ఆహార నిల్వలున్నా ఆకలి ఎందుకు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఇంట్లో సరుకులు నిండుకున్నందున మన కుటుంబంలో అత్యంత బలహీనమైన సభ్యుడిని పస్తు పెట్టటానికి మనం ఒప్పుకోగలమా? ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోంది. మన దేశంలో మితిమీరిన మోతాదులో ఆహార ధాన్యాల నిల్వలున్నాయన్న విషయం మనందరికీ తెలుసు. కరోనా సంక్షోభ కాలంలో ఈ నిల్వలు ప్రజలకు పంపిణీ చేయటం ద్వారా వాళ్లు ఆకలి చావులకు గురి కాకుండా జాగ్రత్తపడవచ్చన్నదీ మనకు తెలుసు. మనముందున్న పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవటంలో ఎక్కువమంది విఫలమవుతున్నారు.

ఇరవైయేండ్ల క్రితం పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ సంస్థ సుప్రీం కోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. భారత ఆహార సంస్థ గోదాముల్లో మురిగిపోతున్న ఆహార ధాన్య నిల్వలను ప్రజా పనులు, ఇతర సామాజిక భద్రత కార్యక్రమాలకు వెచ్చించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నది ఈ వ్యాజ్యంలోని విజ్ఞప్తి. మధ్యాహ్న భోజన పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు వంటి చర్యలకు అంతిమంగా జాతీయ ఆహార భద్రతా చట్టం రూపొందటానికి దారితీసింది. ఈ పథకాల ద్వారా దేశంలో ఏటా 50-60 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఖర్చవు తున్నాయి. అయినా వ్యవసాయోత్పత్తుల దిగుబడులు మెరుగ్గా ఉండటంతో నిరంతరం గోదాముల్లో నిల్వలు పేరుకుంటున్నాయి.

2001లో ఈ వ్యాజ్యం సుప్రీం కోర్టులో దాఖలు చేసినప్పుడు ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు యాభై మిలియన్‌ టన్నులకు చేరుకుంటున్నాయి. అప్పట్లో అది రికార్డు నిల్వల స్థాయి. గత ఐదేండ్లల్లో ఈ నిల్వలు 2001 నాటి స్థాయిని దాటి మరెన్నో రెట్లు పెరిగాయి. గత సంవత్సరం జూన్‌ నాటికి 80మిలియన్‌ టన్నుల నిల్వలు పోగుపడ్డాయి. ప్రభుత్వం నిర్ధారించిన బఫర్‌ స్టాక్‌ మోతాదు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ సంవత్సరం రబి దిగుబడి నాటికి సుమారు 20 మిలియన్‌ టన్నులు అదనంగా నిల్వలు పెరిగాయి. ఈ స్థాయిలో దేశంలో ఆహార నిల్వలు ఎన్నడూ పోగుపడలేదు. మరోవైపున లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాదిమంది ప్రజలు జీవనోపాధి కోల్పోయి ఆకలిదప్పులతో మాడుతున్నారు. మూడునెల్ల పాటు ఇప్పుడిస్తున్న రేషన్‌కు రెట్టింపు ఇవ్వాలని నిర్ణయించటం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి పేదలకు ఏమీ గొప్ప సేవలందించటం లేదు. రబీ దిగుబడిని నిల్వ చేయటం కోసం గోదాముల్లో జాగా ఖాళీ చేయటం ప్రభుత్వానికి కూడా అవసరమే. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు విడుదల చేయటం ద్వారా పేదలకు మరింత మెరు గైన సేవలందించే అవకాశం ప్రభుత్వానికి ఉంది.

కానీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఎందుకని? ఆహార సబ్సిడీ ఖాతా నిర్వహణలో ఉన్న లోపాలు దీనికి ఓ కారణం కావచ్చు. ఆహారపు సబ్సిడీని ఎలా లెక్కిస్తారు? కనీస మద్దతు ధరకు ఎఫ్‌సీఐ కొన్న ధాన్యాన్ని నిల్వ ఉంచి అంతకంటే తక్కువ ధరకు మార్కెట్లో విడుదల చేస్తుంది. రాష్ట్రాలకు కేటాయించిన ఆహార ధాన్యాలు గోదాముల నుంచి రేషన్‌ దుకాణాల వరకు చేరవేయటానికి అయ్యే రవాణా ఖర్చు కూడా ఎఫ్‌సీఐ భరిస్తుంది. కొనుగోలు ధర, నిల్వ, రవాణా ఖర్చు కలిపి ఓ పద్దుగా లెక్కించి అందులో నుంచి జారీ ధర ద్వారా వచ్చే ఆదాయాన్ని జమ చేస్తే మిగిలే మొత్తమే కేంద్రం భరించే సబ్సిడీ. ఆహార ధాన్యాలు గోదాముల నుండి దుకాణాలకు చేరే వరకు ఈ సబ్సిడీ మొత్తం ఖర్చుకాదు. ఖర్చుగా నమోదు కాదు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సహాయక పథకంలో 40వేల కోట్లు గోదాముల్లో నిల్వ ఉన్న మిగులు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం విడుదల చేసేలా కేటాయించటానికి కేంద్ర ఆర్థిక మంత్రి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. ఆర్థిక పరిభాషలో మిగులు నిల్వలు మార్కెట్లో విడుదల చేయటానికి పెద్దగా ఖర్చయ్యేదేమీ లేదు. పైగా ఆదా కూడా అవుతుంది. కానీ జమా ఖర్చుల లెక్కల్లో ఇది ఖరీదైన వ్యవహారం. ఈ తేడా కారణంగానే మిగులు ధాన్యాలను మార్కెట్లో విడుదల చేయటం ప్రభుత్వానికి కష్టంగా మారింది. క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు ఆహార ధాన్యాల సరఫరా గురించి మాట్లాడవు. ద్రవ్య లోటు గురించే మాట్లాడతాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కోణం నుండి పరిశీలిద్దాం. జార్ఖండ్‌లో అర్హులైన మెజారిటీ ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థకు దూరమయ్యారు. రాష్ట్రంలో ఏడు లక్షల కుటుంబాలు రేషన్‌ కార్డు కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక పథకం ద్వారా కలిగే ప్రయోజనమేమీ లేదు. రేషన్‌ కార్డు లేని ఈ కుటుంబాలకు జార్ఖండ్‌ ప్రభుత్వం ఆహార ధాన్యాలు అందించాలంటే ఎఫ్‌సీఐ వద్ద కొనుగోలు చేయాల్సిందే. అంటే మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిందే.

యుద్ద ప్రాతిపదికన ఈ ఏడు లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు అందచేసి జాతీయ ఆహారభద్రత చట్టం ప్రమాణాల ప్రకారం నెలకు మనిషికి ఐదు కిలోల చొప్పున ఆర్నెల్ల పాటు సరఫరా చేయాలంటే కనీసం లక్ష టన్నుల ఆహారధాన్యాలు కావాలి. ఇలా చేయటం ద్వారా ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉన్న నిల్వల్లో కొద్ది మోతాదులో తగ్గొచ్చు కానీ కరోనా కాలంలో ఏడు లక్షల కుటుంబాల ఆకలి తీర్చగలుగుతుంది. ఈ విధంగా ఉచితంగా రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తక్షణ ప్రజల అవసరాలు ఎంతో కొంత తీర్చగలుగుతుంది. తద్వారా అర్హులై కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రాతిపదిక ప్రకారం రేషన్‌ అందుకోవటానికి అనర్హులుగా మిగిలిపోయిన కుటుంబాలకు నెలసరి ఆహార ధాన్యాలు అందించటం ద్వారా అంతో ఇంతో ఆహార భద్రత కల్పించొచ్చు. ప్రభుత్వం రూపొందించిన తప్పుడు ప్రాతిపదిక ప్రకారం అనర్హులుగా మారిన వారికి కొద్దిపాటి భరోసా కల్గించవచ్చు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రయివేటు వ్యాపారాలు కూడా స్థంభించాయి. ఈ పరిస్థితుల్లో పెరిగే ఆహారో త్పత్తుల ద్రవ్యోల్బణాన్ని అదపులో ఉంచటానికి కూడా ఈ చర్య తోడ్పడుతుంది.

కంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన నగదు బదిలీకి అనేక పరిమితులున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు ఆకలిగొన్న వారికి అందించటం పెద్ద ఉపశమనం కాగలదు. మహిళలకున్న జన్‌ధన్‌ ఖాతాల్లో మూడు నెల్ల పాటు నెలకు ఐదువందల రూపాయల చొప్పున నగదు జమచేయటం ఈ దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన మొదటి చర్య. ఈ ఖాతాల విషయంలో కూడా అర్హులైన వారికి ఖాతాలు లేని సందర్భాలు కోకొల్లలు. ఈ సంక్షోభ సమయంలో ఈ స్థాయిలో మూకుమ్మడిగా నగదు పంపిణీ చేయటం అంత తేలికైన పని కాదు. వెనకబడిన రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవల కొరత ప్రబలంగా ఉంది. బిజినెస్‌ కరస్పాండెంట్స్‌ ద్వారా ఈ నగదు అందించే ప్రయత్నం చేయటం ఈ సమయంలో అంత క్షేమదాయకం కాదు. అందువల్ల బిజినెస్‌ కరస్పాండెంట్స్‌ లేకుండా నేరుగా గ్రామీణ బ్యాంకు బ్రాంచీలు నగదు అందించటం అంటే బ్యాంకుల నిండా జనం కుప్పలు కుప్పలు చేరతారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సామాజిక దూరం పాటించటం అసాధ్యమవుతుంది. ఈ సమస్యలు పరిష్కరించ టానికి ఇంకా కొంత సమయం పడుతుంది.

పేదలకు సహాయం కోసం కేంద్రం పంపుతున్న సొమ్ము ఎక్కడకు ఎలా చేరుకుంటుందో తెలుసుకోవటం కూడా సాధారణ ప్రజలకు సాధ్యం కాని పని. ఈ కొద్ది మొత్తాలు తీసుకోవటానికి కొందరు ఎంత దూరం ప్రయాణించాలో, ఎన్ని రోజులు క్యూలో నిలబడాలో, ఎంతెంత ఖర్చు పెట్టాలో లెక్కేసుకుంటే గుండెలు బాదుకోవల్సి ఉంటుంది. కొన్ని సార్లు కంప్యూటర్‌ పని చేయటం లేదనో, మరికొన్ని సార్లు బయోమెట్రిక్‌ సమాచారం పొంతన లేకపోవటంతో వారి ఖాతాలు స్తంభించాయనో వినాల్సి వస్తుంది. మిగిలిన వాళ్లు క్యూలో బ్యాంకు కౌంటర్‌కే చేరుకునే అవకాశం లేదు. ఇవేవో నేను సృష్టిస్తున్న సమస్యలు కాదు. ఈ సమస్యలన్నీ రాంచీ సమీపంలోని నగరి మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందించేందుకు బదులు నేరుగా నగదు బదిలీ చేయటానికి జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఎదురైన సమస్యలే.

జీన్‌డ్రెజ్‌
అనువాదం : కొండూరి వీరయ్య

Courtsey Nava Telangana

RELATED ARTICLES

Latest Updates