నిర్బంధంలో పెరిగిన గృహ హింస

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– హెల్ప్‌లైన్‌ నెంబర్లకు
– ఫోన్లు.. ఎక్కువైన కేసులు
– పెరుగుతున్న పని వత్తిడి, లైంగిక హింస
– ఐరాస మార్గదర్శకాలు అమలుచేయాలి : నిపుణులు

న్యూఢిల్లీ : కరోనా తీసుకొచ్చిన లాక్‌డౌన్‌తో మహిళలపై గృహహింస కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఎవరూ బయటకురావొద్దని కేంద్రం కఠిన నిబంధనలు విధించడంతో అందరూ ఇంట్లోనే ఉంటుండటంతో కేసులు ఎక్కువౌతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు ప్రపంచమంతా లాక్‌డౌన్‌ పాటిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో హెల్ప్‌లైన్‌ నెంబర్లకు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఇటీవలే వాషింగ్టన్‌ పోస్టు ఓ కథనం వెలువరించింది. ‘మూసివేత’తో స్త్రీలపై లైంగిక హింస పెరుగుతున్నదనీ, వారిపై దాడులకు పాల్పడేవారితో కలిసి మహిళలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపింది. క్వారంటైన్‌ జీవితం మహిళలకు ఏ మాత్రం క్షేమంగా లేదని ఆ కథనం హెచ్చరించింది.

ఇక భారత్‌ విషయానికొస్తే.. విదేశాలతో పోలిస్తే ఇక్కడ తమపై జరిగిన హింస, వేధింపుల గురించి బయటకు ఫిర్యాదు చేసేవారు తక్కువ. కానీ ఆశ్చర్యకరంగా జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు వారం రోజుల్లోనే దాదాపు 260 ఫిర్యాదులు అందాయి. లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి 23 నుంచి ఈనెల 1 వరకే.. మహిళలు హెల్ప్‌లైన్‌ ద్వారా కేసులు నమోదుచేయడం గమనార్హం. ఇందులో లైంగిక హింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

ఎన్‌సీడబ్ల్యూకే గాక ఆయా రాష్ట్రాల్లోని హెల్ప్‌లైన్‌లు, మహిళల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీనిపై ఓ ఎన్జీవో ప్రతినిధి స్పందిస్తూ.. గతంలో కంటే గడిచిన 15 రోజుల్లో 20 శాతం కేసులు పెరిగాయని తెలిపారు. మద్యానికి బానిసైనవారు, ఉద్యోగాలు కోల్పోయినవాళ్లు మానసిక వేదనకు గురై ఇంట్లో ఉన్న భార్యల మీద దాడులకు దిగుతున్నారని ఆమె చెప్పారు.
మహిళలపై గృహ హింసను అరికట్టడానికి ‘యూఎన్‌ ఉమెన్‌’ గతంలో పలు అంశాలతో మార్గదర్శకాలను వెలువరించింది. తాజా కేసుల నేపథ్యంలో వాటిని కఠినంగా అమలుచేయాలని నిపుణులు, సైకాలిజిస్టులు కోరుతున్నారు. అవి కింది విధంగా ఉన్నాయి.

  • హెల్ప్‌లైన్‌ నెంబర్లను అందరికీ అందుబాటులో ఉంచాలి. మహిళలందరికీ అవి తెలిసేవిధంగా పత్రికలు, టీవీలు, సంక్షిప్త సందేశాలు, ప్రకటనల రూపంలో తెలియజేస్తూ వారికి అవగాహన కల్పించాలి.
  • హింసను ఎదుర్కొనే మహిళల భద్రత కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి.
  • అసంఘటితరంగంలో పనిచేసే మహిళల జీవితాలు మరింత దుర్బరం కాకుండా వారికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలి.

  • గృహహింస ఎదుర్కునే మహిళలు.. వారి ఇండ్లల్లో బాధితులుగా ఉండలేరు. ఇందుకుగానూ వారికోసం కేటాయించిన ప్రత్యేక భవనాల్లోకి వారిని తరలించి వసతి కల్పించాలి.

  • ఇంటి పనులన్నీ ఒక్క మహిళ మీదే పడకుండా భార్య, భర్తలు సమానంగా పంచుకునేలాగా విధానాలు రూపొందించి దానిమీద విస్తృతమైన క్యాంపెయిన్‌ చేయాలి.

  • మహిళా వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులకు పటిష్ట భద్రత కల్పించాలి. తద్వారా వారు లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశం ఉండదు.

  • హింసను ఎదుర్కొన్న మహిళలు కుంగిపోకుండా ఉండేందుకు తగిన కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.
    పై మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని ప్రపంచవ్యాప్తంగా మహిళలు పోరాటం చేస్తున్నారు. మహిళలపై కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు దేశాలు వాటిని అమలుచేస్తున్నాయి.

దీనిపై యూఎన్‌ ఉమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పుంజైల్‌ మ్లాంబో స్పందిస్తూ.. గృహహింస అనేది ‘నీడలా వెంటాడే మహమ్మారి’ (ఎ షాడో ప్యాండెమిక్‌) అనీ, దానిమీద కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని తెలిపారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates