శ్రామికుల జీవనాధారం లాక్ డౌన్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Prof. Sujatha Surepally

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్ ద్వారా ప్రబలే కోవిడ్-19 ని అంటువ్యాధిగా ప్రకటించిన వెంటనే మన ప్రభుత్వం మరో సర్జికల్ స్ట్రైక్ కి తెర తీసింది. పేదలు,అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఏవిధంగా బ్రతకగలరనే ఆలోచనే చేయకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది.

దేశ విభజన నాటి పరిస్థితులు మరోసారి కళ్లముందు కదలాడాయి. టీవీ తెరల నిండా స్వంత ఇళ్లు కూడా లేని కార్మికులు తమ ఊళ్లకి,పట్టణాలకి చేరుకోవడానికి వందలాది కిలోమీటర్లు కాలినడకనే బయలుదేరుతున్న దృశ్యాలే కనిపించాయి. తమ ఆప్తుల దగ్గరికి చేరుకోవడానికి,కుటుంబాలని కలిసి అంతో,ఇంతో భద్రత దొరికిందని కుదుటపడదామనే ఆశతో బయలుదేరిన ఈ బాటసారులందర్నీ లెక్కలేనన్ని లక్ష్మణరేఖల(పోలీసు చెక్ పోస్టులు) దగ్గర ఆపారు. వారున్న పరిస్థితుల్లో అవి దాటుకుని వెళుతున్నామనే స్పృహ కూడా వారికి లేదు. ప్రభుత్వం 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్(విపత్తు నిర్వహణా చట్టం),బ్రిటిష్ కాలం నాటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్(అంటువ్యాధుల చట్టం) లని ప్రయోగించింది. ఆకలికి తాళలేక,కిలోమీటర్ల దూరం నడవడం వల్ల అలసిన శరీరాలతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

ఇండియాలో 240 మిలియన్లకి పైగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. రెండు మిలియన్ల వరకూ నిరాశ్రయులు ఉన్నారు. మన పాలకులు ముందస్తు ఆలోచన లేకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయం (డీమానిటైజేషన్,ఆర్టికల్ 370 రద్దు లాగానే) వల్ల ఇప్పుడు కరోనా వైరస్ కన్నా పెద్ద సంక్షోభం ఏర్పడింది.

ఐనప్పటికీ ప్రధానమంత్రి ఏప్రిల్ 5 న కరోనా వైరస్ ని తరిమికొట్టాలనే ఉద్దేశ్యంతో మినీ దివాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయానికే వైరస్ ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మందికి సంక్రమించగా,68,000 ప్రాణాల్ని కూడా బలితీసుకుంది.

రబీ పంట కోతలకి వచ్చిన సమయానికి కార్మికులందరూ ఇళ్లకి బయల్దేరడంతో ఆకలి భయం,కరువు భయం ముంచుకు వచ్చేలా ఉంది. యాజమానులు కూడా వారి తప్పేం లేకపోవడంతో కార్మికులకి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఎగవేశారు. కార్మికులు తమకి డబ్బులు చెల్లించేలా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఐతే ఈ వారం సుప్రీంకోర్టు అధికారులే వారికి ఆహారం అందిస్తుండగా ఇంక కూలీ డబ్బుల అవసరం ఏముందని ప్రశ్నించింది.

లాక్ డౌన్ కి సంబంధించి కులపరమైన అంశాలు ఈ సందర్భంగా ముందుకొచ్చాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల్లో చాలామంది ముస్లింలు,దళితులు,ఆదివాసీలు లాంటి వెనుకబడిన కులాలకి,సామాజిక వర్గాలకి చెందినవారే. సామాజిక దూరం అనే పదప్రయోగం కులపరమైన విభజనలు మరింత పెరగడమే కాక,మనుధర్మంలో భాగమైన అంటరానితనాన్ని తలపించే విధంగా ఉంది. బ్రాహ్మణీయ ఉన్నత వర్గాలు సామాజిక మాధ్యమాల్లో ఈ పదప్రయోగాన్ని సమర్థించాయి.

ప్రధానమంత్రి తను ఎన్నుకునే పదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా?. ప్రత్యేకించి భౌతిక దూరం అనే పదం ప్రజా క్షేత్రంలో బాగా వాడుకలో ఉన్నది కదా?. కానీ ఆయనేమో యోగా ఫిట్నెస్ మంత్రాలు ట్వీట్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

దేశవ్యాప్త లాక్ డౌన్ 130 కోట్ల భారతీయుల్లో ఉన్న సంపన్నులనీ,ఉన్నత వర్గాలనీ గందరగోళంలోకి నెట్టింది. కంటికి కనిపించని కరోనా వైరస్ లాగే ప్రభుత్వాలు కూడా కనిపించకుండా పోయాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు,సిబ్బంది వలసదారులకి ఆశ్రయం కల్పించి,ఆహార సామాగ్రి అందించడానికి ప్రయత్నించారు.

ప్రభుత్వం ముందుగా ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ ఏ మూలకీ సరిపోయేలా లేదు. కొత్తగా ప్రభుత్వం ప్రకటించబోయే ప్యాకేజీలు కూడా ఇలాంటి ఫలితాలనే ఇవ్వొద్దని మాత్రమే మనం కోరుకోగలం.

వైరస్ సంక్రమణని అరికట్టడానికి ముందుగానే లాక్ డౌన్ ని ప్రకటించిన ప్రభుత్వానికి మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంత బలహీనమైనదనే విషయంపై పూర్తి అవగాహన ఉంది. ప్రత్యేకించి వ్యాధి మూడో దశకి చేరి సామాజిక వ్యాప్తి జరిగితే గ్రామీణ,చిన్న పట్టణ ప్రాంతాలు ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేవు. ఇండియా తన జిడిపి నుంచి కేవలం 1.15 శాతం మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయిస్తోంది. 9.6శాతం కేటాయించే బ్రిటన్,18 శాతం కేటాయించే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలే కరోనా వైరస్ ధాటికి అతలాకుతలం అవుతున్నాయి.

కానీ పేద వాళ్ల జీవితాలలో జబ్బులూ,చావులూ,కష్టాలూ సర్వసాధారణమే.కాబట్టి లాక్ డౌన్ కి ముందు 45 రోజుల్లో విదేశాల నుంచి తిరిగొచ్చిన 15 లక్షల మంది నుంచి వారంతట వారే దూరం జరిగారు. ఈ విదేశాల నుంచి వచ్చిన వారిని కనుగొని,పరీక్షలు చేసి,చికిత్స అందించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. వీరి విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరినీ,బరేలీ అధికారవర్గం కాలినడకన ఇళ్లకి బయల్దేరిన వలసదారులతో ప్రవర్తించిన వైఖరినీ ఒకసారి పోల్చి చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి అర్థమౌతుంది.

పోలీసులూ,రాష్ట్ర ప్రభుత్వ వర్గాలూ చెబుతున్నట్టు వీరంతా తమతో పాటూ వైరస్ ని మోసుకొచ్చారా?. 3,115 క్వారంటైన్ కేంద్రాల్లో,కుటుంబాలతో నివసిస్తోన్న సుమారు 1.8 లక్షల వలసదారులకి బీహార్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి,వారెవరికీ పాజిటివ్ రిజల్ట్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. మరి వలస కూలీలు వైరస్ ని జయించినట్టేనా?. మనకి త్వరలో తెలుస్తుంది.

ఈ మొత్తం వ్యవహారంలో ఇండియా,ప్రభుత్వం నేర్చుకున్న గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా?. ఈ విషయంపై నిపుణులేం చెబుతున్నారో ఓసారి పరిశీలిద్దాం. ఆర్థికవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వెంటనే రిజర్వ్ బ్యాంక్ కల్పించుకుని వ్యవస్థలో పెద్దమొత్తంలో డబ్బుని చేర్చాల్సిందిగానూ,అందరికీ సంక్షేమ పథకాలకి సంబంధించిన రాయితీలని సరాసరి బ్యాంకు ఖాతాలకే చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో ఆర్థికవేత్త ఎస్థర్ డుఫ్లో,బెనర్జీ ఇద్దరూ కూడా జీవనాధారం కంటే జీవితాలు ముఖ్యమని వాదిస్తున్న ప్రభుత్వం,మేధావుల వాదనని తప్పుపడుతూ జీవనాధారం కోల్పోయిన వారే కరోనా వైరస్ వల్ల అందరికంటే ఎక్కువ ప్రభావితం అవుతారని తెలియజేసింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్,కాంగ్రెస్ పార్టీ కూడా రాబోతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి తక్షణమే డబ్బు ముద్రణ,ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు బదిలీలు చేపట్టాలని సూచించాయి.

మరోసారి వలస కార్మికుల సమస్యలపై గనక దృష్టి సారిస్తే దేశ వ్యాప్తంగా పెద్ద పట్టణాలు,రాజధానుల్లో ఉచిత భోజన సదుపాయాలని వారు తిరస్కరిస్తున్నారు. గతంలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన భూస్వామ్య వ్యవస్థని వారికిది గుర్తుచేస్తోంది. భోజనానికి బదులుగా తమ ఇళ్లకి చేరుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనీ,అలాగే జీవనాధారం కోల్పోయినందుకు గానూ ఆర్థిక తిరోగమనం వల్ల అంతటా నెలకొన్న గందరగోళంలో కనీసం కొంతకాలమైనా ఎలాంటి బాధలూ లేకుండా బ్రతకడానికి ఎంతో కొంత డబ్బు అందజేయాలని మాత్రమే వారు కోరుతున్నారు. ఆ డబ్బే శ్రామిక వర్గాల ప్రజలకి అలవాటైన కష్టించే తత్వం,పట్టుదలతో వారి తదుపరి జీవితాల్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా,కుదిరితే వారు మళ్లీ సాధారణ జీవితాలు గడిపేందుకు చేసే ప్రయత్నాల్లో ఎంతో కొంత తోడ్పాటుని అందించొచ్చు.

RELATED ARTICLES

Latest Updates