అమెరికా దారి దోపిడి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* తమిళనాడుకు రావాల్సిన కరోనా కిట్లు మళ్లింపు
* నోరు మెదపని ప్రధాని

మేం అడిగిన తరువాత కూడా మీనమేషాలు లెక్కిస్తారా.. అయితే, ప్రతీకారం తప్పదు.హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధాన్ని సడలించడంలో కొంచెం జాప్యం జరగడంతో భారత్‌పై ఒంటికాలిపై అంతెత్తున లేచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంతటితో ఆగలేదు. మరింతగా బరితెగించారు. చైనా నుండి తమిళనాడుకు అత్యవసరంగా రావాల్సిన కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అడ్డుకొని, బలవంతంగా వారి దేశానికి తరలించారు. ట్రంప్‌ నోటివెంట ఆగ్రహంతో మాట రాగానే ప్రధాని నరేంద్రమోడీ ఏళ్లతరబడి ఉన్న నిషేధాన్ని సడలించి మానవత్వమంటూ మురిసిపోయిన సంగతి తెలిసిందే! మరి.. మనకు రావాల్సిన కిట్లను అడ్డుకుని, తమ దేశానికి అక్రమంగా తీసుకువెళ్లారని తెలిసిన తరువాత ప్రధాని స్పందన ఎలా ఉండాలి? ఈ దారిదోపిడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రధానమంత్రి ఇంతవరకు పెదవి విప్పలేదు.! ఆర్డరిచ్చిన నాలుగు లక్షల కిట్లు వస్తే మరింత వేగంగా, ఎక్కువ మందికి పరీక్షలు జరపవచ్చని భావించిన తమిళనాడు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో పడింది.

చెన్నై : కరోనా వైరస్‌ నుండి తమ ప్రజలను రక్షించుకునేందుకు తీసుకొస్తున్న మాస్క్‌లను అమెరికా హైజాక్‌ చేసిందని జర్మనీ, ఫ్రాన్స్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. కెనడా, బ్రెజిల్‌కు సరఫరా కావాల్సిన పిపిఇలను, వెంటిలేటర్లను కూడా అమెరికా దారి మళ్లిస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్‌ కూడా చేరింది. చైనా నుండి తమిళనాడుకు రావాల్సిన కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అమెరికా స్వాధీనం చేసుకుని, తమ దేశానికి తీసుకెళ్లింది. సాక్షాత్తు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం ‘భారత్‌ కోసం సిద్ధం చేసిన సరుకు అమెరికాకు వెళ్లింది. అందువల్ల రాపిడ్‌ టెస్ట్‌ కిట్ల రాక మరింత ఆలస్యమవుతుంది.’ అని మీడియాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిగా షణ్ముగం ఈ విషయాన్ని కొంత సున్నితంగా చెప్పి ఉండవచ్చు. కానీ, భారత ప్రభుత్వ స్పందన ఎలా ఉండాలి? రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం శనివారం షణ్ముగం ఈ విషయాన్ని బయటకు వెల్లడించగా, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు.

ఏం జరిగింది?
కరోనా వేగంగా వ్యాపిస్తుండటం, పాజిటివ్‌ కేసుల్లో దేశంలోనే మూడవ స్థానంలో ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం లక్ష ర్యాపిడ్‌ కిట్ల కోసం చైనాకు ఆర్డర్‌ చేసింది. ఈ దిశలో చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించడానికి కొన్ని రోజుల ముందే తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డర్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి సూచనలు వచ్చిన తరువాత రెండుదఫాలుగా మరో లక్ష కిట్లకు ఆర్డర్‌ చేశారు. ఆ తరువాత ఏప్రిల్‌ మొదటి వారంలో జరిగిన సమీక్షా సమావేశంలో క్వారంటైన్‌ చేసి ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించడంతో పాటు, ముందు వరుసలో ఉండి కరోనాతో పోరాడుతున్న సిబ్బందికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడానికి ర్యాపిడ్‌ కిట్ల అవసరం ఎక్కువగా ఉంటుందని చెప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రెండు లక్షల కిట్లకు ఆర్డర్‌ పెట్టాలని ఆదేశించారు. ఇలా మొత్తం నాలుగు లక్షల కిట్లకోసం చైనాకు ఆర్డర్‌ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం తెలిపారు. మాములుగా కరోనా నిర్ధారణకు 9 గంటల సమయం పడుతుండగా, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లతో అరగంటలోనే ఫలితం తెలుస్తుంది. ఆ కారణం చేతనే పెద్దసంఖ్యలో తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్‌ పెట్టింది. తొలి విడతలో కనీసం 50 వేల కిట్లయినా వస్తాయని తమిళనాడు అధికారులు భావించారు. వీటిలో ఒక్క కిట్‌ కూడా ఇంత వరకు ఆ రాష్ట్రానికి చేరలేదు. దీంతో ఎక్కువ సమయం పట్టినా పిసిఆర్‌ టెస్ట్‌లనే తమిళనాడులో చేస్తున్నారు.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates