‘ఉపాధి’ కోల్పోయిన కూలీలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ‘నరేగా’ కింద ఈ నెలలో ఇప్పటివరకూ పని కల్పించింది లక్ష మందికే..
– లాక్‌డౌన్‌తో గ్రామాలకు తరలిన వలస కార్మికులు
– అమలు చేయాలని కోరుతున్న పలు రాష్ట్రాలు
– పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం (నరేగా) లాక్‌డౌన్‌ కారణంగా అమలుజరగడం లేదు. దీంతో కోట్లాది మంది కూలీలు ఉపాధిని కోల్పోయారు. ఈనెలలో ఇప్పటివరకూ నరేగా కింద 1.09 లక్షల మందికే పని కల్పించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇది గతనెలతో పోలిస్తే చాలా తక్కువ. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన మార్చిలో 1.6 కోట్ల మందికి పని కల్పించగా.. ఫిబ్రవరిలో 1.8 కోట్ల మంది ఉపాధి పొందారు. దీని ప్రకారం చూస్తే ఏప్రిల్‌లో ఒక్కశాతం మంది మాత్రమే ఉపాధి హామీ కింద పని పొందారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ యోజనా ఉపశమన ప్యాకేజీ ప్రకటిస్తూ.. నరేగా కూలీలకు కూలీ రేట్లను మరో రూ. 20కు (అంతకుముందు రూ. 209 ఇచ్చేవారు) పెంచుతున్నట్టు తెలిపారు. ఇది జాబ్‌ కార్డులున్న 13.6 కోట్ల మందికి ఉపయోగపడుతుందని ఆమె సెలవిచ్చారు. కానీ వాస్తవంగా పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. వేతనాల పెంపు పక్కనబెడితే అసలు పనులే జరగడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా గ్రామాల్లో, నగరాల్లో పనులన్నీ నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటిస్తూ నరేగాను అమలుచేయాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఉపాధి లేక దినసరి కూలీలు ఆకలికి అలమటిస్తున్నారనీ, నరేగా ద్వారా అయినా వారికి పని కల్పించి డబ్బులు పంపిణీ చేయాలని సూచించాయి. అయినా ఇప్పటివరకూ కేంద్రం దీని మీద మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నది. మరోవైపు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటనతో నగరాల్లో ఉండే వలస కూలీలు.. అక్కడ ఉపాధి అవకాశాల్లేక వందలాది కిలోమీటర్లు కాలినడకన నడిచి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. సాధారణ కూలీలతో పాటు వారికీ పని కల్పించాలనీ ఆర్థిక వేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నా.. కేంద్రం ఈ అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు.

కరోనా ఆందోళనతో ఉపాధి హామీ జరిగే పని ప్రదేశాలను ఎక్కడికక్కడే మూసేశారు. ఏప్రిల్‌ నెలలో ఛత్తీస్‌గఢ్‌లో 70 వేలు.. ఆంధ్రప్రదేశ్‌లో 53 వేల కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. మిగిలిన రాష్ట్రాల్లో దాదాపు దీని ఊసే మరిచారు.

తమిళనాడులో గతనెల 22 లక్షల కుటుంబాలకు పని కల్పిస్తే.. ఈ నెల 179 కుటుంబాలకే ఉపాధి దొరికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిపై మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ సంస్థ కార్యకర్త నిఖిల్‌ డే స్పందిస్తూ… ఇంతటి సంక్షోభ సమయంలో ప్రజల ఉపాధికి హామీ కల్పించాల్సిన ప్రభుత్వమే దానిని పూర్తిగా పక్కనపెట్టిందని విమర్శించారు. జాబ్‌కార్డులున్నవారి ఖాతాల్లోకి నేరుగా నగదు పంపిణీ చేసి వారికి పని కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదే విషయమై నిఖిల్‌ డే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 8న దీనిని స్వీకరించిన కోర్టు.. రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates