మళ్లీ వచ్చిన అంబేద్కర్ జయంతి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
మాడభూషి శ్రీదర్‌

మళ్లీ అంబేద్కర్‌ జయంతి వచ్చింది. కొన్నాళ్ల తరువాత ఆయన వర్థంతి వస్తుంది. భారతజాతి ఆ మహానుభావుడిని మరిచిపోలేదు. జనం మరిచి పోలేదు. విచిత్రమేమంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏ పార్టీ ఏ వ్యక్తులు అధికారంలో ఉన్నా మరిచిపోలేదు. ఆయన భారత రత్నం. ఈ దేశ ప్రజల బతుకులకు హక్కులకు సంవిధాన కవచం తొడిగిన రాజ్యాంగ వజ్రం. రాజ్యాంగ నియమాలను రాజకీయం కోసం ఉల్లంఘించినప్పుడల్లా అంబేద్కర్‌ గుర్తొస్తూనే ఉంటాడు. ఉండాలి. అప్పుడు కూడా ఆయన్ను మరిచిపోతే, ఆ కృతఘ్నులను ఎవరూక్షమించలేరు.

రాజకీయాలకోసం రాజ్యాంగాన్ని బలిపెట్టే ప్రభువుల అధికార లాలసత్వం కోసం ప్రజలు ప్రతిసారీ నష్టపోతూనే ఉన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నీతిని, స్ఫూర్తిని మరిచిపోయే పాలకులు రాజ్యాంగ నిర్మాత జయంతిని వర్థంతిని ఘనంగా జరుపుకుంటూనే ఉంటారు. లక్షల రూపాయలు వెచ్చించి పత్రికల్లో పూర్తిపేజి ప్రకటనలు ఇస్తారు. అందులో అంబేద్కర్‌ ఫొటోకన్న గొప్పగా, అందమైన రంగుల్లో తమ ఫొటోలు కూడా వేసుకుంటారు. అంబేద్కర్‌ చెప్పిన అందమైన పాలనా సూత్రాలు, కొటేషన్లుగా ప్రచురిస్తారు. ఆయన విగ్రహాన్ని కడిగి తుడిచి పూలమాలలు వేస్తారు. కెమెరామన్‌ కటకం సదురుకునే దాకా ఆగుతారు. మంచి ఫొటోకు వీలుగా అంబేద్కర్‌ విగ్రహానికి పుష్పాభిషేకం చేస్తూ ఆయనను కాకుండా కెమెరాను చూస్తూ ఉంటారు. మరునాడు అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తూ వీడియో క్లిప్‌ అన్ని టీవీ మాధ్యమాల్లో రావడానికి, ఫొటో పత్రికల్లో బంధించడానికి చాలా చిత్తశుద్ధితో, భక్తితో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంత భక్తి? ఎవరిమీద?

ఈ పనుల బదులు నిరుడు అంబేద్కర్‌ జయంతికి ఈఏడాది జయంతికి మధ్య జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనలు అధ్యయనం చేసే కార్యక్రమాలను జరిపితే బాగుండేది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇచ్చే ఫెడరల్‌ రాజ్యాంగ మౌలిక సూత్రం భగమైంది ఈ సంవత్సరంలోనే. ఆగస్టు 2019 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రజలు కరోనా లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండానే రాజకీయ లాక్‌డౌన్‌లో ఉన్నారు, రాజ్యాంగంతోపాటు అక్కడ జనం లాక్‌అప్‌లో ఉన్నారు. ఇంట్లో ఉన్నా ఇంటర్‌ నెట్‌ కూడా బ్లాక్‌డౌన్‌గా ఉండడం వల్ల ఒంటరిగా ఉన్నారు. ఎమర్జన్సీ కాలంలో కూడా లేనంతగా ఇంత సుదీర్ఘంగా మొత్తం ఒక రాష్ట్రాన్నే నిర్బంధాల సుడిగుండంలో ఉంచిన గొప్ప రాజ్యాంగభంగ సంఘటన స్వతంత్ర భారత చరిత్రలో లేదు. రాజ్యాంగ అభిమానులు, ప్రజాస్వామ్య ప్రియులు చింతించవలసిన రాజ్యాంగ నేరం ఇది. ఈ నేరానికి శిక్షలు ఉండవు. రాజ్యాంగం భారతీయ శిక్షాస్మతి కాదు. పోలీసులు క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టులు చేయజాలరు.

రాజ్యాంగంలో ప్రధాన భాగాలను సవరించాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండువంతుల ఆధిక్యత ఉండాలని, ఆ తరువాత సగం రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలని రాజ్యాంగ సవరణ నియమాలు నిర్దేశించాయి. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికిల్‌ 367ను సవరించిన ఘనత ప్రస్తుత భారత ప్రభుత్వానిదే. ఈ అనైతిక అసంవిధానిక కార్యక్రమాన్ని సవాలు చేస్తే ఇప్పడివరకు భారత సర్వోన్నత న్యాయస్థానానికి విచారణ జరిపే తీరిక లేదు. ఇది రాజ్యాంగానికి పెను సవాలు అని తెలుసుకుని ఈ విషయాన్ని అందరికన్నా ముందు వినాలనే అవసరం వారికి కనిపించలేదు. ఆశ్చర్యకరం. ఇచ్చిన తీర్పుల గురించి ఇదివరకు ఇంతవరకు విమర్శించేవారం. కానీ ఇప్పుడు తీర్పులు ఇవ్వకుండా కట్టగట్టి మూల పారేసిన విషయం అంబేద్కర్‌ జయంతి నాడు మాట్లాడుకోవలసి రావడం ఒక విచారకర సన్నివేశం.

రాజద్రోహాలు

అన్నింటికన్న దారుణమైన రాజ్యాంగ ఉల్లంఘన ప్రజల వాక్‌ స్వాతంత్య్రాన్ని అడుగడుగునా దెబ్బ తీయడం. సోషల్‌ మీడియాలో, పత్రికలలో టీవీ చానెల్‌లో ప్రసంగాల్లో ప్రభుత్వ విధానాలను విమర్శించిన ప్రతి వ్యక్తి మీద దాడులు, ఉద్యోగం నుంచి తొలగించే వత్తిడులు, అరెస్టులు, రాజద్రోహం కేసులు పెట్టడం బాగా పెరిగిన సంవత్సరం ఇది. వందల కోట్ల రూపాయల పరువు నష్టం కేసులు, క్రిమినల్‌ పరువు నష్టం పేరుమీద కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ నాయకులను పాత్రికేయులను ప్రాసిక్యూట్‌ చేయడం ఈ సంవత్సరం జరిగిన దారుణాలు. ద వైర్‌ డాట్‌ ఇన్‌ సంపాదకుడు అంతర్జాల వేదికపైన చేసిన విమర్శలమీద ఏప్రిల్‌ 11న ప్రాసిక్యూషన్‌ ప్రారంభించడం తాజా ఉదాహరణ.

మణిపూర్‌కు చెందిన ఒక పీహెచ్‌డీ స్కాలర్‌ ఏడాది కిందట పనగల్స్‌ (ముస్లింలను ఈశాన్య రాష్ట్రంలో ఈ పేరుతో పిలుస్తారు) బాధితులు పేరుతో ఒక వ్యాసం రాసినందుకు పోలీసులు తమంత తామే ఎవరి ఫిర్యాదే లేకపోయినా ఏప్రిల్‌ 11న రాజద్రోహం కేసు నమోదు చేయడం మరొక తాజా ఉదాహరణ. ఆయన పాత వ్యాసం స్థానిక భాషలోకి అనువదించి ప్రచురించిన వెంటనే పోలీసులు కేసుపెట్టారు. ఈ కేసులో రాజద్రోహుల జాబితాలో పత్రికల ప్రచురణ కర్తలను కూడా చేర్చడం మరిచిపోయి ఉంటారు. రాసిన వాడు వేసిన వాడు చూసిన వాడు కూడా రాజద్రోహులే అంటే ఓ పనైపోతుంది. ఇక ఎవడూ విమర్శించడానికి కూడా సాహసించడు.

మరో తాజా రాజద్రోహం కథ కూడా ఉంది. ఉత్తరాఖండ్‌లో ఒక కార్మిక నాయకుడు వాట్సప్‌లో పోలీసులను విమర్శించినందుకు ఏప్రిల్‌ 12న రాజద్రోహం కేసు పెట్టారు. అతను జిబిపంత్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక పంప్‌ ఆపరేటర్‌. అతని నేరం ఏమంటే ఒక వాట్సప్‌ మెసేజ్‌లో ప్రభుత్వాన్ని విమర్శించడమే. అది ప్రభుత్వానికి దేశానికి పరువునష్టకరంగా ఉంది కనుక రాజద్రోహం కేసు పెట్టాం అని అక్కడి పోలీసు అధికారి వ్యవహరించారు. ఆ అధికారి మాటలు నిజమే అనుకున్నా అతని మీద గరిష్టం పరువు నష్టం కేసు పెట్టాలి కాని రాజద్రోహ నేరం ఎలా మోపుతారు? ఈ పంపు ఆపరేటర్‌ ఇంకా ఏం చేస్తున్నాడో కూడా దర్యాప్తు చేస్తాం అని పోలీసు అధికారి అన్నారట. బ్రిటిష్‌ తెల్లదొరలు పోయిన తరువాత భారతీయ పెట్టుబడి దారులు నల్ల బ్రిటిషర్ల వలె వ్యవహరిస్తూ పోలీసులను అదే విధంగా వినియోగిస్తున్నారు అని ఆ మెసేజ్‌లో ఉందని ఎఫ్‌ఐఆర్‌లో రాసుకున్నారు. పెట్టుబడి దారులను విమర్శించడం రాజద్రోహమైతే, పెట్టుబడిదారులే రాజులనుకోవాలా మరి? బ్రిటిష్‌ కాలం నాటి పీనల్‌ కోడ్‌, ప్రొసీజరల్‌ కోడ్‌ వాడుతున్నారని కూడా ఆయన విమర్శించాడట. మరి మన హౌం మంత్రి కూడా కొత్త పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ బ్రిటిష్‌ పాలనను రక్షించడానికి తెచ్చుకున్న ఐపీసీ, సీఆర్‌పీసీలలో ప్రస్తుతం ప్రజల సంక్షేమాన్ని కాపాడుకునే లక్ష్యం ప్రతిబించేట్టుగా ఉండాలని సెలవిచ్చారు. ఓ పోలీసు అధికారి కూడా ఆ తరువాత ప్రసంగిస్తూ పోలీసు చట్టం 1861 ప్రజలను అణచివేయడానికే తెచ్చారన్నారు. ఇలా ఏం మాట్లాడినా రాజద్రోహులవుతారా? చివరకు బీదర్‌లో స్కూల్‌ పిల్లలు చిన్న స్కిట్‌ (నాటకం) వేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని పౌరసత్వం చట్టం సవరణ విషయంలో విమర్శించినందుకు, స్కూల్‌ యాజమాన్యం మీద, టీచర్లు, పేరెంట్ల మీద రాజద్రోహం కేసు పెట్టి, పిల్లలను పోలీసులు ఇంటరాగేషన్‌ చేసిన ఘనత కూడా మన వారిదే. అంబేద్కర్‌ ఈ దారుణాలు చూసి ఉంటే ఏమయ్యేవాడో.

వ్యక్తులకు భక్తులా?
అంబేద్కర్‌ రాజ్యాంగ రచన పూర్తయిన తరువాత నవంబర్‌ 25, 1949న రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు. ”మీరంతా ఏకచ్ఛత్రాధిపత్యపు వ్యాకరణాన్ని వదులుకోండి, అధికారంలో ఉన్న వ్యక్తులకు భక్తులుగా మారకండి, రాజకీయ పార్టీలు, ఎన్నికలకే పరిమితమైన ప్రజాస్వామ్యం కోసం కాదు, జనసమాజం కోసం పనిచేయండి”.

”మనదేశానికి స్వాతంత్య్రం వచ్చింది 26 జనవరి 1950నాడు అంటే అంతకు ముందెన్నడూ స్వతంత్రం లేదని కాదు. మనకున్న స్వతంత్రాన్ని మనం కోల్పోయాం. మళ్లీ మనం స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటామా లేక కోల్పోతామా అని నా భయం. రెండో సారి కూడా కోల్పోతామా? ఈ ఆలోచన నాలో భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనను కలిగిస్తున్నది. మనం స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి కారణం మన వారి ద్రోహచింతన, అవినీతి కనుక ఇంకా తీవ్రంగా ఆందోళన కలుగుతున్నది” అని అంబేద్కర్‌ బాధ పడ్డారు.

చారిత్రిక ద్రోహాల సంఘటలను ఆయన ఉటంకించారు. ”సింధు పైన మహ్మద్‌ బిన్‌ కాసిం దాడి చేసినప్పుడు దాహర్‌ రాజు సైనిక కమాండర్లు కాసిం ఏజెంట్ల దగ్గర లంచాలు తీసుకుని రాజు పక్షాన నిలబడి పోరాడడానికి నిరాకరించారు. మహ్మద్‌ ఘోరీని భారత్‌ను ఆక్రమించుకోవడానికి రమ్మని ఆహ్వానించింది జయచంద్‌. మహావీరుడు పృథ్వ్వీరాజును ఓడించడానికి ఘోరీకి తాను పూర్తిగా సాయం చేస్తాననీ, అంతే కాకుండా సోలాంకి రాజుల మద్దతు కూడా సంపాదించి పెడతానని హామీ ఇచ్చి యుద్ధానికి రమ్మని ఘోరీకి చెబుతాడా దేశద్రోహి. హిందూ రాజుల స్వాతంత్య్రం కోసం ఛత్రపది శివాజీ ప్రాణాలకు తెగించి కత్తి పట్టి పోరాడుతూ ఉంటే, ఆనాటి మరాఠా రాజోత్తములు, రాజపుత్ర రాజులు మొఘల్‌ చక్రవర్తి పక్షాన నిలబడి పోరు చేశారు. సిక్కు పాలకులను నాశనం చేయడానికి బ్రిటిష్‌ సైన్యాలు ఆక్రమణలు చేస్తూ ఉంటే, గులాబ్‌ సింగ్‌ అనే ద్రోహి ముఖ్య సేనానాయకుడై ఉండికూడా మౌనంగా కూర్చుని యుద్ధం చేయకుండా తమ సిక్కురాజ్యం నాశనం కావడానికి దోహదం చేసాడు. 1857లో సువిశాలమైన భారత భూభాగంలో లక్షలాది మంది బ్రిటిష్‌ పాలనమీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, సిక్కులు నిశ్శబ్దంగా నిలబడి తమాషా చూస్తూ ఊండి పోయారు. ఈ చరిత్ర పునరావృతమవుతుందా? ఈ ఆలోచనే నాకు ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఆందోళన నానాటికి తీవ్రమవుతున్నది. ఎందుకంటే మనకు ఇప్పడికే జాతి, కులాలనే భయంకరమైన అంతఃశత్రువులకు తోడు మతపరమైన తెగలుగా కూడా విడిపోతున్నాం. కులానికి మతవిశ్వాసాలకు, రాజకీయ పార్టీకి అతీతంగా మనదేశాన్ని సమున్నతంగా నిలబెట్టి రక్షించుకోడానికి మన భారతీయులు సిద్ధంగా ఉన్నారా? నాకు తెలియదు. కాని ఒక్కటి మాత్రం నిజం. రాజకీయ పార్టీలు కనుక మన దేశానికన్న మత విశ్వాసానికే ఎక్కువ విలువ ఇస్తే మన స్వాతంత్య్రం మళ్లీ ప్రమాదంలో పడుతుంది. రెండో సారి స్వాతంత్య్రం కోల్పోతే మళ్లీ రాదు. శాశ్వతంగా పోతుంది. ఈ ప్రమాదం నుంచి మనం దేశాన్ని కాపాడుకోవడానికి కంకణ బద్ధులం కావాలి. చివరి నెత్తురు బొట్టు రాల్చయినా సరే మన స్వాతంత్య్రాన్ని రక్షించేందుకు దృఢసంకల్పంతో వ్యవహరించాలి” అని అంబేడ్కర్‌ మదన పడ్డారు. 1949లోనే ఆయన అంత బాధపడితే, ఈనాడు పరిస్థితులు చూస్తూ ఏమైపోయేవారో అనిపించడం లేదూ. మనం రాజద్రోహాలగురించి ఆందోళన పడుతున్నాం. కాని రాజ్యాంగద్రోహాల గురించి దేశద్రోహాల గురించి ప్రజాద్రోహాల గురించి పట్టించుకుంటున్నామా? ఇవే అంబేడ్కర్‌ నాడు మనకు వేసిన మెదళ్లను తొలిచే ప్రశ్నలు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates