వీధుల నిండా శవాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఈక్వెడార్‌లో హృదయ విదారకం
  • ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షలు దాటిన మరణాలు
  • వైరస్‌తో ట్రంప్‌ సన్నిహితుడి మృతి

గయాక్విల్‌/న్యూయార్క్‌/బీజింగ్‌ : రోజుల తరబడి మృతదేహాలు అక్కడి ఇళ్లలో మగ్గిపోయాయి.. కొన్ని శవాలనైతే వీధుల్లోనే వదిలేశారు..! కరోనా భయంతో అంతిమ సంస్కారాలు చేయలేని దైన్యం. దీంతో సైన్యం, పోలీసులు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి దాదాపు 800 మృతదేహాలను తరలించారు. ఇదీ.. ఈక్వెడార్‌ దేశపు గయాక్విల్‌ నగరంలోని పరిస్థితి. దేశం మొత్తం మీద 7,500 పాజిటివ్‌ కేసులు నమోదైతే 4 వేలు గయాక్విల్‌వే. మరో 631 మంది ఆస్పత్రుల్లో చనిపోయారు. వైర్‌సకు తోడు డబ్బు లేకపోవడంతో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ముందుకురావడం లేదు. చివరకు ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య సోమవారంతో లక్షా 16 వేలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో తీవ్రత కొంత తగ్గినట్లే కనిపిస్తోంది. అక్కడ కొత్తగా కేసులు, మరణాలు తగ్గాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిరకాల స్నేహితుడు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం స్టాన్లీ ఐ. చెరా.. కరోనాతో మృతిచెందారు. వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో కేసుల సంఖ్య లక్షా నాలుగువేలు దాటాయి.

చైనాలో కొత్తగా 108 కేసులు
వైరస్‌ జన్మస్థానమైన చైనాలో సోమవారం 108 కేసులు నమోదవగా, ఇద్దరు చనిపోయారు. ఇరాన్‌లో తాజాగా 111 మంది మృతిచెందారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో 20 మంది వైద్యులు వైరస్‌కు గురయ్యారు. మరణాలు 93కు చేరాయి. సింగపూర్‌లో కొత్తగా 233 కేసులు తేలగా, ఇందులో 59 మంది భారతీయులున్నారు. ఇక ఇంట్లోనే ఉండండి అంటూ జపాన్‌ ప్రధాని షింజో అబె చేసిన వీడియో ట్వీట్‌ దేశ ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది. ఇందులో అబె.. కుక్కను ఆడిస్తూ, పుస్తకం చదువుతూ, టీ తాగుతూ భిన్న కోణాల్లో కనిపించారు. కరోనాపై పోరుకు రష్యా పూర్తిస్థాయిలో సిద్ధం అవుతోంది.

వూహాన్‌ నేర్పుతున్న పాఠాలు
వూహాన్‌.. కరోనా పుట్టిన ప్రాంతం. ఇప్పుడక్కడ కేసులే లేవు. దీనికి కారణం.. మాస్క్‌లు ధరించడం ఒకటైతే, ఏమాత్రం ఇన్ఫెక్షన్‌ ఛాయలున్నా రోగులను ‘హోం’ క్వారంటైన్‌కు కాకుండా ప్రత్యేక కేంద్రాలకు తరలించడం మరొకటి అని వూహాన్‌లోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడు వాన్‌ గ్జింగ్‌హువాన్‌ తెలిపారు. జిమ్‌లు, ఎగ్జిబిషన్‌ సెంటర్లు తదితర ప్రజోపయోగ స్థలాలను 16 తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చి వాడినట్లు వెల్లడించారు. మిగతా చోట్ల కూడా ఇలాగే చేయాలని ఆయన సూచిస్తున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates