గ్లౌజుల్లేకుండానే కరోనా రోగుల తరలింపు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఉస్మానియాలో సిబ్బందికి కిట్లు, గ్లౌజులు కరువు
  • ఐసొలేషన్‌లో వసతుల్లేవు..
  • ఇంటికెళ్తానన్న రోగి వైద్యుడిపై చేయిచేసుకున్న రోగి కుమారులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జూనియర్‌ డాక్టర్లు

మంగళ్‌హాట్‌ : రాష్ట్రంలోనే పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియాలో సిబ్బంది కనీసం గ్లౌజులు లేక ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ కరోనా లక్షణాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఐసొలేషన్‌ వార్డు రోగులతో నిండిపోయింది. అక్కడ పనిచేస్తున్న వారికి, రోగులకు ఎలాంటి వసతులూ లేవని ఆస్పత్రి సిబ్బంది కొన్ని రోజులుగా చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఉస్మానియాను కొవిడ్‌ ఆస్పత్రిగా గుర్తించకపోవడంతో కిట్లు, గ్లౌజులు, ఎన్‌ 95 మాస్కుల కొరత తీవ్రంగా ఉందని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఇద్దరికి వైరస్‌ సోకినట్లు తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు సిద్ధం చేశారు. సిబ్బంది గ్లౌజులు వేసుకోకుండానే రోగులను అంబులెన్సు వద్దకు తీసుకొచ్చారు. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా పక్కనే ఉన్నా స్పందించలేదని తెలుస్తోంది. సిబ్బంది గ్లౌజులు లేకుండా కరోనా రోగిని తాకి మళ్లీ విధుల్లోకి రావడంతో వెంటనే వారిని క్వారంటైన్‌కు పంపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పలువురు వైద్య సిబ్బంది వాపోతున్నారు. ఇటీవల ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు, మాస్కులు లేవని.. వాటిని కొనేందుకు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు కొందరు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కిట్లు, మాస్కులు అందజేస్తున్నట్లు చెప్పినప్పటికీ సిబ్బందికి అందడం లేదనడానికి తాజా ఘటనే నిదర్శనం.

వైద్యులపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
పాత బస్తీకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మూడు రోజుల క్రితం ఉస్మానియాకు వచ్చాడు. అతన్ని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అక్కడే మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. పక్కనే ఉన్న ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో సదరు వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు. అతని కుమారులు వైద్యుల వద్దకెళ్లి తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగం పీజీ విద్యార్థితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. దీంతో జూనియర్‌ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలని, తరచూ దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేద ని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్‌ వెంటనే విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకువెళ్లడంతో కరోనా లక్షణాలతో వచ్చే రోగులను నేరుగా గాంధీకి పంపాలని మౌకికంగా ఆదేశించారు.

సెక్యూరిటీని పెంచడంతో పాటు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన విరమించి దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్తానన్న వ్యక్తికి కరోనా ఉన్నట్లు సాయంత్రం రిపోర్ట్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఐసోలేషన్‌ వార్డులో ఉన్న 12 మందినీ గాంధీకి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రి ఈటల ఉస్మానియా సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates