టు చౌరస్తాకు వచ్చాడు. లాక్‌డౌన్‌తో రెడ్‌జోన్‌ ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేసిన ఇనుపకంచె తీయడానికి వీలులేకుండా పోయింది. అక్కడ కనీసం కానిస్టేబుల్‌ కూడా లేకపోవటంతో ఇంటిపక్కన ఉన్నవారికి ఫోన్‌ చేశాడు. వారు అక్కడికి రాగానే, వెంకన్న వెంటనే సమీపంలోని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లాడు. పోలీ్‌సస్టేషన్‌లో వాహనాలు ఉన్నా; డ్రైవర్‌ లేడని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ చెప్పటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్యను దింపిన చోటుకు చేరుకున్నాడు. అప్పటికే రోడ్డుపైనే ఆమె ప్రసవించగా; స్థానికులు సహాయం చేశారు.

వెంటనే సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి భర్త  వెళ్లి; తన భార్య రోడ్డుపై ప్రసవించిందని, చికిత్స చేసేందుకు అక్కడికి రావాలని వైద్య సిబ్బందిని ప్రాధేయపడ్డాడు.. తమకు నిబంధనలు ఒప్పుకోవని ఆమెను ఆస్పత్రికే తీసుకురావాలని సిబ్బంది తేల్చి చెప్పారు. అప్పటికే సమాచారం తెలుసుకున్న కోదాడ సీఐ శివరామరెడ్డి జనరల్‌ హాస్పటల్‌కు చేరుకుని వైద్య సిబ్బందిని రావాలని కోరినా వారు వినలేదు. అప్పటికే తెల్లవారుజామున 2గంటలకు మరోసారి వెంకన్న 108కు ఫోన్‌ చేయడంతో 2:30 గంటలకు అంబులెన్స్‌ అక్కడకు చేరుకుంది. బాలింతను అంబులెన్సులో జనరల్‌ హాస్పటల్‌కు తరలించగా; అక్కడ డాక్టర్లు చికిత్స చేశారు. తల్లీబిడ్డ  క్షేమంగా ఉన్నారు.  అయితే, ‘‘సమాచారం అందగానే అర్ధరాత్రి వాహనం కోసం ప్రయత్నించాం. ఇంతలో 108 వాహనం రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేశాం’’అని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

ఎవరూ రాలేదు: వెంకన్న, గర్భిణి భర్త
23న ప్రసవానికి తేదీ ఇవ్వటంతో; నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వెళితే ఎందుకొచ్చారని డాక్టర్‌ కోప్పడ్డారు. బుధవారం ఉదయం నొప్పులు ప్రారంభమైనా ఓర్చుకుంది. తర్వాత తీవ్రమయ్యాయి. సమయానికి ఎవరూ రాకపోవడంతో అష్టకష్టాలు పడ్డాం. దేవుడి దయతో అంతా మంచే జరిగింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates