నేటి ముఖ్యాంశాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల
లాక్‌డౌన్‌లో పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్రం బుధవారం విడుదల చేసింది. విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు థియేటర్లు, మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, బార్లు మూసివుంటాయని తెలిపింది. వ్యవసాయంతో పాటు మరికొన్ని కీలక రంగాలకు ఏప్రిల్‌ 20 తర్వాత సడలింపులు ప్రకటించింది. జాతీయ ఉపాధిహామీ పనులకు, వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలను అనుమతించనున్నట్టు ప్రకటించింది. ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చింది.

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్స్‌
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం ప్రకటించారు. గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కోవిడ్‌-19 బారిన పడిన మరణించిన వారి సంఖ్య 400కు చేరుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు చెప్పారు. 207 జిల్లాలను నాన్‌ హాట్‌స్పాట్స్‌గా పేర్కొన్నారు. మిగతా జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయన్నారు.

బెంగాల్‌లో పేదల ఆందోళన
ప్రభుత్వ రేషన్‌ అందక ఆకలితో అలమటిస్తున్న పేదలు పశ్చిమ బెంగాల్‌లో బుధవారం ఆందోళనకు దిగారు. ముర్షిదాబాద్‌ జిల్లా దోమకల్‌ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు ఆందోళనకు దిగడంతో స్థానికంగా కలకలం రేగింది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఆకలితో పస్తులు ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో 165 కంటోన్మెంట్ జోన్లు
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌-19 బారి నుంచి కోలుకున్న 16 మంది డిశార్జ్‌ కాగా, 11 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 475 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు మృతిచెందారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 165 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. క్వారంటైన్‌ గడువు పూర్తిచేసుకున్న కరోనా అనుమానితులందరికీ రూ. 2 వేలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఏపీలో ఇంగ్లీషు మీడియం జీవోలు రద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీనికి సంబంధించిన జీవోలు 81, 85లను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. బీజేపీ నేత సుదీష్‌ రాంబొట్ల, శ్రీనివాస్‌ వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.

స్వీయ నిర్బంధంలో గుజరాత్‌ సీఎం
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. రూపానీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కోవిడ్‌ సోకిందని నిర్ధారణ కావడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రూపానీకి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని డాక్టర్లు చెప్పారు. ముందుజాగ్రత్తగా రూపానీ తన నివాసంలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ ద్వారా విధులను నిర్వహిస్తున్నారు. గాంధీనగర్‌లోని ఆయన నివాసం లోపలకు బయట వ్యక్తులెవరినీ అనుమతించడం లేదు.

డబ్ల్యూహెచ్‌ఓ నిధులు ఇవ్వం: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు ఇస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. కోవిడ్‌-19 సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమెరికా నిర్ణయంపై చైనా, రష్యా, జర్మనీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రంప్‌ నిర్ణయం ప్రమాదకరమని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.

మలేసియాకూ హైడ్రాక్సీక్లోరోక్విన్‌
కరోనా వైరస్‌ను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను మలేసియాకు కూడా విక్రయించాలని భారత్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని మలేసియా మంత్రి కౌముర్దీన్‌ జాఫర్‌ వెల్లడించారు. తమ దేశానికి 89,100 హైడ్రాక్సీక్లోరోక్విన్‌ టాబ్లెట్లు ఎగుమతి చేసేందుకు భారత్‌ అంగీకరించిందని ఆయన తెలిపారు. దీనిపై భారత్‌ తరపున ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా, భారత్ నుంచి 30 లక్షల పారాసిటమాల్ యూనిట్లు దిగుమతి చేసుకోనున్నట్టు బ్రిటన్‌ వెల్లడించింది.

RELATED ARTICLES

Latest Updates