ఈరోజు టాప్‌ న్యూస్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పించారు.

అంబేద్కర్‌కు ఘన నివాళి
బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు.. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో సామాజిక, హక్కుల కార్యకర్తలు, మేధావులు, సామాన్యులు ఎవరికి వారే నివాళులు అర్పించారు.

దేశంలో 10 వేలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని, 31 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,363కు చేరింది. గత 24 గంటల్లో 117 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్‌ సోకి ఇప్పటివరకు 339 మంది ప్రాణాలు కోల్పోయారు.

మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
అందరూ అనుకుంటున్నట్టుగానే దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. ఏప్రిల్‌ 20 వరకు కఠిన ఆంక్షలు కొనసాగుతాయని, తర్వాత పరిస్థితిని బట్టి నిర్బంధాన్ని సడలిస్తామని చెప్పారు. ప్రజలంతా సప్తసూత్రాలు పాటించాలని మోదీ సలహాయిచ్చారు.

వలస కార్మికులను పట్టించుకోరా?
లాక్‌డౌన్‌ కారణంగా కష్టాలు పడుతున్న వలస కార్మికుల కోసం ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. లాక్‌డౌన్‌తో దళితులు, ఆదివాసీల పరిస్థితి దయనీయంగా మారినా.. వారి పట్ల మోదీ సర్కారు వైఖరి మారలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. వలస కార్మికులు, రోజువారీ కూలీలు దల జీవనోపాధి, మనుగడపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాకపోవడాన్ని కాంగ్రస్ నేత చిదంబరం తప్పుబట్టారు.

ముంబైలో వలస కార్మికుల ఆందోళన
లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముంబైలో వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస జీవులు మంగళవారం బాంద్రా పశ్చిమ బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. తమ సొంతూళ్లకు పంపించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు లాఠిచార్జి చేసి వారిని చెదరగొట్టారు.

ఏపీలో మరో 34 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 34 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన 34కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వంద(109) దాటింది. కర్నూలు(91) వందకు చేరువలో ఉంది.

తెలంగాణలో కఠినంగా లాక్‌డౌన్‌
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇటలీని దాటేసిన స్పెయిన్‌
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో ఇటలీని స్పెయిన్‌ దాటేసింది. అక్కడ 1,72,541 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. మృతుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 300పైగా మరణాలు నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య 18,056కు చేరింది. కరోనా మరణాల్లో అమెరికా (23,654), ఇటలీ(20,465) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

హెచ్-1 బీ వీసాదారులకు ఊరట
హెచ్-1 బీ వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని త్వరగా అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

RELATED ARTICLES

Latest Updates